సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిర్బంధం

ABN , First Publish Date - 2020-11-22T07:18:32+05:30 IST

పోలవరం ఎత్తు తగ్గించడం, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తదితర అంశాలను ప్రశ్నిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల నాయకత్వం పోలవరం పరిరక్షణ యాత్ర చేయాలని నిర్ణయించింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిర్బంధం

పోలవరం పరిరక్షణ యాత్రకు పోలీసుల అడ్డంకి

రాజమహేంద్రవరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎత్తు తగ్గించడం, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తదితర అంశాలను ప్రశ్నిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల నాయకత్వం పోలవరం పరిరక్షణ యాత్ర చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం పోలవరాన్ని సందర్శించేందుకు శనివారం రాత్రి రామకృష్ణ రాజమహేంద్రవరం చేరుకుని రివర్‌బే హోటల్‌లో బస చేశారు. పది గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని రామకృష్ణను హోటల్‌లోనే నిర్బంధించారు. దీంతో పరిరక్షణ యాత్ర జరగడం కష్టంగా మారింది.  ‘పోలవరం పరిరక్షణ కోసం యాత్ర చేపడితే గృహ నిర్బంధం చేయడం అన్యాయం... తాము ముందుగానే ఇరిగేషన్‌ మంత్రి, అధికారులకు సమాచారం ఇచ్చాము. వాళ్లు కూడా సహకరిస్తామని చెప్పారు. యాత్రకు అంతా సిద్ధమైన తర్వాత ఆకస్మికంగా నిర్బంధాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా పోలీసుల రాజ్యమా’ అని రామకృష్ణ ప్రశ్నించారు. హోటల్‌కు వచ్చిన పోలీసులను ఆయన ఎందుకు ఈ ఆటంకాలు సృష్టిస్తున్నారని అడిగారు. డీజీపీ నుంచి అనుమతి రాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై రామకృష్ణ మాట్లాడుతూ పోలవరంలో కార్మికుడు చనిపోయినందుకు ఆపుతున్నారా లేక ఇంకేదానా కారణం ఉందా అని ప్రశ్నించారు. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వ చర్య దుర్మార్గమని, ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పరిరక్షణ యాత్ర చేపడితే దానికి అడ్డంకులు సృష్టించడం అన్యాయమన్నారు.

Updated Date - 2020-11-22T07:18:32+05:30 IST