రక్షిత నీటిలో అవినీతి ఊట!

ABN , First Publish Date - 2022-04-28T06:45:24+05:30 IST

జిల్లాలో రక్షిత మంచినీటి పథకం అవినీతి అధికారుల భక్షిత పథకంగా మారిపోయింది.

రక్షిత నీటిలో అవినీతి ఊట!

చందర్లపాడు మండలంలో వెలుగు చూసిన మరో అవినీతి 

రూరల్‌ మండల విచారణాధికారిపైనే ఆరోపణలు 

రక్షిత మంచినీటి పైపులైన్ల విచారణలో మరో ట్విస్ట్‌! జూఎంబుక్‌లో రికార్డులు తారుమారు

కలెక్టర్‌ దిల్లీరావుకు నేరుగా ఫిర్యాదు 

ఆర్‌డబ్ల్యూఎస్‌లో కదులుతున్న డొంక 


జిల్లాలో రక్షిత మంచినీటి పథకం అవినీతి అధికారుల భక్షిత పథకంగా మారిపోయింది. దొంగలు.. దొంగలు.. ఊళ్లు పంచుకున్న చందాన రక్షిత మంచినీటి పథకంలో పైపులైన్ల పనులను కొందరు అవినీతి అధికారులు పంచేసుకున్నారు. ఈ అవినీతి తీగను లాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది. రాయనపాడు, పైడూరుపాడు గ్రామ పంచాయతీల్లో జరిగిన అవినీతి పనులపై కలెక్టర్‌ దృష్టి సారించటంతో అవినీతి పైపుల నెట్‌వర్క్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. తీరా చూస్తే, ఈ అవినీతి ఆరోపణలపై విచారణాధికారిగా నియమితులైన అధికారే అడ్డంగా బుక్‌ అయిపోయారు. ఆయన పరిధిలో చేపట్టిన పైపులైన్ల పనుల్లో కూడా అవినీతి జరిగిందని నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో విచారణను పూర్తిచేయాల్సిన అధికారి సెలవు పెట్టి వెళ్లారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రక్షిత మంచినీటి పథకం అవినీతి కథ విచిత్రమైన మలుపు తిరిగింది. విజయవాడ రూరల్‌ మండలం పరిధిలో జరిగిన మంచినీటి పైపులైన్ల అవినీతి పనులకు సంబంధించి విచారణాధికారిగా నియమితులైన అధికారిపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. చందర్లపాడు మండలం పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల్లో ఆయన పర్యవేక్షణలో జరిగిన పనుల్లో చోటుచేసుకున్న అవినీతిపై నేరుగా కలెక్టర్‌ దిల్లీరావుకే ఫిర్యాదు అందింది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో వేళ్లూనుకున్న అవినీతి డొంకంతా కదిలింది. విజయవాడ రూరల్‌ మండలంలో జరిగిన అవినీతిపై రెండు రోజుల్లో నిగ్గు తేల్చాల్సిన అధికారి కూడా సరిగ్గా ఇలాంటి పనులకు సంబంధించిన ఆరోపణల్లోనే చిక్కుకోవటం సంచలనం సృష్టిస్తోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లటంతో తొందరపాటులో ఎంబుక్‌ రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. తీరా ఆ పనులకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసిన అంశాలు గుర్తుకు వచ్చి అడ్డంగా బుక్‌ అయ్యామని గుర్తించారు. తనమీదే అవినీతి ఆరోపణలు రావటంతో.. ఆ అధికారి రెండు రోజులు సెలవు పెట్టారు. దీంతో ఈ విచారణాధికారి అవినీతిని విచారించేందుకు మరో అధికారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


వెలుగుచూసిన అవినీతి ఇదీ..

చందర్లపాడు మండలం చింతలపాడు, మునగాలపల్లి, వెలది కొత్తపాలెం గ్రామ పంచాయతీల్లో అక్కడి మండల, జిల్లా పరిషత్‌, అంగన్‌వాడీ స్కూళ్లతో పాటు పరిసర ప్రాంతాలకు మంచినీటి సదుపాయం కల్పించటానికి జిల్లాల పునర్విభజనకు ముందే పైపులైన్ల పనులు చేపట్టారు. ఈ మూడు గ్రామాల్లో దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనుల్లో 63 ఎంఏ డయా, 4 గేజ్‌ ఐఎస్‌ఐ స్టాండర్డ్‌ పైపులనే వాడాలి. కానీ 75 ఎంఎం డయా 6 గేజ్‌ పైపులు వాడినట్టు ఎంబుక్‌లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తే నాన్‌ స్టాండర్డ్‌ 63 ఎంఎం, 4 గేజ్‌ పైపులను వాడినట్టు తేలింది. పైపుల కింద ఆరు అంగుళాల మేర ఇసుక వేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. కానీ ఎంబుక్‌లో ఇసుక వేసినట్టు నమోదు చేశారు. రెండున్నర కిలోమీటర్లు పని చేసి, మూడున్నర కిలోమీటర్ల మేర చేసినట్టు చూపడం ఈ పనుల్లో జరిగిన ఇంకో పెద్ద అవినీతి. 


