పత్తిదే పెత్తనం!

ABN , First Publish Date - 2022-08-04T06:09:09+05:30 IST

జిల్లాలో వర్షాధారంగా సాగు చేసే పత్తి పంటదే పెత్తనం కనిపిస్తోంది. దీంతో చిరుధాన్యాల పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. యేటేటా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. ఒక్కప్పుడు అధికంగా సాగు చేసిన చిరుధాన్యాల పంటల సాగు కాలక్రమంగా కనుమరుగై పోతోంది.

పత్తిదే పెత్తనం!
పత్తిలో దౌర కొడుతున్న రైతులు

జిల్లాలో కనుమరుగవుతున్న చిరుధాన్యాల సాగు

మద్దతుధర లేకనే ఆసక్తి చూపని అన్నదాతలు

ఎన్నో పోషక విలువలున్నా.. ప్రోత్సాహం కరువు

వాణిజ్య పంటలతో సంప్రదాయ పంటల కనుమరుగు

ఈ వానాకాలం సీజన్‌లో 4లక్షల 34వేల ఎకరాలలో పత్తి సాగు

జిల్లావ్యాప్తంగా 5లక్షల 71వేల 284 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు

ఆదిలాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాధారంగా సాగు చేసే పత్తి పంటదే పెత్తనం కనిపిస్తోంది. దీంతో చిరుధాన్యాల పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. యేటేటా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. ఒక్కప్పుడు అధికంగా సాగు చేసిన చిరుధాన్యాల పంటల సాగు కాలక్రమంగా కనుమరుగై పోతోంది. రైతులు సంప్రదాయ పంటల సాగును వదిలి ఆధునిక పద్ధతిలో వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపడంతో చిరుధాన్యాల సాగు కనిపించకుండానే పోతోంది. ప్రస్తుతం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో అక్కడక్కడా చిరుధాన్యాలను సాగు చేస్తున్నా.. నామమాత్రంగానే కనిపిస్తోంది. వానాకాలంలో జిల్లా సాగు విస్తీర్ణం 5లక్షల 71వేల 284 ఎకరాలు కాగా ఇందులో అధికంగా పత్తి పంట 4లక్షల 34వేల ఎకరాలలో సాగవుతోంది. మిగితా ఎకరాలలో సోయా, కంది, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, ఇతర పంటలు సాగవుతున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. పత్తి పంట తర్వాత సోయా, కంది, పసుపు పంటలు నిలువగా.. చిరుధాన్యాల పంటల సాగు వెయ్యి ఎకరాల లోపే కనిపిస్తోంది. జొన్న పంట సాగు కొంత పర్వాలేదనిపిస్తున్నా.. కొర్రలు, సజ్జలు, రాగులు, సామలు ఎకరం లోపే సాగవుతున్నాయి. సజ్జలు ఎకరం, రాగులు 15 గుంటలు, కొర్రలు 10 గుంటలలో సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగానే కనిపిస్తున్నాయి. అధికారులు ఏదో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చిరుధాన్యాల సాగు కనిపించడం లేదంటున్నారు. చిరుధాన్యాల సాగుతో కలిగే లాభాలపై అవగాహన కల్పించక పోవడం తో అన్నదాతలు ఆ పంటల వైపు అంతగా ఆసక్తి చూపించినట్లు కనిపించడం లేదు.

