‘లెఫ్ట్’ ఆశలను ‘యంగ్ జనరేషన్’ నెరవేరుస్తుందా?

ABN , First Publish Date - 2021-03-05T19:59:03+05:30 IST

కొన్ని సంవత్సరాల పాటు బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్టులు ఈసారి మాత్రం ఉనికిని కాపాడే ప్రయత్నంలోనే ఉండిపోయారు.

‘లెఫ్ట్’ ఆశలను ‘యంగ్ జనరేషన్’ నెరవేరుస్తుందా?

కోల్‌కతా : కొన్ని సంవత్సరాల పాటు బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్టులు ఈసారి మాత్రం ఉనికిని కాపాడే ప్రయత్నంలోనే ఉండిపోయారు. కనీసంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకునే స్థితిలో ఉన్నాయా? అంటే అనుమానమనే చెప్పాల్సి ఉంటుంది. బెంగాల్ ముఖచిత్రం మొత్తం ఇప్పుడు టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్, బీజేపీ పోటాపోటీగా వ్యూహ రచన చేస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ శుక్రవారం మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. బీజేపీ కూడా కాస్త అటో ఇటో అభ్యర్థులను ప్రకటించనుంది. సీపీఎం కూడా శుక్రవారమే తన అభ్యర్థులను ప్రకటించనుంది. అయితే ఈసారి వృద్ధతరం కాకుండా... పూర్తిగా యువ రక్తాన్నే ప్రోత్సహించాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించుకుంది.


ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖకు కూడా ఇదే రకమైన సూచనలను చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ ఈసారి సింహభాగం యువకులకే టిక్కెట్లను కేటాయించింది. కుప్ప కూలిపోతున్న ‘ఎర్రకోట’ ను ఎలాగైనా తిరిగి నిర్మించుకోవాలన్న పట్టుదలతో సీపీఎం ఉంది. అన్ని రాజకీయ పార్టీలూ యువతను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే సీపీఎం కూడా ‘యువ’ పాచికను తెరపైకి తెచ్చి, వారికి గాలం వేసింది. వారిని పార్టీ వైపు ఆకర్షించి, అధికార సౌధాన్ని పునర్నిర్మించుకోవాలని తలపోసింది. ఈ సారి ఎన్నికల్లో యువకులే కీలక పాత్ర పోషిస్తున్నారన్న సూక్ష్మాన్ని గ్రహించిన లెఫ్ట్ ఈ వ్యూహాన్ని అమలు చేయనుంది.


ప్రస్తుతం పార్టీ సభ్యుల సంఖ్య లక్షా అరవై వేలు. ఈ లక్షా అరవై వేలల్లో యువకులు చాలా తక్కువే. కేవలం 16 శాతం మాత్రమే యువకులు. ఈసారి మాత్రం పరిస్థితిని మార్చేయాలని సీపీఎం నిర్ణయించుకుంది. 70 శాతం సీట్లలో 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారినే బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా సీపీఎం అనుబంధంగా ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వనుంది. దీని ద్వారా యువకులను పార్టీ వైపు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. 40 శాతంగా ఉన్న ఓట్ షేర్ ప్రస్తుతం 5 శాతానికి పడిపోయింది. దీంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. పైగా బీజేపీ రంగ ప్రవేశం చేసింది. బెంగాల్ వేదికగా దూసుకుపోతోంది. సైద్ధాంతికంగా సీపీఎం చాలా బలహీనంగా ఉంది. వీటన్నింటినీ కప్పేయాలంటే యువతే శరణ్యమని సీపీఎం భావిస్తోంది. 


Updated Date - 2021-03-05T19:59:03+05:30 IST