తెలుగు అభ్యున్నతికి సీపీ బ్రౌన సేవలు ఎనలేనివి

ABN , First Publish Date - 2020-11-30T05:11:56+05:30 IST

ఈస్టిండియా ఉద్యోగిగా మన దేశానికి వచ్చి కడపలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తూ తెలుగుభాష కోసం సీపీ బ్రౌన చేసిన సేవలు ఎనలేనివని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు.

తెలుగు అభ్యున్నతికి సీపీ బ్రౌన సేవలు ఎనలేనివి
సీపీ బ్రౌన లఘు నాటిక ప్రదర్శిస్తున్న దృశ్యం

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

ప్రారంభమైన సీపీ బ్రౌన రజతోత్సవాలు

కడప, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఈస్టిండియా ఉద్యోగిగా మన దేశానికి వచ్చి కడపలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తూ తెలుగుభాష కోసం సీపీ బ్రౌన చేసిన సేవలు ఎనలేనివని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. కడప నగరంలోని సీపీ బ్రౌన గ్రంథాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సీపీ బ్రౌన గ్రంథాలయం బ్రౌన శాసి్త్ర మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంజద్‌బాషా మాట్లాడుతూ తెలుగు నేర్చుకోవడమే కాక తెలుగుభాషను ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా చాటిన మహోన్నత వ్యక్తి సీపీ బ్రౌన అని కొనియాడారు. తెలుగుభాష అమ్మచేతి గోరుముద్దలాంటిదన్నారు. తెలుగు పలుకులు అమృత పలుకులన్నారు. తెలుగుభాష కోసం ఎందరో కవులను నియమించుకుని తాళ్లపాక గ్రంథాలను, వేమన పద్యాలను ఎత్తి రాయించారన్నారు. ఆయన తెలుగుభాషకు చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ సీపీ బ్రౌన సేకరించిన గ్రంథాలు భద్రపరచడంలో జానుమద్ది హనుమచ్చాసి్త్ర తన శేషజీవితాన్ని అంకితం చేశారన్నారు. యోగివేమన యూనివర్శిటీ ఉప కులపతి ఆచార్య సూర్యకళావతి మాట్లాడుతూ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా మన తెలుగుభాష సాహిత్యం తాళ్లపత్ర గ్రంథాల్లో ఉండిపోయిందని క్రిమికీటకాల వల్ల, ప్రమాదాల వల్ల అనేక తాళపత్ర గ్రంథాలతో పాటు ఎంతో విలువైన సాహిత్యం కూడా కోల్పోయామన్నారు. ఆరుద్ర, ఆచార్య బీఎనరెడ్డి, పంగోరే, డాక్టర్‌ హనుమచ్చాస్తి, సంపతకుమార్‌, డాక్టర్‌ సంజీవరెడ్డి, నారాయణరెడ్డి ఇలా ఎందరో సాహితీవేత్తలు, అధికారులు సేవానిరతి కలిగిన ఉదార కృషి వల్లనే బ్రౌన గ్రంథాలయం కడపలో ఆవిర్భవించి దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. గౌరవ అతిఽథిగా విచ్చేసిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉప సంచాలకులు ఆచార్య మాచిరెడ్డి రామకిష్ర్ణారెడ్డి మాట్లాడుతూ నూరేళ్ల కిందట రాజమండ్రిలో స్థాపించిన గౌతమి గ్రంథాలయంతో సమానంగా పాతికేళ్లలోనే బ్రౌన గ్రంథాలయం అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ ్వనాధరెడ్డి మాట్లాడుతూ అనేక గ్రంథాలను రచిస్తున్న సీపీ బ్రౌన భాష పరిశోధన కేంద్రం బ్రౌన లేఖలను కూడా ముద్రించాలని, తద్వారా స్థానిక చరిత్ర, నిర్మాణానికి ఉపకరించే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. సీపీ బ్రౌన భాషా పరిశోధన కేంద్రం సభ్యులు డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి పాతిక సంవత ్సరాల ప్రగతి ప్రస్తానాన్ని చదివి వినిపించారు. తెలుగు భాషాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన సీపీ బ్రౌన జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే ఆయన నిలువెత్తు విగ్రహాన్ని బ్రౌన గ్రంథాలయంలో ఏర్పాటు చేయాలని, సీఎం జగన గ్రంథాలయాన్ని సందర్శించేలా చూడాలని జానుమద్ది విజయభాస్కర్‌ కోరారు. శ్రీక్రిష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్న ఆచార్య మాచిరెడ్డి రామక్రిష్ణారెడ్డి, వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌, ఫైనఆర్ట్స్‌ యూనివర్శిటీ రిజిసా్ట్రర్‌ ఆచార్య సూర్యనారాయణరెడ్డి, కర్నూలు ఉర్దూ విశ్వవిద్యాలయ రిజిసా్ట్రరు ఆచార్య శ్రీనివాస్‌లను, వైవీయూ పాలకమండలి సభ్యురాలు ఆచార్య పద్మజ, ఆచార్య సాంబశివారెడ్డి, సీపీ బ్రౌన భాష పరిశోధన కేంద్రం సలహా మండలి సభ్యులు ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి, జానుమద్ది విజయభాస్కర్‌, షేక్‌హుసేన సత్యాగ్ని, పోతురాజువెంకటసుబ్బన్నలు సన్మానించారు. పాతికేళ్లుగా గ్రంథాలయానికి విలువైన పుస్తకాలు అందించిన పుస్తక దాతలను సత్కరించారు. తొలుత వైజీ ప్రకాశ రచించి దర్శకత్వం వహించిన సీపీ బ్రౌన లఘునాటిక ప్రదర్శించారు. 


