కొవిడ్‌ పరీక్షల ల్యాబ్‌ల్లో ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-22T06:21:28+05:30 IST

కొవిడ్‌ పరీక్షల ల్యాబ్‌ల్లో ఆకస్మిక తనిఖీలు

కొవిడ్‌ పరీక్షల ల్యాబ్‌ల్లో ఆకస్మిక తనిఖీలు

పాయకాపురం, జనవరి 21 : ప్రభుత్వం నిర్దేశించిన రూ.350 కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్న నగరంలోని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ల్యాబ్‌లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. కలెక్టర్‌ నివాస్‌, జేసీ శివశంకర్‌ ఆదేశాల మేరకు నగరంలోని పలు ల్యాబ్‌లపై ఈ దాడులు జరిగాయి. డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి వైద్యులు, రెవెన్యూ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి, కామినేని హాస్పిటల్‌, అపోలో ల్యాబొరేటరీ, రెమెడీస్‌ ల్యాబొరేటరీ, ఏబీసీ డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌, ఐరిస్‌ ల్యాబొరేటరీ, ఒమైక్రాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌, సాయి బాలాజీ డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌ వంటి ఏడు ల్యాబ్‌లపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా వసూలు చేస్తున్నా రని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు చేశారు. ఒమైక్రాన్‌ ల్యాబొరేటరీ, కామినేని హాస్పిటల్‌లో అదనంగా వసూలు చేస్తున్నారని తేలింది. అలాగే, మూడు ల్యాబ్‌లు 471 మంది నుంచి అదనంగా వసూలు చేసిన రూ.80 వేలు తిరిగి వారికి చెల్లించాలని సంబంధిత నిర్వాహకులను ఆదేశించారు. మొదటి తప్పుగా పరిగణించి అదనంగా తీసుకున్న రుసుము తిరిగి చెల్లించమని ఆదేశించామని, మళ్లీ అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో సుహాసిని హెచ్చరించారు. అనుమతి లేకుండా పరీక్షలు చేస్తున్న అపోలో ల్యాబొరేటరీకి రూ.20వేల అపరాధ రుసుము చెల్లించాలని, రూ.10వేలు కట్టి అనుమతి తీసుకోవాలన్నారు.

Updated Date - 2022-01-22T06:21:28+05:30 IST