పగబట్టిన వరుణుడు

ABN , First Publish Date - 2021-10-18T06:21:39+05:30 IST

జిల్లా రైతాంగంపై వరుణుడు పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్‌ ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను.. శని, ఆదివారాలలో కురిసిన అకాల వర్షం మరింత నష్టాల్లోకి నెట్టింది.

పగబట్టిన వరుణుడు
కొత్తపేటలో నీట మునిగిన వరి పంట, బర్దిపూర్‌ శివారులో నీట మునిగిన పంటను చూపుతున్న రైతు

జిల్లాలో అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, సోయా పంటలు

పలు గ్రామాలలో తడిసిన ఆరబోసిన ధాన్యం

తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్‌

త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వేడుకోలు

నిజామాబాద్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా రైతాంగంపై వరుణుడు పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్‌ ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను.. శని, ఆదివారాలలో కురిసిన అకాల వర్షం మరింత నష్టాల్లోకి నెట్టింది. చేతికి వచ్చే సమయంలో వరి, సోయా, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయి. పలు గ్రామాల్లో నూర్పిడిచేసి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఇదే అదునుగా వ్యాపారులు తడిసిన ధాన్యాన్ని ధర తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.  

జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. శనివారం మధ్యాహ్నం మొదలైన వర్షం ఆదివారం ఉదయం వరకు కురిసింది. జిల్లా వ్యాప్తంగా 32.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రెంజల్‌ మండలంలో 64.9 మి.మీ. వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లాలో ఈ అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో బోధన్‌, నవీపేట, ఎడపల్లి, వర్ని, మోస్రా, చందూరు, కోటగిరి, రుద్రూరు, మోపాల్‌, రెంజల్‌, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి మండలాల పరిధిలో వరి పంట దెబ్బతిన్నది. బాల్కొండ మండలంలో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. నూర్పిళ్లు చేసి రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న, సోయా పంటలు తడిసి ముద్దయ్యాయి. బోధన్‌ మండలంలో వందలాది ఎకరాలలో వరి, సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎరాజ్‌పల్లిలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆదివారం డీసీసీబీ డైరెక్టర్‌ గిర్ధావర్‌ గంగారెడ్డి పరిశీలించారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కోటగిరి మండలంలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. వరితో పాటు సోయా పంటను కోసి ఆరబెట్టగా వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రూరు మండలంలోనూ అకాల వర్షానికి వందలాది ఎకరాలలో వరిపంట నేలకొరిగింది. అకాల వర్షంతో వరిపంటకు అపార నష్టం వాటిల్లింది. డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం, బర్దిపూర్‌, ఆరెపల్లి, మెంట్రాజ్‌పల్లి, అమృతాపూర్‌ గ్రామాల్లో అకాల వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల పరిధిలో కోతకు వచ్చిన పంట నేలవాలడంతో ధాన్యం గింజలు రాలి పోయాయి. రైతులు పండుగ తర్వాత కోతలు మొదలు పెడదామని చూడగా ఈలోపే అకాలవర్షం కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ మండలాల పరిధిలో చాలా గ్రామాలలో నూర్పిడి చేసి కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతుండంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలతో భారీ వరదల వచ్చి ఇప్పటికే వేలాది ఎకరాలలో పంట దెబ్బతినగా.. శని, ఆదివారాలలో కురిసిన వర్షంతో మరింత నష్టం వాటిల్లింది. దీంతో వర్షాలు ఇలాగే కురిసి రైతులు మరింత నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలుచేయాలని వారు కో రుతున్నారు.

ఈయేడు 5.24లక్షల ఎకరాలలో సాగైన పంటలు

జిల్లాలో ఈ వానాకాలంలో 5 లక్షల 24 వేల ఎకరాలకుపైగా పంటలు సాగయ్యాయి. ఇందులో 3లక్షల 93 వేల ఎకరాలలో వరి సాగైంది. జిల్లాలో అత్యధికంగా వరి పంటనే రైతులు సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా కురవడం, భూగర్భజలాలు అందుబాటులో ఉండడంతో వరిని ఎక్కువగా సాగుచేశారు. జిల్లాలో గంగా కావేరి, బీపీటీ, సోన, దొడ్డు రకానికి చెందిన 1010తో పాటు ఇతర రకాలను వేశారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో వరి సాగును ముందే మొదలుపెట్టగా.. పదిహేను రోజులుగా రైతులు పంటను కోస్తున్నారు. వెంట వెంటనే వ్యాపారులకు క్వింటాలు రూ.1,550 నుంచి రూ.1,650 మధ్య విక్రయిస్తున్నారు. జిల్లాలో ప్రతీ సంవత్సరం వరి సాగును ముందుగా చేసే ఈ డివిజన్‌ రైతులు కొనుగోలు కేంద్రాల కన్నా బయటనే ఎక్కువగా విక్రయిస్తున్నారు. పొలాల్లోనే వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభం?

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం కొనుగోళ్లకు ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని క్వింటాలు రూ.1,960కి, సాధారణ రకాన్ని క్వింటాలు రూ.1,940కి కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 428 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, వాహనాలను సిద్ధం చేశారు. సర్వే నెంబర్ల అధారంగా ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. వ్యవసాయ అధికారులు ఇచ్చే ధ్రువీకరణపత్రం అధారంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. 

కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు

జిల్లాలో ఏర్పాటు చేయబోయే అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. ధాన్యం తూర్పారపట్టే మిషన్లతో పాటు తేమ శాతాన్ని గుర్తించే పరికరాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. గత సంవత్సరం మాదిరిగానే వాహనాల కొరత ఏర్పడకుండా ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఇచ్చే ట్రక్‌షీట్ల ఆధారంగానే రైతులకు డబ్బులు చెల్లించను న్నారు. ధాన్యం సేకరణలో ప్రతీ సీజన్‌లో ఎదురయ్యే కడ్తా సమస్యకు ఈ దఫా చెక్‌ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున జిల్లాలో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు వెంకటేశ్వర్‌ రావు, అభిషేక్‌ సింగ్‌ తెలిపారు. పంట చేతికి వచ్చే గ్రామాల్లో మొదట ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు నిర్ణీ త సమయంలో రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని వారు పేర్కొన్నారు.  

అకాల వర్షానికి వరి నీటి పాలైంది..

-చుక్కెల కృష్ణ, కొత్తపేట

వరి కోతకు వచ్చింది. రెండు రోజుల్లో కోద్దామని ఏర్పాట్లు చేసుకున్నాం. అకాల వర్షం రావడం వల్ల పంట నేల కొరిగింది. ధాన్యం నేల రాలింది. పంట పొలంలోకి నీళ్లు చేరడంతో తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రభుత్వమే చొరవ తీసుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

తడిసిన ధాన్యాన్ని కొనడం లేదు..

- అన్నం సాయిలు, మల్లారం

నూర్పిడిచేసి.. ఆరబోసిన ధాన్యం అకాలవర్షానికి తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. వచ్చిన వారు తక్కువ ధరకు అడుగుతున్నారు. ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి తడిసిన ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేయాలి.

Updated Date - 2021-10-18T06:21:39+05:30 IST