Abn logo
Mar 4 2021 @ 00:41AM

నేరం–న్యాయం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే ఇటీవల ఒక పోక్సో కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు, ఆమెను పెళ్ళిచేసుకుంటావా? అంటూ న్యాయమూర్తి అతడిని ప్రశ్నించారు. ఇది ప్రశ్నమాత్రమేనని న్యాయమూర్తి సమర్థించుకున్నా, బాధితురాలిని పెళ్ళిచేసుకుంటావా అంటూ అత్యాచారం చేసిన వ్యక్తినే అడగడం, ఆ ప్రశ్న దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి వినబడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఉపరితలంలో అది ప్రశ్నగానే కనిపించినా సమాజంపై దాని ప్రభావం, విస్తృతి అధికమనీ, అది ఇచ్చే తప్పుడు సందేశం ప్రమాదకరమైనదని పలువురి వాదన. తనకు బెయిల్‌ దక్కకపోతే జైలుకు పోవలసివస్తుందనీ, అప్పుడు ఉద్యోగం కోల్పోతానని నిందితుడు అనడంతో న్యాయస్థానం అతడికి అరెస్టునుంచి నాలుగువారాలు ఉపశమనం కూడా కల్పించింది. 


ఆమెను పెళ్ళిచేసుకోమని తాము చెప్పడం లేదనీ, ఉద్దేశం ఉన్నదా అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని ప్రధాన న్యాయమూర్తి పిటిషన్‌ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యతో సర్వోన్నత న్యాయస్థానం బాధితురాలి బాధనూ, జరిగిన హింసనూ పూర్వపక్షం చేసిందన్న విమర్శ ఎదుర్కొంది. న్యాయంకోసం ఉన్నతన్యాయస్థానం వరకూ వచ్చినవారికి ఇక్కడా గ్రామస్థాయి తరహా సూచనలూ పరిష్కారాలూ ఎదురైతే మరింత అవమానపడతారనీ, న్యాయస్థానాలకు పోవడానికి కూడా వెనుకంజవేస్తారని కొందరి భయం. ఔరంగాబాద్‌ కోర్టు బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తే, నిందితుడు ఈ అప్పీలు చేసుకున్నాడు. ఆ తీర్పును నిర్ద్వంద్వంగా సమర్థించవలసిన ఉన్నతన్యాయస్థానం, అందుకు భిన్నంగా ఆమెను పెళ్ళిచేసుకుంటావా, అటువంటి ఉద్దేశం ఉంటే చెప్పు అంటూ నిందితుడితో చర్చలు జరపడం, అరెస్టు నుంచి రక్షణకల్పించడం భవిష్యత్తులో ఈ తరహా కేసులను బలహీనపరుస్తాయన్నది వాదన. అత్యాచారం కేసుల్లో నిందితులు బాధితులను పెళ్ళిచేసుకుంటే చేసిన తప్పు చెల్లుబాటవుతుందన్న ఈ తరహా ధోరణి కూడనిది. ఆ మైనర్‌ బాలికపై అతడు పన్నెండుసార్లు అఘాయిత్యం చేశాడనీ, మీ ఇద్దరికీ పెళ్ళిచేస్తానంటూ నిందితుడి తల్లి మొదట హామీ ఇచ్చిందనీ, ఆ తరువాత అతను వేరే పెళ్ళిచేసుకోవడంతో బాధితురాలు కోర్టుకెక్కిందని అంటున్నారు. చేసిన తప్పును పెళ్ళితో పరిష్కరించవచ్చుననే భావజాలం దిగువస్థాయి న్యాయవ్యవస్థలో ఎంతోకాలంగా కనిపిస్తున్నదే. పోక్సో నేరాన్ని ఎదుర్కొన్న ఓ వ్యక్తికి గత ఏడాది మద్రాస్‌ హైకోర్టు పెళ్ళిచేసుకుంటానన్న హామీ తరువాత బెయిల్‌ ఇచ్చింది. బాధితులను పెళ్ళిచేసుకొనే హామీమీద చాలా కోర్టులు నిందితులకు వెసులుబాట్లు ఇవ్వడం, బాధితురాలిని పెళ్ళిచేసుకోమని న్యాయమూర్తులే సూచించడం జరుగుతోంది. నిందితుల కుటుంబాలనుంచి వస్తున్న ఒత్తిళ్ళు, సమాజం చిన్నచూపు ఇత్యాది కారణాలవల్ల అయిష్టంగానే పెళ్ళిచేసుకొని ఆ తరువాత మరింత హింసకు గురవుతున్నవారూ ఉన్నారు. ఇప్పుడది సర్వోన్నతన్యాయస్థానం నుంచి వినిపించడమే ఆశ్చర్యం కలిగిస్తున్నది.


సహజీవనం చేస్తున్న ఇరువురి మధ్య ఉన్న లైంగిక సంబంధాన్ని ఏ దశలోనైనా అత్యాచారంగా నిర్వచించవచ్చునా అని కూడా బాబ్డే మరొక కేసులో ప్రశ్నించారు. ఇది కూడా వివాదాన్ని రేపింది. సహజీవనమైనా, వివాహమైనా మహిళ అనుమతి లేకుండా జరిగేది శృంగారం కాదనీ, అఘాయిత్యమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఉన్నంతమాత్రాన అది లైంగికదాడి కాకుండాపోదు. వివాహబంధంలో సైతం ఇష్టంలేని శృంగారాన్ని అత్యాచార నేరంగా గుర్తించాలంటూ మహిళాసంఘాలు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం న్యాయమూర్తులకు తెలియనిదేమీ కాదు. అత్యాచార కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా బాధితుల పక్షాన, వారి మనోవేదనకు అద్దంపడుతూ ఉండాలి కానీ, నేరస్థులకు ఏమాత్రం వెసులుబాటు ఇచ్చే రీతిలో ఉండకూడదు. ఇందుకోసం భాషతో పాటు భావజాలాన్నీ సవరించుకోవడం ముఖ్యం.

Advertisement
Advertisement
Advertisement