కేజ్‌ వీల్స్‌తో రోడ్ల ధ్వంసం..!

ABN , First Publish Date - 2021-04-17T04:45:47+05:30 IST

అదనపు శ్రమ, ఖర్చు తగ్గుతుందన్న కొందరు ట్రాక్టరు యజమానులు, రైతుల స్వార్థానికి లక్షలాది రూపాయల విలువైన రహదారులు ధ్వంసమవుతున్నాయి.

కేజ్‌ వీల్స్‌తో రోడ్ల ధ్వంసం..!
కేజ్‌ వీల్స్‌తో రోడ్లపై ట్రాక్టర్లు

లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా 

పట్టించుకోని అధికారులు


ముత్తుకూరు, ఏప్రిల్‌ 16: అదనపు శ్రమ, ఖర్చు తగ్గుతుందన్న కొందరు ట్రాక్టరు  యజమానులు, రైతుల స్వార్థానికి లక్షలాది రూపాయల విలువైన రహదారులు ధ్వంసమవుతున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదన్న ధీమాతో ఇష్టారీతిన రోడ్లపై కేజ్‌ వీల్స్‌తో ట్రాక్టర్లను పరుగుపెట్టిస్తుండడంతో రహదారులు దారుణంగా దెబ్బతింటున్నాయి. వ్యవసాయ సీజన్‌లో వరినాట్లకు ముందు రొంపి దుక్కి దున్నుతారు. ఇందుకోసం ట్రాక్టర్ల చక్రాలు తీసి వేసి  కేజ్‌ వీల్స్‌ (దమ్ము చక్రాలు) బిగించి దున్నుతారు. దీనివల్ల ట్రాక్టర్లు బురదలో ఇరుక్కొనే అవకాశం ఉండదు. ఈ చక్రాలను పొలంలో బిగించుకొని దున్నడం పూర్తయ్యాక విప్పివేసి టైర్లు బిగించిన తర్వాతే రోడ్లపైకి రావాలి. అయితే ట్రాక్టర్ల యజమానులు ఈ కాస్త శ్రమ ఎందుకన్న భావంతో ఇంటి వద్దనే కేజ్‌ వీల్స్‌ బిగించుకుని పొలాలకు వెళుతున్నారు. దీంతో ఇనుప చక్రాల ధాటికి తారురోడ్లపై గాడులు పడుతున్నాయి. ప్రధానంగా ముత్తుకూరు మండలంలో బ్రహ్మదేవం, తాళ్లపూడి వద్ద నెల్లూరు రహదారి పూర్తిగా దెబ్బతినింది. పంటపాళెం సమీపంలో గ్రామీణ రహదారులు కేజ్‌ వీల్స్‌కి దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. నెల్లూరు ప్రధాన రహదారి కిలోమీటరు నిర్మాణానికి రూ.10లక్షలు ఖర్చు అవుతుంది. ఈ కేజ్‌ వీల్స్‌తో ట్రాక్టరు ఒక్కసారి ప్రయాణిస్తే పదేళ్లు ఉండాల్సిన రహదారి రెండేళ్లకే దెబ్బతినిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సీజన్‌లో వందలాది ట్రాక్టర్లు దమ్ము చక్రాలతో ఈ రహదారుల్లో ప్రయాణిస్తున్నాయి. ఎవరైనా అడిగినా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పట్టించుకోవాల్సిన రవాణా శాఖ, రహదారుల శాఖ, పోలీసులు ఈ వాహనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కేజ్‌ వీల్స్‌తో రోడ్డుపైకి వస్తే వాహనాన్ని సీజ్‌చేసి జరిమానా విధించే అవకాశం ఉంది. ఎవ్వరూ పట్టించుకోరన్న ధీమాతో ట్రాక్టర్లు కేజ్‌ వీల్స్‌తో రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రహదారులు దెబ్బతిని ప్రయాణానికి పనికి రాకుండా పోతున్నాయి. మరమ్మతులు చేసినా మళ్లీ యథా పరిస్థితే. వీటి దెబ్బకు సింగిల్‌ రోడ్డు మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. వాహన చట్టాల నియమాల మేరకు అసలు రహదారుల పైకి దమ్ము చక్రాలతో రావడానికి అవకాశమే లేదు. నియంత్రణ కరువవడంతో గ్రామీణ రహదారులతో పాటు ప్రధాన రహదారులను చిధ్రం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులతో పాటు రహదారుల శాఖ, పోలీసులు సమన్వయంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-04-17T04:45:47+05:30 IST