మీ సేవా కేంద్రం చోరీ కేసులో అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-28T17:41:40+05:30 IST

దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీ చౌరస్తాలోని మీ సేవా కేంద్రంలో జరిగిన చోరీ కేసును సరూర్‌నగర్‌ పోలీసుల సహకారంతో ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు చేదించారు. అంతర్రాష్ట్ర

మీ సేవా కేంద్రం చోరీ కేసులో అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్టు

 రూ.1,11,240 స్వాధీనం

హైదరాబాద్/కొత్తపేట: దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీ చౌరస్తాలోని మీ సేవా కేంద్రంలో జరిగిన చోరీ కేసును సరూర్‌నగర్‌ పోలీసుల సహకారంతో ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు చేదించారు. అంతర్రాష్ట్ర  నేరస్థుడిని అరెస్టు చేసి, రూ 1,11,240 స్వాధీనం చేసుకున్నారు. సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి క్రైమ్‌ డీసీపీ యాదగిరి వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన అంబటి చక్రవర్తి (32) జల్సాలకు బానిసై ఆ జిల్లాలోని పిడుగురాళ్ల, నర్సరావుపేట, దుర్గి, క్రోసూరు, పాత గుంటూరు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడి జైలుకెళ్లాడు. అతడిపై గుంటూరు జిల్లాలో 17 కేసులు, తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పీఎ్‌సలో రెండు, సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక కేసు నమోదైంది.


అతడు పగలు కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి దొంగతనం చేసేవాడు. ఆరు నెలల క్రితం అతడు హైదరాబాద్‌కు మకాం మార్చి దిల్‌సుఖ్‌నగర్‌, పీ అండ్‌ టీ కాలనీలో ఉంటూ సరూర్‌నగర్‌ స్టీల్‌ బజార్‌లో వర్కర్‌గా చేరాడు. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి పీ అండ్‌ టీ కాలనీలో తాను అద్దెకుంటున్న ఇంటి సమీపంలోని  మీ సేవా కేంద్రంలో చోరీ చేశాడు. గది వెనుక కిటికీ గ్రిల్‌ తొలగించి లోనికి ప్రవేశించి అల్మారాలోని రూ.1,30,000 నగదు ఎత్తుకెళ్లాడు. సదరు కేంద్రం యజమాని బైర శంకర్‌ ఫిర్యాదుతో ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు, సరూర్‌నగర్‌ డిటెక్టివ్‌ పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పీ అండ్‌ టీ కాలనీ చౌరస్తాలో గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అంబటి చక్రవర్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడ్ని కస్టడీకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తామని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. సమావేశంలో క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ ఎం.శ్రీనివాసులు, ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, ఏ.వీ.రంగా, దేవేందర్‌, సరూర్‌నరగ్‌ ఎస్‌హెచ్‌ఓ సీతారాం, డీఐ ఎస్‌.రవిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T17:41:40+05:30 IST