కొవిడ్‌కిట్లు ఎక్కడ!

ABN , First Publish Date - 2021-05-16T06:38:01+05:30 IST

కొవిడ్‌ బాధితులను మందుల కొర వేధిస్తోంది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఇచ్చే మందుల కిట్లు లేవు. చాలా మందికి ఇవ్వడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ కిట్లలో ఏడు రకాల మందులు ఉంటాయి.

కొవిడ్‌కిట్లు ఎక్కడ!

వేధిస్తున్న మందుల కొరత                       

 ‘రెడ్‌డిసివిర్‌’ పేర దోపిడీ

ఇంజక్షన్‌ రూ.30 వేలు 

 స్టింగ్‌ ఆపరేషన్‌లో 1 2 ఇంజక్షన్ల పట్టివేత

 సన్‌స్టార్‌ ఆసుపత్రిలో  మరో    17 బిల్లులు లేని

 ఇంజక్షన్లు లభ్యం

(ఆంధ్రజ్యోతి-రాజమహేంద్రవరం

కొవిడ్‌ బాధితులను మందుల కొర వేధిస్తోంది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఇచ్చే మందుల కిట్లు  లేవు. చాలా మందికి ఇవ్వడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ కిట్లలో ఏడు రకాల మందులు ఉంటాయి. వాటితో పాటు మాస్కులు కూడా ఇస్తారు. వీటికి కూడా కొరత ఏర్పడింది. రాజానగరం మండలం పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బాధితులు చాలా మంది లబోదిబోమంటున్నారు. ఎంతమందిని అడిగినా కిట్లు లేవని చెప్పడంతో ప్రైవేట్‌ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్‌గా టెస్టులు చేయించుకున్నవారికి కూడా కిట్లు ఇవ్వడం లేదు.  కొవిడ్‌కు సంబంధించి రకరకాల మందులు వాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే కిట్లలోని మందులు  మైల్డ్‌ బాధితులకే ఉపయోగపడతాయని, సివియర్‌ కండిషన్‌లో ఉన్నవారికి ఉపయోగపడవనే వాదనతో ప్రైవేట్‌ డాక్టర్లు సుమారు 10 నుంచి 12 రకాల మందులు ఇస్తున్నారు. వాటిలో మిథైల్‌ప్రిడ్నిసొలోన్‌ 125 ఎంజీ ఇంజక్షన్‌, డెక్సామెథాసోన్‌ 8 ఎంజీ, ఇంజక్షన్‌, క్లిక్సాన్‌ 40/60 ఎంజీ, డోక్సీసైక్లైన్‌ టాబ్లెట్‌, ఐవర్‌మెక్టిన్‌ టాబ్లెట్‌, హెపారిన్‌ ఇంజక్షన్‌, లైపోసోమల్‌ఆమ్‌ఫోటెర్‌సిన్‌-బి ఇంజక్షన్‌, బేసిట్రినిబ్‌, ఎడల్డ్‌ ఆక్సిజన్‌ మాస్కుల కొరత  అధికంగా ఉంది. వీటి సరఫరా తక్కువగా ఉండడం కూడా సమస్యగా మారింది. పలువురు బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో 20 ఆసుపత్రులను తనిఖీ చేసి మూడు క్రిమినల్‌ కేసులు పెట్టారు. రెమ్‌డిసివిర్‌ బ్లాక్‌ మార్కెట్‌పై రెండు కేసులు పెట్టారు. 10 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు.

రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌పై అధికారులు నిఘా పెట్టారు.  రాజమహేంద్రవరం డ్రగ్స్‌ ఏడీ విజయశేఖర్‌ ఆధ్వర్యంలో శనివారం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కృష్ణ, గోపాలకృష్ణ ఓ బాధితుడి సహకారంతో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. శ్రీనివాస నగర్‌లోని ఆర్కే ఫార్మాలో ఈ ఇంజక్షన్లను ఒక్కొక్కటి రూ.30వేలకు విక్రయిస్తున్నారని తెలిసి ఒక బాధితుడిని పంపించారు. అతడు కొనుగోలు చేసే సమయంలో అధికారులు దాడిచేసి అమ్మేవారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లమిల్లి రంజిత్‌కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి తన తండ్రి పేరిట ఈ ఫార్మా కంపెనీ నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లను బిల్లులు లేకుండా తెచ్చి ఇక్కడ ఒక్కొక్కటి రూ.30వేలు చొప్పున విక్రయిస్తున్నారు. రంజిత్‌ నుంచి 12 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక రూ.17,140 విలువైన రెండు కాలం చెల్లిన మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై 2వ అదనపు జుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసు నమోదు చేశారు.

సన్‌స్టార్‌ ఆసుపత్రిపై క్రిమినల్‌ కేసు

రాజమహేంద్రవరంలోని ఆనంద్‌ రీజెన్సీ సమీపంలో ఉన్న  సన్‌స్టార్‌  ఆసుపత్రిని విజిలెన్స్‌ అధికారులు శనివారం తనిఖీ చేసి  17 బిల్లులు లేని రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ కొవిడ్‌ బాధితుడికి వైద్యం కోసం బిల్లులు ఇవ్వకుండా రూ.4.5 లక్షలు వసూలు చేయడమే కాక పలువురి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు గమనించారు. దీంతో ఆసుపత్రి మేనేజర్‌ శర్మతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్‌, అధికారులు ముత్యాలనాయుడు, సత్యకిశోర్‌, భార్గవమహేష్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో కోమలి, డీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






Updated Date - 2021-05-16T06:38:01+05:30 IST