రిక..వర్రీ!

ABN , First Publish Date - 2021-07-30T05:40:28+05:30 IST

పత్తి కాటాలో వేమెన్‌లకు రావల్సిన నగదు సూపర్‌వైజర్ల ఖాతాల్లో పడడం కలకలం రేపింది.

రిక..వర్రీ!

వేమెన్లకు రావలసిన సొమ్ము సూపర్‌వైజర్ల ఖాతాల్లోకి..

కమిషనర్‌ ఆగ్రహంతో తిరిగి సీసీఐకి నగదు జమ

  

                 (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

 పత్తి కాటాలో వేమెన్‌లకు రావల్సిన నగదు సూపర్‌వైజర్ల ఖాతాల్లో పడడం కలకలం రేపింది. దీనిపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ నగదును సూపర్‌వైజర్లు సీసీఐకి తిరిగి జమ చేశారు. గత ఏడాది రాష్ట్రంలో సుమారు 30 మార్కెట్‌ యార్డులు, 20 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ అధికారులు 20 లక్షల క్వింటాళ్ళు పత్తిని కొనుగోలు చేశారు. లూజు పత్తితో వచ్చే లారీలు, ఇతర వాహనాలను వేబ్రిడ్జి వద్ద తూకం వేస్తారు. నిబంధనల మేరకు వేమెన్‌లు వేబ్రిడ్జి, మిల్లులు, యార్డుల్లో ఉండి సరుకు తూకాన్ని ఖరారు చేయాలి. ప్రస్తుతం మార్కెట్‌ యార్డుల్లో వేమెన్లు ఐదుశాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వేమెన్లకు క్వింటాకు 80 పైసల చొప్పున రావలసిన మొత్తం సూపర్‌వైజర్ల ఖాతాల్లో జమ అయింది. దీనిపై సీసీఐ జీఎం ఆరా తీయగా యార్డు కార్యదర్శులు ప్రతిపాదనలు పంపారని, సూపర్‌వైజర్ల ఖాతాల్లో జమచేయమని సిఫారసు చేశారని, బ్యాంక్‌ ఖాతాల వివరాలు కూడా పంపటంతో తాము డబ్బు జమ చేశామని సీసీఐ అధికారులు మార్కెటింగ్‌శాఖ అధికారులకు వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వేమెన్లు లేకపోయినా ఉన్నట్లు కార్యదర్శులు రికార్డు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సూపర్‌వైజర్లు తమ ఖాతాల్లోకి వచ్చిన సొమ్మును సీసీఐకి జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


పేమెంట్లపై పర్సంటేజ్‌లు..

సీసీఐ అధికారుల వద్ద ఈ వ్యవహారాన్ని నడపటంలో ఒక జేడీ కీలకపాత్ర పోషించినట్లు కమిషనర్‌ కార్యాలయం దృష్టికి వచ్చింది. సూపర్‌వైజర్ల ఖాతాలలో జమ అయిన సొమ్ములో 40శాతం కొందరు జేడీలకు, 30 శాతం యార్డుకార్యదర్శులకు, 30 శాతం సూపర్‌వైజర్లు తీసుకొనే విధంగా వ్యహారాన్ని సెటిల్‌ చేసినట్లు సమాచారం. అంతా అయిపోయిన తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి రావడం.. కమిషనర్‌ ఛార్జ్‌మెమోలు ఇవ్వాలని ఆదేశించటంతో సూపర్‌వైజర్లు తమసొంత డబ్బును సీసీఐ ఖాతాలకు జమచేశారు. కొందరు జేడీలు, కార్యదర్శులు మాత్రం మౌనం వహించారు. దీంతో చిరుద్యోగులైన తాము బలయ్యామని సూపర్‌వైజర్లు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు.   

Updated Date - 2021-07-30T05:40:28+05:30 IST