భువనేశ్వర్: నీటిపారుదల శాఖ కాల్వలో 10 అడుగుల మొసలి ప్రత్యక్షమవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. కేంద్రపారాలోని పంటకాల్వలో పది అడుగుల పొడవు ఉన్న మొసలి కనిపించడంతో రైతులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు వచ్చి ఇరిగేషన్ కాల్వలో నుంచి మొసలిని కాపాడారు. భితార్కానికా జాతీయ ఉద్యానవనం నుంచి పద్మనాభపూర్ గ్రామంలోని ఇరిగేషన్ కాల్వలోకి మొసలి చొరబడిందని అటవీశాఖ అధికారి చెప్పారు. గత నెల 20వతేదీన వెక్టకోల గ్రామంలోని చెరువులోకి మొసలి వచ్చింది. దాన్ని పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది నదిలో వదిలారు.
వర్షాకాలంలో మొసళ్లు ఎక్కువగా నదులు, కాల్వల్లోకి వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్ నగర్ అటవీవిభాగం అధికారి జేడీ పాటి సూచించారు. నదుల్లో స్నానఘట్టాల వద్ద వెదురు బారికేడ్లతో కప్పి, స్నానం చేసే ప్రజలు మొసళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకున్నామని అటవీశాఖ అధికారులు చెప్పారు.ఒడిశాలో 1975లో 96 ఉన్నమొసళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీశాఖ అధికారులు చెప్పారు.