పట్టాలెక్కని పేదల బండి

ABN , First Publish Date - 2022-04-26T05:30:00+05:30 IST

పేదల బండ్లుగా పిలుచుకునే ప్యాసింజర్‌ రైళ్లు రెండేళ్లుగా పట్టాలు ఎక్కడం లేదు.

పట్టాలెక్కని పేదల బండి

  1.  కొవిడ్‌లో నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లు 
  2. రెండేళ్లుగా పునరుద్ధరణకు  నోచుకోని వైనం
  3. ఎక్స్‌ప్రెస్‌లున్నా.. తక్కువ స్టాప్‌లు 
  4.  ప్రయాణికుల రాకపోకలపై తీవ్ర ప్రభావం 
  5.  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో  భారంగా ప్రయాణం 
  6.  నోరుమెదపని ప్రజాప్రతినిధులపై విమర్శలు

పేదల బండ్లుగా పిలుచుకునే ప్యాసింజర్‌ రైళ్లు రెండేళ్లుగా పట్టాలు ఎక్కడం లేదు. కొవిడ్‌లో నిలిచిన ప్యాసింజర్‌ రైళ్లు పునఃప్రారంభం కాలేదు. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తక్కువ స్టేషన్లలో ఆగుతున్నందువల్ల  రోడ్డు మార్గాన ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి తోడు చార్జీలు కూడా భారీగా పెరిగిపోయాయి.  జనాలు ఇంత ఇబ్బంది పడుతున్నా ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణపై ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- నంద్యాలటౌన


- విజయవాడ - యశ్వంతపూర్‌ ప్యాసింజర్‌ రైలు ప్రయాణం దాదాపు 23 గంటలు. ప్రయాణ వేగం గంటకు 33కిలో మీటర్లు, 13 బోగీలు.  ఈ రైలు ఆగే స్టేషన్ల సంఖ్య 75. చిన్న చిన్న స్టేషన్లలో 10 నుంచి 30మంది దాకా, పెద్ద  స్టేషన్లలో దాదాపు వంద నుంచి 250 మంది దాకా ఈ ప్యాసింజర్‌ రైలు ఎక్కి దిగుతూ ఉంటారు.  పేద, మధ్యతరగతి ప్రజలకు ప్యాసింజర్‌ రైలు ఎంతో సౌకర్యం.  దశాబ్దాల తరబడి ఈ ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి. కొవిడ్‌ లాక్‌డౌన కారణంగా నిలిచిపోయిన యశ్వంతపూర్‌ ప్యాసింజర్‌ రైలు లాంటివి కూడా రెండేళ్లయినా తిరిగి పట్టాలెక్కలేదు.  వీటిని పునఃప్రారంభించాలని రైల్వే శాఖకు విన్నవించే ప్రజా ప్రతినిధులు కరువయ్యారు. 


- డోనకు చెందిన పార్వతి పూల వ్యాపారం చేస్తుంది. ప్యాసింజర్‌ రైలు నడిచినంత  కాలం  డోన - గుంటూరు ప్యాసింజర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి.. రూ.20తో నంద్యాలలో 8గంటలకు దిగేవారు. అక్కడ పూలు కొని...  నంద్యాలలో అమ్మి... తిరిగి సాయంత్రం గుంటూరు - కాచిగూడ ప్యాసింజర్‌ రైలులో 4 గంటలకు ఎక్కి రాత్రి 8గంటలకు డోనలో దిగుతుంది. ఇందులో రానుపోను చార్జీలు రూ.40మాత్రమే. పూలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో ఆమెకు చాలా మిగిలేది. అయితే ఇప్పుడు సీన రివర్స్‌ అయింది. డోన నుంచి నంద్యాలకు బస్సులో రావాలంటే రాను, పోను రూ.300 పై మాటే. పూలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో సగం బస్సు చార్జీలకు  పోతోంది.  ఆమెకు కష్టమే మిగులుతోంది. 

