మృతులు వెయ్యికి చేరువలో..!

ABN , First Publish Date - 2021-07-25T05:42:09+05:30 IST

జిల్లాలో కరోనా మరణాలు అధికారికంగా వెయ్యికి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,28,645మంది వైరస్‌ బారిన పడగా వారిలో 993 మంది మృతిచెందారు. ఇది అధికారిక లెక్క కాగా అనధికారికంగా మరో లక్ష పాజిటివ్‌లు, దాదాపు 2వేలకుపైగానే మరణాలు ఉండే అవకాశం ఉంది.

మృతులు వెయ్యికి చేరువలో..!

ఇప్పటివరకు 1,28,645 కేసులు, 993మంది మృతి

అనధికారికంగా అంతకు రెండు రెట్లుపైనే

నేటికి నిత్యం వందల సంఖ్యలో కేసులు

ఈ వారంలోనే 1,810 పాజిటివ్‌లు, 20 మరణాలు

నాల్గవవంతు పీహెచ్‌సీల్లో 5శాతంపైనే పాజిటివిటీ


ఒంగోలు, జూలై 24(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా మరణాలు అధికారికంగా వెయ్యికి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,28,645మంది వైరస్‌ బారిన పడగా వారిలో 993 మంది మృతిచెందారు. ఇది అధికారిక లెక్క కాగా అనధికారికంగా మరో లక్ష పాజిటివ్‌లు, దాదాపు 2వేలకుపైగానే మరణాలు ఉండే అవకాశం ఉంది. నేటికి జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గలేదు. నిత్యం వందలసంఖ్యలో కేసులు వస్తూనే ఉన్నాయి. అలా ఈ వారం రోజుల్లో జిల్లాలో 1810 కేసులు నమోదు కాగా 20మంది మరణించారు. అంతేకాక 20 నుంచి 25 పీహెచ్‌సీల పరిధిలో 5శాతం కన్నా అధిక పాజిటివిటీ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ గత నెలాఖరు నుంచి వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టినా జిల్లాలో మాత్రం తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈనెలలో ఇప్పటివరకు 6,552 పాజిటివ్‌లు రాగా 62 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 233 పాజిటివ్‌లు రాగా ఇద్దరు మృతిచెందారు. 


భయపెడుతున్న పాజిటివిటీ రేటు


అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 3వేల వరకు యాక్టివ్‌ కేసులు ఉండగా వారిలో 480 మంది వరకు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌, ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జిల్లాలోని 100 పీహెచ్‌సీల్లో ఇంచుమించు నాలుగు నుంచి 5వ వంతు చోట్ల పాజిటివిటీ రేటు 5శాతం కన్నా అధికంగా ఉంది. ఒంగోలు, కందుకూరు, అద్దంకి, కనిగిరి, చీరాల వంటి పట్టణ ప్రాంతాలతో పాటు కొత్తపట్నం, ఉలవపాడు, కొరిశపాడు, సంతమాగులూరు, దొనకొండ, దర్శి. పర్చూరు, కారంచేడు, మద్దిపాడు, ఎన్‌జీపాడు, మర్రిపూడి, పొన్నలూరు తదితర మండలాల్లోని పీహెచ్‌సీల్లో అధిక పాజిటివిటీ ఉంది. కేసులు అధికంగా వచ్చిన కొత్తపట్నం మండలంలోని మడనూరు, ఈతముక్కల గ్రామాల్లో తిరిగి స్థానికంగా లాక్‌డౌన్‌ పెట్టాల్సి వచ్చింది. 


ఉధృతి తగ్గిందని పెరిగిన నిర్లక్ష్యం


కరోనా తగ్గిందన్న భ్రమలో ఉన్న ప్రజలు కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండటం, రవాణా సౌకర్యాలు పెరుగుదలతో పాటు వివిధ ఫంక్షన్లు, వాణిజ్య కార్యకలాపాలు, వివిధ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించకపోవడంతో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు విశ్లేషించారు. ఆయా ప్రాంతాలపై దృష్టిసారించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను అదేశించారు. అయితే ప్రజల నిర్లక్ష్యంతో పాటు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపించడం వ్యాప్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తుండగా నేటికి వందలసంఖ్యలో కేసుల నమోదు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


కొవిడ్‌ వివరాలు


మొత్తం నమోదైన పాజిటివ్‌ కేసులు : 1,28,645

ఇప్పటివరకు సంభవించిన మరణాలు: 993

తొలివిడత నమోదైన పాజిటివ్‌ కేసులు: 63,233

తొలివిడత సంభవించిన మరణాలు :582

రెండవ్‌వేవ్‌(ప్రస్తుత ఏప్రిల్‌ నుంచి)పాజిటివ్‌లు: 65,422

రెండవ విడత సంభవించిన మరణాలు: 411

ఈవారంలో నమోదైన కేసులు: 1,810

ఈవారంలో మృతులు: 20 


Updated Date - 2021-07-25T05:42:09+05:30 IST