పుస్తకావిష్కరణ

సీపీ బ్రౌన  భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాల ప్రత్యేక సంచిక, ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించిన వేమన పద్యాలు, విద్వాన కట్టా నరసింహులు రచించిన వేమన పద్యాలు (ముడమాల సిద్దయ్యగారి మఠం తాళపత్రప్రతి), డాక్టర్‌ పీఎ్‌సఎన మూర్తి రచించిన సీపీ బ్రౌన లైఫ్‌ ఇన లండన ఆఫ్టర్‌ హి లెఫ్ట్‌ ఇండియా అనే పుస్తకాలను ఆవిష్కరించారు. 


పోతన భాగవతాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది 

ఆధునిక సమాజానికనుగుణంగా పోతన భాగవతాన్ని పునర్మూంల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైవీయూ తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య తప్పెట రామప్రసాద్‌రెడ్డి అన్నారు. సీసీ బ్రౌన భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం జరిగిన బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, రామరాజభూషణుడు, తాళ్లపాక తిమ్మక్క అనే పుస్తకాల సమీక్ష కార్యక్రమం గ్రంథాలయ బాధ్యులు డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ భాగవతంలోని సౌవర్ణకంకణ అనే పద్యాన్ని ఉదహరిస్తూ శబ్ధ వేగం కంటే కాంతి వేగం ఎక్కువని సైన్స విజ్ఞానాన్ని పోతన ఆనాడే తెలిపాడన్నారు. బమ్మెర పోతన పుస్తకాన్ని ఆవిష్కరించిన వైవీయూ తెలుగుశాఖ సహ ఆచార్యులు డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాచీన  కవుల్లో పోతన, మఽధ్యయుగ కవుల్లో వేమన, ఆధునిక కవుల్లో జాషువాలు అంటే తనకిష్టమన్నారు. అయ్యలరాజు రామభద్రుడు పుస్తకం సమీక్షించిన ప్రభుత్వ పురుషుల కళాశాల సహాయాచార్యులు డాక్టర్‌ సుందరేశ్వర్‌రావు మాట్లాడుతూ సీపీ బ్రౌన భాషా పరిశోధన కేంద్రం ముద్రించిన అయ్యలరాజు రామభద్రుడు పుస్తకంలో కాకర్ల వెంకట రామనరసింహం వ్యాసంలోని రామభద్రుని ఇంటి పేరు రాయకవి అని, పద్యాల మకుటంలో రాయకవి అనే పదం ఉందని ఉదాహరణల ద్వారా వివరించారు. రామరాజ భూషణుడు పుస్తకాన్ని సమీక్షించిన జిల్లా పరిషత ఉన్నత పాఠశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ జీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ వసుచరిత్రలోని ప్రతి పద్యం యొక్క రాగాన్ని గురించి వివరించిన ప్రముఖ విమర్శకులు రాజన్నకవి కడపవాడు కావడం అదృష్టమన్నారు. తాళ్లపాక తిమ్మక్క పుస్తకం సమీక్షించిన జిల్లా పరిషత ఉన్నత పాఠశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ అనుగూరు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క కడప జిల్లాకు చెందినది కావడం విశేషమన్నారు. నేటి కాలం స్ర్తీలకు ఆత్మరక్షణకు కావాల్సిన అంశాలు అన్నీ ఉన్నాయని అన్నారు.



Updated Date - 2020-11-30T05:11:56+05:30 IST