 దక్షిణ మధ్య రైల్వేలో గుంటూరు డివిజన ఆదాయంలో మొదటి స్థానంలో ఉంది. గుంటూరుతోపాటు గుంతకల్లు డివిజనకు అనుసంధానంగా నంద్యాల మీదుగా ఉన్న రైలు మార్గంలో ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్‌ రైళ్లు నిలిపివేతతో ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కేవలం అత్యవసర పనుల నిమిత్తం, ప్రత్యేకంగా తమ కుటుంబ అవసరాలకు సంబంధించి వెళ్లేవారు మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆశ్రయిస్తుండడంతో ముఖ్య రైల్వేస్టేషన్లలో ఎక్కి, దిగేవారి సంఖ్య కేవలం 50 శాతం లోపు మాత్రమే ఉంది. సాధారణంగా ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్న సమయంలో నంద్యాల లాంటి స్టేషనలో ఎక్కి, దిగే ప్రయాణికుల సంఖ్య 200 నుంచి 300మంది పైమాటే. 2020 మార్చి 25 నుంచి కొవిడ్‌ లాక్‌డౌన కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లు ఇప్పటి వరకు తిరిగి పట్టా లెక్కలేదు. రైల్వేశాఖ మాత్రం ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చి, నిలబడే స్టేషన్ల సంఖ్యను కుదించారు. దీంతో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల రాకపోకలపై పూర్తి ప్రభావం పడింది. 

నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లు 

 నంద్యాల మీదుగా డోన - గుంటూరు ప్యాసింజర్‌, హుబ్లీ - విజయవాడ, కాచిగూడ - గుంటూరు (డెమో), యశ్వంతపూర్‌ - విజయవాడ, కాచిగూడ - గుంటూరు ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. వీటితో పాటు నంద్యాల - యర్రగుంట్ల రైల్వే మార్గం ప్రారంభమైన తరువాత నంద్యాల - కడప డెమో ప్యాసింజర్‌ రైలు రోజుకు రెండు ట్రిప్పులు, నంద్యాల - కర్నూలు డెమో ప్యాసింజర్‌ రైలు రోజుకోసారి నడిచేవి. ప్రతిరోజూ ప్యాసింజర్‌ రైళ్లల్లో ప్రయాణించేవారి సంఖ్య 5వేల నుంచి ఎనిమిది వేల మంది దాకా ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్ల స్థానంలో రైల్వే శాఖ అదే రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. దీంతో రైలు నిలిచే స్టేషన్ల సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యమైన   స్టేషన్లలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగుతుండడంతో  ఈ మార్గంలో రాకపోకలు సాగించే పేదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 


స్టేషన్ల సమీపంలో వ్యాపారాలపై ప్రభావం 

నంద్యాల రైల్వేస్టేషనలో ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎనిమిది రైళ్లు వచ్చి ఆగేవి. బెంగళూరు, హుబ్లీ నుంచి విజయవాడకు వెళ్లేవి... విజయవాడ నుంచి కాచిగూడ వెళ్లేవి ఆగేవి. ఒక్కో ప్యాసింజర్‌ రైలు నుంచి భారీగా ప్రయాణికులు   ఎక్కి..దిగేవారు. స్టేషన చుట్టుపక్కల చిన్న చిన్న హోటళ్లు, కూల్‌డ్రింక్‌ షాపుల వంటి చిరువ్యాపారాలు జోరుగా సాగేవి. ప్యాసింజర్‌ రైళ్లను పూర్తిగా నిలిపివేయడం వల్ల పగటి పూట ఆ ప్రభావం వ్యాపారాలపై పడింది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాత్రి పూట మాత్రమే నంద్యాలలో ఆగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. దీంతో  స్టేషన బయట చిరు వ్యా పారాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని మూసివేశారు. 

పట్టించుకోని ప్రజాప్రతినిధులు 

ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని ప్రజాప్రతినిధులు రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల నుంచి డోనకు రూ.20తో, నంద్యాల నుంచి గుంటూరుకు రూ.35తో, నంద్యాల నుంచి విజయవాడకు రూ.40, నంద్యాల నుంచి కాచిగూడకు రూ.85తో పేదలందరూ ప్రయాణించేవారు. పేదల నేల విమానాలుగా చెప్పుకునే ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణం చాలా సౌకర్యంగా ఉండేది. ఆగిపోయిన ప్యాసింజర్లను త్వరగా పునః ప్రారంభించాలన్న డిమాండ్‌ ఉంది. కానీ  ఆ దిశగా రైల్వే శాఖ చర్యలు తీసుకునేలా ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయకపోవడం గమనార్హం.

 అవి నడిచేదెప్పుడో..? 

