ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2021-04-22T06:19:19+05:30 IST

రోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ గత నెలాఖరులో ప్రారంభంకాగా ఈనెల ఆరంభం నుంచి ఉధృతి పెరిగి జిల్లా అంతా చుట్టేసింది.

ప్రమాద ఘంటికలు

జిల్లా అంతటా వ్యాప్తి

రెండు వారాల్లో 3,679 మందికి వైరస్‌

ఈ నెలలో 4,246 పాజిటివ్‌లు

ఒంగోలులోనే 1,165 నమోదు

ఆస్పత్రులు, స్కానింగ్‌ కేంద్రాల వద్ద రద్దీ

భారీ సంఖ్యలోనే బాధితులు మృత్యువాత

మరిన్ని ఆంక్షల వైపు యంత్రాంగం దృష్టి

జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతూ జిల్లాను చుట్టేస్తోంది. నిత్యం వందల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. జిల్లా యంత్రాంగం వద్ద ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈనెల 1 నుంచి 20 వరకూ జిల్లాలో ఏకంగా 4,246 మంది వైరస్‌ బారిన పడ్డారు. అందులో 8 నుంచి 20వ తేదీ వరకూ రెండు వారాల్లోనే 3,679మంది పాజిటివ్‌లు వచ్చాయి. అంటే సగటున ఈనెలలో రోజుకు 200లకుపైగా కేసులు నమోదయ్యాయి. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 67,461 మంది కరోనా బారిన పడగా,  ఈ నెలలో 20 రోజుల్లోనే 4,246 కేసులు నమోదు కావడం వైరస్‌ ఉగ్రరూపాన్ని పట్టి చూపుతోంది. జిల్లాలో 56 మండలాలు, 8 అర్బన్‌ ప్రాంతాలు కలిపి 64 స్థానిక సంస్థల ప్రామాణికంగా అధికారులు కేసులు నమోదును లెక్కిస్తుండగా అన్ని ప్రాంతాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందింది.

ఒంగోలు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) :  కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ గత నెలాఖరులో ప్రారంభంకాగా ఈనెల ఆరంభం నుంచి ఉధృతి పెరిగి జిల్లా అంతా చుట్టేసింది. గడిచిన 20 రోజుల్లో జిల్లాలో 4,246 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా కొన్ని ప్రాంతాల్లో భారీసంఖ్యలో ఉన్నాయి. ఒక్క ఒంగోలులోనే అత్యధికంగా 1,165 పాజిటివ్‌లు రాగా, మార్కాపురంలో 266 నమోదయ్యాయి. మొత్తం 19 మండలాల్లో 50శాతం కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీటిని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఆంక్షలు అమలు చేస్తుండగా రెండు, మూడురోజుల్లో మొత్తం 19 ప్రాంతాల్లోనూ రాత్రిపూట లాక్‌డౌన్‌, అలాగే పగటిపూట కూడా పరిమిత సమయంలోనే జనసంచారాన్ని అనుమతించేలా ఆంక్షలు విధించబోతున్నారు.


పెరుగుతున్న మృతులు

కరోనా బాధితులు పెద్దసంఖ్యలోనే మృత్యువాత పడుతున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 603మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అందులో ఈ నెలలోనే ఇప్పటి వరకు 20మందికిపైగా మృత్యువాత పడ్డారు. అయితే అంతకు ఐదారు రెట్లు లెక్కలోకి రానివి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బుధవారం కూడా పలువురు మృత్యువాతపడ్డారు. మార్కాపురంలో చెన్నకేశవస్వామి ఆలయ ప్రధానార్చకుడు నంద్యాల తిరుమలాచార్యులు, టంగుటూరు మండల టీడీపీ నేత, ఒంగోలు డెయిరీ మాజీ డైరెక్టర్‌ కాకుమాను శ్రీరామమూర్తి కరోనా బారిన పడి మృతి చెందారు. కందుకూరుకు చెందిన మాజీ కౌన్సిలర్‌, సీపీఐ సీనియర్‌ నాయకుడు వలేటి రాఘవులను కూడా కరోనా బలిగొంది.  పర్చూరు మండలంలో ఒక మహిళ మృతిచెందగా ఒంగోలు హౌసింగ్‌ బోర్డుకు చెంది గుంటూరులో నివాసముంటున్న ప్రైవేటు కాలేజీ అధ్యాపకుడు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలా ఒక వైపు కేసుల ఉధృతి, మరోవైపు మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంటంతో ప్రజలు వణికిపోతున్నారు.

 

పరీక్షల కోసం పరుగులు

లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోతుండటంతో అనేకమంది ఏమాత్రం అనారోగ్యం ఉన్నట్లుగా అనిపించినా కొవిడ్‌ వచ్చిందేమోనన్న భయంతో పరీక్షల కోసం ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్‌ ఆస్పత్రుల వద్ద వైద్యం కోసం వచ్చేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుండటంతో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తుండటంతో బాగా సీరియస్‌ అనుకున్న వారికి మాత్రమే ఆస్పత్రుల్లో బెడ్‌లు ఇచ్చి మిగిలిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,708 యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 1,016 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2,692 మంది ఇళ్ల వద్ద ఉండి చికిత్స తీసుకుంటున్నారు. 



Updated Date - 2021-04-22T06:19:19+05:30 IST