Abn logo
Oct 28 2021 @ 00:42AM

పెద్దలే గద్దలై..

పేదల బియ్యం పాపంలో అందరికీ వాటా 

నిన్న కైకలూరు.. నేడు మొవ్వ..

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు 

మొవ్వలోనూ నిల్వల్లో భారీ తేడా

జిల్లాలో దాదాపు అన్ని పాయింట్లలోనూ ఇదే తీరు 

అన్ని స్థాయిల్లోనూ అక్రమాల నెట్‌వర్క్‌ 

ఆంధ్రజ్యోతి కథనాలతో కదలిక

సమగ్ర విచారణకు ఆదేశించిన సివిల్‌ సప్లయిస్‌ ఎండీ 


పేదల బియ్యం కోసం జిల్లాలో ‘పెద్ద’ గూడుపుఠాణీయే నడుస్తోంది. రేషన్‌ బియ్యం స్కామ్‌ ఒక్క కైకలూరుతో ఆగలేదు. మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లోనూ భారీగా బియ్యం పక్కదారి పట్టినట్టు తాజాగా విజిలెన్స్‌ దాడుల్లో గుర్తించటం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇటువంటి కుంభకోణాలు ఒక్క కైకలూరుకే పరిమితం కాలేదంటూ మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గురించి కూడా బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించింది. దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు జిల్లా పౌరసరఫరాల విభాగంలో ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అవినీతిపరులంతా ఒక్కటై.. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను పంచుకుంటున్నారనేందుకు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అవినీతి భాగోతాలే నిదర్శనం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో కూడా భారీగా బియ్యం మాయం అయినట్టు విజిలెన్స్‌ అధికారులు తాజాగా గుర్తించారు. ఘంటసాల మండలం కొడాలిలో మొవ్వ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఉంది. తరచూ ఈ గోడౌన్‌ నుంచి బియ్యం బస్తాలు పలు మిల్లులకు తరలిపోతున్నట్టు సమాచారం. ఇదే తరహాలో అవనిగడ్డ, మైలవరం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి కూడా భారీగా పేదల బియ్యం లారీల్లో తరలిపోయాయని తెలుస్తోంది. విజిలెన్స్‌ అధికారులు వీటిపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనూ విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తే ఇంకెన్ని స్కామ్‌లు వెలుగు చూస్తాయో! 


బలంగా అవినీతి వేళ్లు

పౌర సరఫరాల శాఖలో అవినీతి మళ్లీ విస్తృత మవుతోందనడానికి ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్లలో వెలుగు చూస్తున్న అక్రమాలే నిదర్శనం. ప్రజా పంపిణీ వ్యవస్థ ఒకప్పుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఉండేది. దీనిని సంస్కరించటం కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినా, పూర్తిస్థాయిలో నిర్మూలించటం సాధ్యం కావటం లేదు. వ్యవస్థీకృత లోపాలను అడ్డం పెట్టుకుని కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు  అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒకప్పుడు డీలర్ల స్థాయిలో అవినీతి విపరీతంగా ఉండేది. డీలర్ల నుంచే అధికారులకు వాటాలు వెళ్లేవి. దీనిని నియంత్రించటానికి ఈ పోస్‌ విధానాన్ని తీసుకు వచ్చారు. ఈ విధానం వచ్చాక 90 శాతం డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ప్రజలకు పంపిణీ చేసే బియ్యం విషయంలో అవలంభించిన ఇదే విధానాన్ని బియ్యం ప్రొక్యూర్‌మెంట్‌లో కూడా అమలు పరిచి, రెండింటినీ అనుసంధానం చేసినట్టయితే అవినీతిని అన్ని స్థాయిల్లోనూ నియంత్రించడం సాధ్యమయ్యేది. అలా చేయకపోగా ఈ పోస్‌ కారణంగా కోల్పోయిన అక్రమార్జన కోసం కొందరు అవినీతి అధికారులు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను ఆశ్రయిస్తున్నారు. 


