మళ్లీ Covid భయం..

ABN , First Publish Date - 2022-06-05T14:01:23+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర

మళ్లీ Covid భయం..

- ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, పడకలు సిద్ధం చేయండి 

- కేంద్రం హెచ్చరికలతో రాష్ట్రప్రభుత్వ చర్యలు


చెన్నై, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రధాన ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, పడకలను సిద్ధం చేసి కరోనా బాధితులకు చికిత్సలందించే దిశగా చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్రంలో వారం రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి ఉన్నట్టుండి పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరంగా చేపట్టాలంటూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌కు ఆయన ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు చేపట్టడంతో దేశంలో మూడు నెలలుగా కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందని, అయితే ఇటీవల తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాల్లో వందకు పైగా కేసులు నమోదు కావడటంతో మళ్లీ వైరస్‌ నిరోధక చర్యలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 3.13 శాతం కేసులు తమిళనాట నమోదవుతున్నవేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌ జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయాన్ని, ప్రత్యేకవార్డులను, పడకలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీకాల కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, టీకాలు వేసుకోనివారి ఇళ్ళ వద్దకే వెళ్ళి టీకాలు వేయాలని కోరారు. రెండు డోస్‌ల టీకాలు వేసుకున్నవారికి గడువులోపు బూస్టర్‌ డోస్‌ టీకాలు వేసేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు వంటి కరోనా నిరోధక నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని కూడా రాధాకృష్ణన్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.



Updated Date - 2022-06-05T14:01:23+05:30 IST