ఎంబుక్‌లో ఇలా.. సీఎఫ్‌ఎంఎస్‌లో మరోలా..

అత్యవసర సందర్భాలలో వర్కింగ్‌ ఎస్టిమేట్స్‌ మార్చే ఆప్షన్‌ ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకుని తగిన ప్రమాణాలతో చేయని పనులను చేసేసినట్టు ఎంబుక్‌లో నమోదు చేశారు. ఇలాగే బిల్లులు పెట్టేశారు. దీనికి ప్రధాన కారకులు స్థానిక ఏఈ, డీఈఈలే అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. మెజర్‌మెంట్‌ చేయాల్సింది ఏఈ కాగా, వాటిని సర్టిఫై చేయాల్సింది డీఈఈ. ఉమ్మడి జిల్లాలో ఉన్న డీఈఈ ప్రస్తుతం విజయవాడ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయవాడ రూరల్‌ మండల పరిధిలో జరిగిన పైపులైన్ల పనులకు విచారణాధికారిగా ఈయన్నే నియమించారు. అయితే తమ పనులపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు అందటంతో ముందు జాగ్రత్తగా రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఎంబుక్‌లో మార్చేశారు. అయితే గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు సంబంధించిన డేటాను సీఎఫ్‌ఎంఎస్‌లో ఎంటర్‌ చేస్తారు. ఆ డేటాలో 75 ఎంఎం డయా, 6 గేజ్‌ వాడినట్టు, ఆరు అంగుళాల ఇసుక వేసినట్టు నమోదయింది. సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేసిన వివరాలను మార్చడం అసాధ్యం. దీంతో వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లో ఒకలా, ఎంబుక్‌లో మరోలా ఉన్నాయి. కలెక్టర్‌ ఈ రెండు రికార్డులనూ తెప్పించి చూస్తే.. దొంగలు అడ్డంగా దొరికిపోతారు.


తప్పు మీద తప్పు 

ఎలాచూసినా ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేశారు.  ఇన్వాయిస్‌ బిల్స్‌ లేకుండా స్టాండర్డ్స్‌ పైపులు ఉపయోగించకపోవటం ప్రజారోగ్య కోణంలో పెద్ద తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవటం కోసం మరో తప్పు చేశారు. అదే ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుంటోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు అందినప్పటి నుంచి విచారణాధికారి రెండు రోజుల సెలవులోకి వెళ్లిపోయారు. ఆయన లాంగ్‌ లీవ్‌ పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. అదే జరిగితే ఈ వ్యవహారంపై మరో విచారణాధికారిని నియమించాల్సి వస్తుంది. 


కంచికచర్లలోనూ ఇటువంటి కథే

ఇదే ఈఈ గతంలో డీఈఈగా ఉన్నపుడు నందిగామ సబ్‌ డివిజన్లోని కంచికచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో బైపాస్‌ నుంచి హరిజనవాడ వరకు పైపులైన్ల పనులు చేపట్టారు. పని ఒకటే అయినా దానిని నాలుగు విభాగాలుగా విభజించి, నామినేషన్‌ మీద ఇచ్చేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత వాటర్‌ టెస్ట్‌ నిర్వహించగా.. అవి పగిలిపోయాయి. దానిపై ఇంతవరకు ఉన్నతాధికారులు విచారణ జరిపించలేదు. ఆ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లు రాలేదు. అతని పరిస్థితిని చూసి అధికార పార్టీ ఎమ్మెల్సీ తన డబ్బు ఇచ్చి అతను నష్టపోకుండా చేశారు. మండలాల పరిధిలో చోటు చేసుకుంటున్న ఇటువంటి అవినీతి పనులు వరసగా వెలుగులోకి వస్తుండటంతో ఇలాంటి  అవినీతి పనులు ఇంకెన్ని ఉన్నాయోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-04-28T06:45:24+05:30 IST