సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఓ సైకో.. సౌదీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-13T02:16:53+05:30 IST

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS)పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఓ సైకో.. సౌదీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్  సల్మాన్ (MBS)పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రౌన్ ప్రిన్స్ సల్మాన్‌ (Mohammed bin Salman)ను సైకో (Psychopath)గా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సౌదీ అరేబియాను సందర్శించడానికి కొద్ది రోజుల ముందు ఆయనీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సౌదీ ఇంటెలిజెన్స్‌లో ఒకప్పుడు నంబర్ 2 స్థానంలో సాద్ అల్జాబ్రి (Saad Aljabri) ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు,  అపార సంపద కారణంగా అమెరికా సహా ప్రపంచంలోని ఇతర దేశాలకు ప్రిన్స్ ఎంబీఎస్ ముప్పుగా పరిణమించాడన్నారు. 


క్రౌన్ ప్రిన్స్ అనంతమైన వనరులు కలిగిన ఒక కిల్లర్ అని సాద్ పేర్కొన్నారు. అంతేకాదు, కిడ్నాపులు, హత్యల కోసం ‘టైగర్ స్క్వాడ్’ పేరుతో ఓ దుర్మార్గపు ముఠాను కూడా నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. అయనలో దయాదాక్షిణ్యాలు ఏమాత్రమూ లేవన్నారు. భావోద్వేగాలు ఏ కోశానా లేని కఠినాత్ముడని పేర్కొన్న సాద్.. గత అనుభవాల నుంచి అతడు ఏమాత్రం నేర్చుకోలేదన్నారు. ఆయన హత్యలకు, దురాగతాలకు తామే సాక్షులమని పేర్కొన్నారు. 


మహ్మద్ బిన్ నయేఫ్‌కు అల్జాబ్రి దీర్ఘకాలం పాటు సలహాదారుగా ఉన్నారు. జూన్ 2017లో ఆయనను పీఠం నుంచి దించేసి ఆయన స్థానాన్ని మహ్మద్ బిన్ సల్మాన్ భర్తీ చేశారు. దీంతో భయపడిన అల్జాబ్రి తన ప్రాణాలకు ముప్పు ఉందన్న భయంతో కెనడాకు పారిపోయారు. ఇప్పుడక్కడ ఆయన ప్రవాస జీవితం గడుపుతున్నారు. 


 ఇస్తాంబుల్‌లో సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన రెండు వారాల తర్వాత 2018లో టొరంటోలో తనను చంపేందుకు ఎంబీఎస్ తన కిరాతక ముఠాను పంపారని ఆరోపిస్తూ 2020లో అల్జాబ్రి.. సౌదీ క్రౌన్ ప్రిన్స్‌పై వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసు వేశారు. ఆయన తనను ఏదో ఒకరోజు చంపేయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేసిన ఈ మాజీ గూఢచారి.. సౌదీ ప్రభుత్వం, రాజ కుటుంబానికి చెందిన సున్నితమైన సమాచారం తన వద్ద ఉండడమే అందుకు కారణమని అన్నారు. ‘‘నా హత్యను కళ్ల జూసే వరకు ఆయన నిద్రపోరు’’ అని అల్జాబ్రి పేర్కొన్నారు. 


అల్జాబ్రి సంచలన ఆరోపణలపై అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం స్పందించింది. అల్జాబ్రి తన ఆర్థిక నేరాలను దాచిపెట్టేందుకు కల్పిత కథలు చెబుతున్నారని, ఈ విషయంలో ఆయనో సుదీర్ఘ చరిత్ర ఉందని పేర్కొంది. ఆయనో అపఖ్యాతి పాలైన మాజీ ప్రభుత్వ అధికారని విమర్శించింది. దోచుకోవడం అప్పుడు ఆమోదయోగ్యమేమో కానీ, ఇప్పుడు కాదని, అప్పుడు చట్టబద్ధమేమో కానీ, ఇప్పుడు కాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

Updated Date - 2022-07-13T02:16:53+05:30 IST