ఇలాగైతే.. ఇబ్బందే

ABN , First Publish Date - 2022-01-24T06:00:44+05:30 IST

రోజురోజుకు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా ఏమాత్రం తగ్గడంలేదు. వారం రోజులుగా జిల్లాలో నిత్యం వెయ్యికి పైనే కేసులు నమోదవుతున్నాయి.

ఇలాగైతే.. ఇబ్బందే
గుంటూరులో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న యువత

కరోనా నిబంధనలకు నీళ్లు

వైరస్‌ విస్తరిస్తోన్నా నిర్లక్ష్యమే

రోజురోజుకు పెరిగిపోతోన్న కేసులు

ప్రకటనల్లోనే అధికారుల కట్టడి చర్యలు

కనీస జాగ్రత్తలు కూడా పాటించని ప్రజలు


మహమ్మారి ముంచుకోస్తోన్నది. మొదటి రెండు వేవ్‌లకన్నా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటోందన్న హెచ్చరికలు వాస్తవమవుతున్నాయి. జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు వారం రోజుల నుంచి వెయ్యి దాటేశాయి. అయినా ప్రజల్లో కనీస జాగ్రత్తలపై శ్రద్ధ ఉండటంలేదు. కరోనా నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. నిబంధనలు పక్కాగా అమలు చేసి కట్టడికి చర్యలు తీసుకునే వారే లేకుండా పోయారు. ఇదే అవకాశంగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక కరోనా టెస్టులు సక్రమంగా జరగకపోవడం.. గతంలో ఉన్నట్లు కేంద్రాలు అందుబాటులో లేక పోవడం.. ఎక్కడ చేస్తున్నారో తెలియక పోవడం.. తదితరాలతో కరోనా బాధితుల గుర్తింపు కష్టంగా ఉంటోంది. లక్షణాలతో ఉన్న వారు టెస్టింగ్‌కు వెళ్లినా వారి ఫలితం తేలేప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. ఈలోగా ఆ వ్యక్తులు ఎక్కడంటే అక్కడ సంచరిస్తూ వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారు. దీంతో చాపకింద నీరులా మహమ్మారి కమ్ముకువస్తోంది. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా మాస్కులు, భౌతిక దూరం మాటే కానరావడంలేదు. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి కష్టమే అని తెలుస్తోంది. 


కరోనా.. కన్నెర్ర

వారం రోజులుగా చూస్తే జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి భయంగొల్పుతోంది. పాజిటివ్‌ రేట్‌ కూడా ఏమాత్రం తగ్గడంలేదు. గతంలో ఒక అంకెకు పరిమితమైన పాజిటివ్‌రేటు వారం నుంచి 15 నుంచి 20 శాతానికి అటూఇటుగా ఉంటుంది. ఇక కేసులు.. పాజిటివ్‌రేట్‌ చూస్తే..

కేసులు పాజిటివ్‌      శాతం

సోమవారం 345      21.13

మంగళవారం 758     18.67

బుధవారం 943     15.83

గురువారం 1066    16.63

శుక్రవారం 1054    18.50

శనివారం 1212     15.92

ఆదివారం 1,458    15.49


ఈ జాగ్రత్తలు అవసరం..

- ఇళ్ల నుంచి బయటకు వస్తే చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా మాస్కు ధరించాలి

- అలా మాస్కు ధరించని వారికి భారీగా జరిమానా విధించాలి.

- ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో శుభ్ర పరుచుకుంటూ ఉండాలి. 

- తీసివేసిన మాస్కులను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలి. 

- షాపింగ్‌మాల్స్‌, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, సినిమా థియేటర్ల వద్ద థర్మల్‌స్ర్కీన్‌ తప్పనిసరి చేయాలి

- ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి. 

- దుకాణాలు, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలి.  


నైట్‌ కర్ఫ్యూతో సరి

వైరస్‌ వ్యాప్తి కట్టడిపై అధికారులు చురుగ్గా వ్యవహరించడం లేదు. కేవలం నైట్‌ కర్ఫ్యూ పేరుతో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్బంధం విధించారు. జనసంచారం లేని సమయంలో కర్ఫ్యూ వల్ల ఫలితం ఏముంటుందో అధికారులకే తెలియాలి. గతంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే భారీ జరిమానాలు విధించేవారు. దీంతో రోడ్డుపైకి వచ్చిన వారంతా అప్పట్లో తప్పనిసరిగా మాస్కు ధరించే వారు. ప్రస్తుతం దీని గురించి పట్టించుకునే వారు లేక పోవడంతో ప్రజలు యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. భౌతిక దూరం మాట అటుంచి, ఎక్కడ చూసినా గుంపులు, గుంపులుగా సంచరిస్తున్నారు. ఇక సభలు, సమావేశాలు అయితే ఇష్టానుసారంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాల్సి అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  

 

ఫీవర్‌ సర్వే ఎప్పటికో?

జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ ఫీవర్‌ సర్వేని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించడం లేదు. మొదటి, రెండు దశల కొవిడ్‌ సమయంలో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లతో పాటు వలంటీర్ల సహకారం తీసుకొని సర్వే నిర్వహించారు. ఇప్పుడు అలాంటి సర్వే మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రతీ ఇంట్లో జ్వర, జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్‌ పీడితులు ఉంటున్నారు. అయితే వారిలో కొంతమందే హోం ఐసోలేషన్‌లో ఉంటోన్నారు. మిగతా వారు యఽథేచ్ఛగా సంచరిస్తున్నారు. ఇది కూడా కేసులు పెరగడానికి ఒక కారణంగా మారింది. ఇప్పటివరకు మరణాల శాతం నామమాత్రంగానే ఉండటం వల్ల కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే డెల్టా వేరియంట్‌లో వలే జరిగితే ఈపాటికే విపత్కరమైన పరిస్థితులు చోటు చేసుకుని ఉండేవి. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

రోజురోజుకు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా  ఏమాత్రం తగ్గడంలేదు.   వారం రోజులుగా జిల్లాలో నిత్యం వెయ్యికి పైనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి వేగం అందరినీ హడలెత్తిస్తోంది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆందోళన కరంగానే ఉంది. ఇలా భారీగా కేసులు నమోదైతే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో వేవ్‌లో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా అప్పట్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ప్రజలు అవస్తులు పడ్డారు. ఇప్పుడు అంతకుమించి కేసులు నమోదైతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నా ఆలకించేవారు కనిపించడంలేదు.  కొంతకాలంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో చాలావరకు నిర్లక్ష్యం పెరిగిపోయింది. ఆ నిర్లక్ష్యం ఇప్పటికీ వీడటంలేదు. భౌతిక దూరం మాట అటుంచి రద్దీ ప్రాంతాల్లో కూడా కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. మార్కెట్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రయాణ సమయాల్లో ఇలా ఎక్కడ చూసినా జనం రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. పైగా కనీస జాగ్రత్తలు తీసుకునేవారు చాలాతక్కువ మందే ఉంటున్నారు. ప్రాణాంతక వైరస్‌ సోకుంతుదేమోనన్న భయం ప్రజల్లో ఏ మాత్రం లేదు. ప్రజల నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమంటున్నా ఆలకించడంలేదు. ఇక కరోనా వచ్చిన వారు కూడా గృహాలకే పరిమితం కాకుండా బయట సంచరించటం వల్ల కేసులు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. వైరస్‌ వ్యాప్తి ప్రభలుతున్నా కరోనా నిబంధనలు షాపింగ్‌మాల్స్‌, దుకాణాలు, థియేటర్లు, విద్యాసంస్థల్లో   ఏ మాత్రం అమలు కావడంలేదు. ఆయా ప్రాంతాల్లో టెస్టింగ్‌, శానిటైజేషన్‌, భౌతిక దూరం లాంటి చర్యలే కానరావడంలేదు.  రాత్రి కర్ఫ్యూ నామమాత్రంగానే అమలవుతుంది. రాత్రిపూట కూడా మాస్కు లేకుండా ద్వి చక్రవాహనాలపై మాస్కులు లేకుండా రోడ్లపై అర్ధరాత్రి తిరగేస్తున్నా పోలీసులకు పట్టడంలేదు. నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. ఈ పరిస్థితి జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో ఏకరీతిగా ఉంది. కరోనాపైనా, జాగ్రత్తలపైన, ఆరోగ్య సంరక్షణపైన ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన కిందిస్థాయి సిబ్బంది కూడా తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగానే బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నారు. ఎవరికి కొవిడ్‌ ఉంది.. ఎవరికి లేదు అనేది కూడా తెలియడంలేదు. రెండు డోసుల టీకాలను వేసుకున్నామనే ధీమాతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. రెండు డోసుల టీకాలు వేయించుకున్నా కరోనా వదలదు అన్నా ఎవరూ ఆలకించడంలేదు.  

 - సత్తెనపల్లి నియోజకవర్గంలో అధికారిక లెక్కల ప్రకారమే వంద వరకు కేసులు ఉన్నాయి. సత్తెనపల్లి  ఏరియా వైద్యశాలలో ఇద్దరు వైద్యులు కరోనా బారిన పడినట్లు సమాచారం. మండలంలోని ఓ హైస్కూల్లో  ప్రధానోపాధ్యాయుడికి, నలుగురు ఉపాధ్యాయులకు కరోనాతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

- పిడుగురాళ్లలో రద్దీగా ఉండే ఐలాండ్‌సెంటర్‌, గుంటూరు, మాచర్ల బస్టాండ్‌ సెంటర్లలో దుకాణదారులు, ప్రయాణికులు మాస్కు లేకుండానే యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. మాచవరం, దాచేపల్లి, గురజాల, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్‌ సెంటర్‌లో కూరగాయల మార్కెట్లకు వచ్చే వారు ఎక్కువ మంది మాస్కులు లేకుండానే కనిపిస్తున్నారు. బార్లు, రెస్టారెంట్లలకు వెళ్లి వచ్చేవారిలో ఒకరిద్దరు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు.  పిడుగురాళ్ల జడ్పీ పాఠశాలలో సుమారు 2400 మంది పైగా విద్యార్థులున్నా తరగతి గదుల్లో కొవిడ్‌ నిబంధనలేవీ అమలు కావడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

- చిలకలూరిపేట పట్టణంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడంలేదు. ప్రతిరోజూ 30 నుంచి 50 వరకు అధికారికంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. అనధికారికంగా వందల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. పట్టణంలోని మార్కెట్‌ ప్రాంతం, బస్‌స్టాండ్‌, షాపింగ్‌ దుకాణాల వద్ద మాస్కు వినియోగిస్తున్న వారి సంఖ్య అతి తక్కువగానే ఉంది.

