Abn logo
Mar 4 2021 @ 01:33AM

బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోగా చోరీ

మురళీనగర్‌లో బంగారం, నగదు అపహరణ

తాటిచెట్లపాలెం, మార్చి 3 : ఇంటికి ఉన్న తాళం పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారని మురళీనగర్‌కు చెందిన ఒక మహిళ బుధవారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మురళీనగర్‌లో కుటుంబ సభ్యులతో మహిళ నివాసం ఉంటున్నారు. బుధవారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా తాళం పగులగొట్టి ఉంది.


ఏం జరిగిందోనని ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి, లోపల దుస్తులు ఇతర సామగ్రి చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న మూడు తులాల నల్లపూసల హారం, రెండు బంగారం ఉంగరాలు, పదివేల రూపాయల నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement
Advertisement