డోన, ఏప్రిల్‌ 26: కరోనా పరిస్థితులతో రద్దయిన ఆ రెండు ప్యాసింజర్‌ రైళ్లు నడిచేదెప్పుడో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బెంగుళూరు నుంచి డోన మీదుగా విజయవాడకు ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. డోన రైల్వేస్టేషనలో ఉదయం 6 గంటలకు బయలుదేరి విజయవాడకు వెళ్లేది. ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అదే విధంగా హుబ్లీ నుంచి డోన మీదుగా విజయవాడకు ప్యాసింజర్‌ రైలు సౌకర్యం ఉండేది.   కొవిడ్‌ రావడంతో ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. ఇటీవల కాలంలో ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించినా.. ఆ రెండు రైళ్లకు మాత్రం మోక్షం కల్పించడం లేదు. అదే విధంగా కాచిగూడ నుంచి డోన మీదుగా గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు రద్దయి తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఏడాదిన్నరగా అంతే..

ఆదోని(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 26: కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నరగా ప్యాసింజర్‌ రైళ్లు నిలిచిపోయాయి. కరోనా కేసులు నమోదు కాకపోయినప్పటికీ ప్యాసింజర్‌ రైళ్లు నేటికీ పునరుద్ధ్దరరణకు నోచుకోలేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్లు సక్రమంగా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఆదోని మీదుగా వెళ్లే కొన్ని రైళ్లు నడుస్తున్నప్పటికీ కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను ఇంకా రైల్వేశాఖ పునరుద్ధ్దరించలేదు. ఆదోని స్టేషన మీదుగా గుంతకల్లు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే ప్యాసింజర్‌ రైలు, గుంతకల్లు నుంచి గుల్బర్గాకు వెళ్లే ప్యాసింజర్‌ రైలు నడవడం లేదు. ఆదోని రెవెన్యూ డివిజన నుంచి వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు వేలల్లో ఉన్నారు. ప్యాసింజర్‌ రైలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ చార్జీల పెరుగుదలతో బస్సుల్లో ప్రయాణించేందుకు కూడా జంకుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు వివిధ ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లేందుకు తక్కువ టికెట్‌ ధరలతో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైళ్లలో టికెట్‌ చార్జీలు తక్కువ ఉండడంతో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు. ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

ఆదాయమే లేదు..

ప్యాసింజర్‌ రైళ్లు తిరిగేటప్పుడు   వ్యాపారం...ఆదాయం బాగుండేవి. ఇప్పుడు అంతగా కొనేవారు కనిపించడం లేదు. ఆదాయం 70శాతానికి పైగా పడిపోయింది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటేనే స్టేషన ఎదుట వ్యాపారులు నాలుగు రూపాయలు కళ్ల చూస్తారు. ప్యాసింజర్‌ రైళ్లు నిలిచిపోవడంతో రెండేళ్లుగా అరకొర వ్యాపారంతో ఇబ్బందులు పడుతున్నాం.      

         - బసవరాజు, చిరు వ్యాపారి, నంద్యాల


  ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలి

పేదలకు ఎంతగానో ఉపయోగపడే ప్యాసింజర్‌ రైళ్లను వెంటనే పునరుద్ధరించాలి. ముఖ్యంగా ఎంపీలు రైల్వే మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాలి. ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణ విషయంలో వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకుంటే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. 

 - పుల్లా నరసింహ, పట్టణ పౌర సమాఖ్య అధ్యక్షుడు, నంద్యాల 

 

రైళ్లు తిరగక ఇబ్బంది

వృత్తిరీత్యా నేను ఫొటోగ్రాఫర్‌ను. ఏవైనా  శుభకార్యాలు ఉన్నప్పుడు ఇటు డోన వైపు, అటు మార్కాపురం వరకు ప్యాసింజర్‌ రైలు ద్వారా పల్లెలకు వెళ్లి వచ్చేవాడిని. ఇప్పుడు ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసి, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చడం వల్ల ఇబ్బందికరంగా మారింది. ఆ రైలు మార్గంలో ఉన్న పల్లెల్లో కార్యక్రమాలకు వాహనాల్లో  వెళ్లాల్సి వస్తోంది. దీంతో చాలా  ఖర్చవుతోంది. అధికారులు వెంటనే ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలి. 

 - నాగరాజు, నంద్యాల 

 

Updated Date - 2022-04-26T05:30:00+05:30 IST