ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు శుభవార్త... కోవిడ్-19 పరీక్షలు, చికిత్స ఉచితం...

ABN , First Publish Date - 2020-04-05T03:03:04+05:30 IST

ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు ప్రైవేటు ల్యాబొరేటరీలు, నమోదిత ఆసుపత్రుల్లో కోవిడ్-19 పరీక్షలు

ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు శుభవార్త... కోవిడ్-19 పరీక్షలు, చికిత్స ఉచితం...

న్యూఢిల్లీ : ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు ప్రైవేటు ల్యాబొరేటరీలు, నమోదిత ఆసుపత్రుల్లో కోవిడ్-19 పరీక్షలు, చికిత్స ఉచితంగా లభిస్తాయని జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్ఏ) శనివారం ప్రకటించింది. ఎన్‌హెచ్ఏ జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 


ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్-19 పరీక్షలు, చికిత్స ఇప్పటికే ఉచితంగా లభిస్తున్నాయని తెలిపింది. ఆరోగ్య హామీ పథకం లబ్ధిదారులు 50 కోట్ల మందికి పైగా ఉన్నారని, వీరు ప్రైవేటు ల్యాబొరేటరీలలో ఉచితంగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవచ్చునని, అదేవిధంగా నమోదిత ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్స ఉచితంగా పొందవచ్చునని తెలిపింది. 


ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకం క్రింద నమోదైన ఆసుపత్రులు తమ అధీకృత టెస్టింగ్ కేంద్రాలను వినియోగించుకోవచ్చునని, వేరొక ఆథరైజ్డ్ టెస్టింగ్ కేంద్రంతో అనుబంధం కుదుర్చుకోవచ్చునని పేర్కొంది.


భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాల ప్రకారం కోవిడ్-19 పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ మాట్లాడుతూ ఈ అనూహ్య సంక్షోభంలో, కోవిడ్-19పై పోరాటం కోసం ప్రైవేటు రంగాన్ని కీలక భాగస్వామిగా చేర్చుకోవలసి ఉందన్నారు. 


ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకం క్రింద పరీక్షలు, చికిత్స అందుబాటులోకి తేవడం కోసం ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబొరేటరీలను కలుపుకుపోవడం వల్ల మన సామర్థ్యం పెరుగుతుందన్నారు. పేదలపై విపత్కర వ్యాధి ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. 


Updated Date - 2020-04-05T03:03:04+05:30 IST