- నరసరావుపేటలో రోజురోజుకి కరోనా కేసులు అధికమవుతున్నాయి. జిల్లాలోనే ద్వితీయ స్థానంలో ఉంది. అయినా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్నారు.  మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారికి జరిమానాలు కూడా లేవు.  

- తాడికొండ నియోజకవర్గంలో ప్రజలు మాస్కులు, భౌతికదూరం మరిచి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఫిరంగిపురంలో మండలంలో 12, తాడికొండ మండలంలో 32 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. మాస్కులు కొద్ది మంది మాత్రమే పెట్టుకుంటున్నారు.

- పెదకూరపాడు నియోజకవర్గపరిధిలోని కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తం కావడం లేదు. 50 నుంచి 80శాతం ప్రజలు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నా పోలీసులు  ఉదాశీనంగా ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలు పాటించడంలేదు. హోటళ్లు, మార్కెట్‌ల వద్ద ప్రజలు మాస్కులు ధరించకుండానే సంచరిస్తున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదు. 

- మాచర్ల నియోజకవర్గంలో థర్డ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏమాత్రం జాగ్రత్త ఉండటంలేదు. పట్టణంలోని పార్కు సెంటర్‌, కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌ తదితర చోట్ల మాస్క్‌లు లేకుండా ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు.  

గత మూడు రోజుల్లోనే తెనాలి నియోజకవర్గంలో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. కట్టడికి మున్సిపాలిటీ ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. ఎక్కడ చూసినా పారిశుధ్యం అధ్వానంగా ఉంది. 

       

1458 కేసులు.. ఒకరు మృతి

కరోనా మూడో దశ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోన్నది.   ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే స్వల్ప లక్షణాలే కావడంతో వారిలో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 9,412 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 1,458 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. పాజిటివ్‌ శాతం 15.49గా నమోదైంది. క్రియాశీలక కేసుల సంఖ్య 7,325కి చేరింది. వారిలో 6,943 మంది హోం ఐసోలేషన్‌లో, 370 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు 12 మంది వెళ్లారు. గుంటూరు నగరంలో కొవిడ్‌ విజృంభిస్తోన్నది. ఆదివారం కొత్తగా 696 మందికి వైరస్‌ వ్యాప్తి చెందింది. మంగళగిరిలో 118, నరసరావుపేటలో 85, తెనాలిలో 67, తాడేపల్లిలో 52, చిలకలూరిపేటలో 33, పెదకాకానిలో 31, సత్తెనపల్లిలో 30, బాపట్లలో 22, పొన్నూరులో 19, ప్రత్తిపాడులో 17, తాడికొండలో 17, అమరావతిలో 15, రేపల్లెలో 15, చేబ్రోలులో 15, యడ్లపాడులో 14, ముప్పాళ్లలో 13, నాదెండ్లలో 13, తుళ్లూరులో 10, వట్టిచెరుకూరులో 9, అచ్చంపేటలో 6, గుంటూరు రూరల్‌లో 5, క్రోసూరులో 4, మేడికొండూరులో 5, పెదకూరపాడులో 8, పెదనందిపాడులో 1, ఫిరంగిపురంలో 7, రాజుపాలెంలో 2, దాచేపల్లిలో 5, దుర్గిలో 1, గురజాలలో 7, కారంపూడిలో 2, మాచవరంలో 2, మాచర్లలో 9, పిడుగురాళ్లలో 6, రెంటచింతలలో 3, వెల్దుర్తిలో 1, బొల్లాపల్లిలో 1, ఈపూరులో 1, నూజెండ్లలో 6, నకరికల్లులో 6, రొంపిచర్లలో 5, శావల్యాపురంలో 1, వినుకొండలో 9, అమర్తలూరులో 9, భట్టిప్రోలులో 5, చెరుకుపల్లిలో 3, దుగ్గిరాలలో 8, కాకుమానులో 1, కర్లపాలెంలో 4, కొల్లూరులో 2, నగరరంలో 1, నిజాంపట్నంలో 2, పిట్టలవానిపాలెంలో 5, చుండూరులో 8, వేమూరులో 2 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కొవిడ్‌తో చికిత్స పొందుతూ తెనాలిలో ఒకరు మృతి చెందారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆదివారం తొలి డోసు 143 మంది, రెండో డోసు 8,783, బూస్టర్‌ డోసు 277 మంది చేయించుకొన్నారు. 


 

Updated Date - 2022-01-24T06:00:44+05:30 IST