 పత్తి వైపే పరుగులు

జిల్లాలో వాణిజ్య పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో రైతులు ఆ పంటల సాగు వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వానాకాల పంటల సాగులో అధికభాగం పత్తి పంటనే కనిపిస్తోంది. గతేడు మద్దతుకు మించిన ధర పలుకడంతో ఈ యేడు కూడా పత్తి వైపే రైతులు పరుగులు తీశారు. కానీ, భారీగా కురిసిన వర్షాలకు పత్తి పంట ఎదుగుదలపై ప్రభావం పడింది. వాణిజ్య పంటలతో అధిక లాభాలు రావడం, ఆధునిక పద్ధతులతో సాగు చేసే అవకాశం, మార్కెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండడంతో రైతులు చిరుధాన్యాల పంటల సాగు జోలికి వెళ్లడం లేదు. అక్కడక్కడ వర్షాధార పంట లుగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నా.. మార్కెట్‌కు తరలించే స్థాయిలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులతో పత్తి, సోయా, కంది పంటల సాగు జిల్లాలో పెరుగుతూ వస్తోంది. గడిచిన నాలుగేళ్లలోనే వాణిజ్య పంటల సాగు రెండింతలైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈ పంటల సాగుతో అధిక పెట్టుబడులు, అదేవిధంగా అధిక ఆదాయం కూడా చేతికి వచ్చే అవకా శం ఉంటుంది. ఏకకాలంలో పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయని రైతులు భావిస్తున్నారు. ఎలాంటి పెట్టుబడి ఖర్చు లేకున్నా.. వర్షాధారంగా పండించే అవకాశం ఉన్న చిరుధాన్యాలకు మార్కెట్‌ ఇబ్బందులు ఉన్నాయి. ఇతర పంటలతో పోల్చుకుంటే ప్రభుత్వం చిరుధాన్యాలకు మద్దతు ధరను ప్రకటించక పోవ డం పెద్దసమస్యగా మారింది. ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. వీటి ప్రాధాన్యత తెలిసిన వారంతా సూపర్‌మార్కెట్‌లలో కిలోల కొద్ది కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

ప్రోత్సాహం ఏదీ?!

చిరుధాన్యాలలో అధిక పోషక విలువులున్నా.. ప్రోత్సాహం కరువవుతోంది. ధీర్ఘకాలిక రోగాల భారీనపడిన వారికి చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. చిరుధాన్యాల వాడకంపై సరైన అవగాహన లేకపోవడమే అసలు సమస్యగా మారింది. ముఖ్యంగా బీపీ, షుగర్‌, అస్తమా, కీళ్లనొప్పులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల తీవ్రత పెరుగకుండా చిరుధాన్యాలు కట్టడి చేస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా భారీనపడిన బాధితులు చిరుధాన్యాలను ఆహారంగా తీసు కుంటే త్వరగా కోలుకుంటారని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గర్భిణులు, చిన్నపిల్లలకు మంచి పోషకాలను అందించి ఆరోగ్యవంతంగా ఉండేందుకు తోడ్పడుతాయని చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చిరుధాన్యాల సాగు పై ప్రభుత్వం, అధికారులకు పట్టింపే లేకుండా పోతోంది. గత రెండేళ్లుగా పత్తి పంటను ప్రోత్సహించడం గమనార్హం. దీంతో రైతులు కూడా చిరుధాన్యాల జోలికి వెళ్లకుండా వాణిజ్య పంటల సాగుకే పరిమితమవుతున్నారు. ఇకనైనా ప్రభు త్వం చిరుధాన్యాల సాగుపై ప్రత్యేకదృష్టి సారించి సాగు చేసే రైతులను ప్రోత్సహించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం

: శివకుమార్‌, వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్‌

ప్రతియేటా వానాకాల సీజన్‌ ప్రారంభంలోనే చిరుధాన్యాల సాగుపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. అయినా రైతులు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకొస్తే పూర్తి సహకారాన్ని అందిస్తాం. చిరుధాన్యాలలో ఎన్నో పోషక విలువలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ గ్రామాల్లో తప్ప ఎక్కడా చిరుధాన్యాల సాగు కనిపించడం లేదు. ఆదివాసీ గిరిజన రైతులే సంప్రదాయ పంటలను సాగు చేస్తూ వస్తున్నారు. మార్కెట్‌ మద్దతు ధర కూడా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పండించి పంటను అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతోనే చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. 

Updated Date - 2022-08-04T06:09:09+05:30 IST