10 శాతం మందికే కొవాగ్జిన్‌ టీకా

ABN , First Publish Date - 2021-02-24T08:01:27+05:30 IST

దేశంలో కరోనా టీకా కార్యక్రమం మొదలై రెండు నెలలు దాటింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాలను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది...

10 శాతం మందికే కొవాగ్జిన్‌ టీకా

  • 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1శాతం లోపే.. 
  • అత్యధికంగా గుజరాత్‌లో 27శాతం మందికి కొవాగ్జిన్‌
  • తెలంగాణలో 13.5శాతం.. ఏపీలో 10శాతం మందికి!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశంలో కరోనా టీకా కార్యక్రమం మొదలై రెండు నెలలు దాటింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాలను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఎక్కువగా కొవిషీల్డ్‌ టీకాలనే ఇస్తున్నారు. కొవాగ్జిన్‌ టీకాలను కేంద్రమే చాలా తక్కువగా సరఫరా చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి 21 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 10శాతం మంది మాత్రమే కొవాగ్జిన్‌ టీకా తీసుకున్నారు. మిగతా 90శాతం మంది కొవిషీల్డ్‌ టీకా తీసుకున్నట్టే. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 1.06 కోట్ల డోసుల టీకాలు ఇవ్వగా.. అందులో కేవలం 10,37,565 మాత్రమే కొవాగ్జిన్‌ డోసులు. 12 రాష్ట్రాల్లో 1 శాతం లోపు మాత్రమే కొవాగ్జిన్‌ టీకాలు వేశారు. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్‌-నికోబార్‌ దీవులు, డయ్యుడామన్‌లలో ఒక్క డోసు కొవాగ్జిన్‌ టీకా కూడా వేయలేదు. పంజాబ్‌లో కేవలం 91 మందికి ఈ టీకా వేయగా.. నాగాలాండ్‌, మిజోరం, లక్షద్వీ్‌పలో నలుగురికి వేశారు.  చండీగఢ్‌ (9 మందికి), మణిపూర్‌(29), త్రిపుర(30), లద్దాఖ్‌(31), హిమాచల్‌ ప్రదేశ్‌(38), మేఘాలయ(49), అరుణాచల్‌ ప్రదేశ్‌(54), ఉత్తరాఖండ్‌(69), సిక్కిమ్‌(128)లో చాలా తక్కువ మందికి ఈ టీకా వేశారు. మహారాష్ట్రలో 8,332 కొవాగ్జిన్‌ డోసులు ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నప్పటికీ.. అక్కడ ఇచ్చిన మొత్తం డోసులతో పోలిస్తే ఇది కేవలం 0.95 శాతం. తమిళనాడులో జరిగిన వ్యాక్సినేషన్‌లో కొవాగ్జిన్‌ వాటా కేవలం 1.72 శాతమే. కర్ణాటకలో అది 1 శాతం కాగా.. తెంగాణలో 13.5శాతం, కేరళలో 12.8శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా కొవాగ్జిన్‌ డోసులు ఇచ్చిన రాష్ట్రం గుజరాత్‌. అక్కడ జరిగిన వ్యాక్సినేషన్‌లో కొవాగ్జిన్‌ వాటా 27శాతం.  ఉత్తర ప్రదేశ్‌ (21.3శాతం), రాజస్థాన్‌ (21శాతం), మధ్యప్రదేశ్‌ (18.6శాతం).. గుజరాత్‌ తర్వాత ఎక్కువ కొవాగ్జిన్‌ డోసులు ఇచ్చిన రాష్ట్రాలు. కొవాగ్జిన్‌ డోసులను కొన్ని రాష్ట్రాలకు ఎక్కువగా, మరికొన్ని రాష్ట్రాలకు తక్కువగా పంపడమే ఇందుకు కారణమని కర్ణాటకకు చెందిన ఎపిడమాలజిస్టు గిరిధర బాబు తెలిపారు. 


ఎక్కువ డోసులు పంపినా..

దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే 26 లక్షల కొవాగ్జిన్‌ డోసులు పంపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఫిబ్రవరి 5న పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. తమిళనాడుకు అత్యధికంగా 1,89,920 కొవాగ్జిన్‌ డోసులు పంపినట్టు పేర్కొంది. అదే తమిళనాడుకు కొవిషీల్డ్‌ డోసులను మాత్రం 10 లక్షలకు పైగా పంపడం గమనార్హం. అలాగే.. తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాలకు 1,72,960 డోసులను, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు 1,70,400, ఒడిశాకు 1,69,760, అసోంకు 1,68,160, కర్ణాటక రాష్ట్రానికి 1,66,240, యూపీకి 1,65,280 , ఏపీకి 1,64,320, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాలకు 1,50,400 డోసులను పంపినట్టు వివరించింది. ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌, పంజాబ్‌, కేరళ రాష్ట్రాలకు 37,760 డోసుల చొప్పున పంపింది. కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలకు సంబంధించి సమాచారం అందుబాటులో లేని నేపథ్యంలో.. చాలా రాష్ట్రాలు వీటిలో అతి తక్కువ డోసులను మాత్రమే టీకా కార్యక్రమంలో భాగంగా ఉపయోగించాయి.      కాగా, మున్ముందు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను మరింత వేగంగా అందించేందుకు గాను మరిన్ని ప్రైవేటు ఆస్పత్రుల్ని వినియోగించుకుంటామని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. ముక్కు ద్వారా అందించగలిగే కరోనా వ్యాక్సిన్‌ (బీబీవీ 154) మొదటి దశ ప్రయోగ పరీక్షలను బుధవారం నుంచి ప్రారంభిస్తామని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించారు. మరోవైపు, సరైన ధ్రువీకరణలేకుండా ‘పతంజలి’ కరోనిల్‌ మాత్రల అమ్మకాన్ని మహారాష్ట్రలో అనుమతించబోమని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంగళవారం చెప్పారు.


శరీరంలోని ప్రతి భాగంపైనా కరోనా దాడి

కరోనా ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులు, గుండెపైనే కాకుండా.. తల నుంచి కాలి బొటనవేలు దాకా ప్రతి శరీర భాగంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల - ఆస్పత్రితో పాటు నాగ్‌పూర్‌, పాట్నా, దేవ్‌ఘర్‌లలోని ఎయిమ్స్‌లు, చండీగఢ్‌లోని పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌లకు చెందిన అనాటమీ నిపుణుల సంయుక్త బృందం అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కిడ్నీలు, పేగులు, మెదడు, జననావయవాలు, పిత్తాశయం, చర్మం, వెంట్రుకలు, గోళ్లనూ కరోనా వైరస్‌ దెబ్బతీసినట్లు తేలింది. పురుషులు, మహిళల్లోని ఊపిరితిత్తులు, గుండెలపై ఏసీఈ-2 ప్రభావం దాదాపు ఒకేస్థాయిలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, మహిళల కిడ్నీలతో పోలిస్తే పురుషుల కిడ్నీలపై ఏసీఈ-2 తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందన్నారు.


Updated Date - 2021-02-24T08:01:27+05:30 IST