బియ్యం లెక్క ఓ ఫార్సు  

బియ్యం ఎఫ్‌సీఐ నుంచి వచ్చినా.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, మిల్లుల్లో ఆడించి సరఫరా చేసినా, వాటి పరిమాణానికి ఖచ్చితత్వం ఉండాలి. గోడౌన్లకు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, బఫర్‌ గోడౌన్లకు బియ్యం ఎంతెంత పరిమాణంలో చేరుతుంది? అక్కడి నుంచి చౌక దుకాణదారులకు పంపిస్తున్నదెంత? చౌక దుకాణదారులు ఎండీయూలకు ఎంత  సరుకు పంపిణీ చేస్తున్నారు? మిగులు నిల్వలు ఎన్ని?... ఈ వివరాలు పబ్లిక్‌ డొమెయిన్‌లో లేవు. పేదలకు బియ్యం పంపిణీ చేసే ఈ పోస్‌ విధానంలో ఒక రేషన్‌ డిపోలో ఎంత సరుకు ఉందో తెలుసుకునే అవకాశం పబ్లిక్‌ డొమెయిన్‌లో ఉండగా, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ డిపోలకు ఎంత సరుకు వస్తున్నదనే వివరాలు లేకపోవడం విచిత్రం. దీని ద్వారానే అవినీతి అధికారుల కిటుకు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తూకం వేసి బస్తాలను డిపోలకు పంపించేవారు. ప్రస్తుతం ఏ పాయింట్‌లోనూ తూకం వేయటం లేదు. దీనికి బదులు బస్తాల ప్రాతిపదికన లోడింగ్‌ చేయటంతో అవినీతికి ఆస్కారమేర్పడుతోంది. ఈ పోస్‌ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆదాయాన్ని కోల్పోయిన కొందరు డీలర్లు కూడా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోని సిబ్బందికి సహకరిస్తున్నారు. దీంతో డిపోలకు నిర్దిష్ట కోటా ఇవ్వకుండా, గోడౌన్లలోనే ఉంచి, అక్కడి నుంచే గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. 


రెండు రేషన్లు.. అక్రమాలకు ఊతం  

దేశంలో ఆహార నిల్వలు పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పేదలకు ప్రతి నెలా ఉచిత బియ్యం ఇస్తోంది. ఒకే నెలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రేషన్‌ ఇస్తుండటంతో ప్రజల దగ్గర బియ్యం నిల్వలు పేరుకుంటున్నాయి. కొందరు ఈ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. ఈ అవకాశాలను క్షేత్రస్థాయిలో ఎండీయూ ఆపరేటర్‌, డీలర్‌, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. వీరికి అన్ని స్థాయిల్లోనూ సహాయ సహకారాలు అందడంతో ఎవరి వాటాలు వారికి చేరిపోతున్నాయి. ప్రతి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఆన్‌లైన్‌ రికార్డ్‌తో పాటు, మాన్యువల్‌ రిజిస్టర్‌ నిర్వహించాలి. చాలా పాయింట్లలో మాన్యువల్‌ రికార్డులను నిర్వహిస్తున్నా, రెండు, మూడు రికార్డులను ప్రైవేటుగా నిర్వహిస్తున్నారంటే లెక్కలను తారుమారు చేసేందుకు ఎంత పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారో అర్థం అవుతోంది.


మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులతో లోపాయికారీ ఒప్పందాలు  

మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌లు లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవటం వల్ల కూడా గోడౌన్లలోని పేదల బియ్యం పక్కదారి పడుతోంది. ప్రొక్యూర్‌మెంట్‌ స్థాయి నుంచే తప్పుడు లెక్కలు నమోదవడం వల్ల గోడౌన్లలో తప్పులు చేసినా, వెంటనే లెక్కలను సరి చేసేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి వరకు అంతా కుమ్మక్కవడంతో ఇదంతా తేలిగ్గా జరిగిపోతోందని తెలుస్తోంది. సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ కార్యాలయ అధికారులకు ఇదంతా తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఈ పాపంలో వాటా ఉండటం వల్లనే వారు నోరు మెదపటం లేదని కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం స్కామ్‌ రుజువు చేసింది. అక్కడ సాక్షాత్తూ ఓ అఽఽధికారిణి అక్రమార్కుల నుంచి రూ.40 లక్షలు లంచాన్ని డిమాండ్‌ చేయడమే ఇందుకు నిదర్శనం.


కైకలూరు స్కామ్‌పై ఎట్టకేలకు కలెక్టర్‌కు నివేదిక 

కైకలూరు బియ్యం స్కామ్‌కు బాధ్యులైనవారిపై ఎట్టకేలకు చర్యలు తీసుకునే దిశగా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఒక డీలర్‌, లేదా వ్యాపారి అక్రమాలకు పాల్పడితే తక్షణం చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో మాత్రం ఆ దిశగా కదలలేదు. ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావటంతో.. ఎట్టకేలకు ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. సివిల్‌ సప్లయిస్‌ ఎండీ వీరపాండియన్‌ దీనిపై సమగ్ర వివరణ కోరటంతో పాటు, విచారణకు ఆదేశించారు. ఇదే క్రమంలో దీనిపై కలెక్టర్‌కు రిపోర్ట్‌ అందించేందుకు ఫైల్‌ను సిద్ధం చేసి, కలెక్టర్‌ కార్యాలయానికి పంపించినట్టు సమాచారం.