దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-09-15T17:26:43+05:30 IST

ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి సమీపంలో బుధవారం హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

దంపతుల ఆత్మహత్యాయత్నం

 పురుగు మందు తాగడంతో అపస్మారక స్థితికి..

 ఆస్పత్రికి తరలించిన స్థానికులు

హైదరాబాద్/డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి సమీపంలో బుధవారం హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక గిరిజనులు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. భర్త ఆరోగ్యం మెరుగుపడగా, ఆరు నెలల గర్భిణిగా వున్న భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ గోపాల్‌రెడ్డినగర్‌కు చెందిన దంపతులు సంతో్‌షకుమార్‌(32), సునీత (28) రెండు రోజుల క్రితం  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం వెళ్లారు. అక్కడి నుంచి బుధవారం ఉదయం అరకులోయ మీదుగా చాపరాయి వద్దకు చేరుకున్నారు.


కొద్దిసేపు చాపరాయి వద్ద గడిపి పదకొండు గంటల ప్రాంతంలో సమీపంలోని ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో పడివున్న వారిని అటుగా వెళుతున్న కొంతమంది గిరిజనులు గమనించి సమర్యలు చేయడంతో స్పృహలోకి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే 108కి ఫోన్‌ చేయగా... ప్రస్తుతం చాపరాయి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ వరకూ వచ్చి ఆగిపోయింది. దీంతో గిరిజన యువకులు ద్విచక్ర వాహనాలపై దంపతులను అతి కష్టమ్మీద గెడ్డ దాటించి 108లో ఆస్పత్రికి తరలించారు. సంతో్‌షకుమార్‌ ఆరోగ్యం మెరుగుపడగా, ఆరు నెలల గర్భిణిగా వున్న సునీత పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని డుంబ్రిగుడ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-09-15T17:26:43+05:30 IST