చిత్తూరు జిల్లాకు.. నాలుగు బీసీ కార్పొరేషన్‌ పదవులు!

ABN , First Publish Date - 2020-10-01T17:46:13+05:30 IST

చిత్తూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్‌ పదవులు దాదాపు ఖరారైనట్లు..

చిత్తూరు జిల్లాకు.. నాలుగు బీసీ కార్పొరేషన్‌ పదవులు!

చిత్తూరు(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్‌ పదవులు దాదాపు ఖరారైనట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వాటిలో మన జిల్లాకు నాలుగు దక్కనున్నాయి. 


మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బుల్లెట్‌ సురేష్‌ నియమితులైనట్టు సమాచారం. చిత్తూరు నగరానికి చెందిన ఈయన కాంగ్రె్‌సలో ఉంటూ వైసీపీ ప్రారంభంలో జగన్‌ వెంట నడిచారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లి, గత ఎన్నికలకు నాలుగునెలల ముందుగా వైసీపీలోకి వచ్చారు. అప్పట్లో సురేష్‌తో పాటు 8మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎంపీటీసీలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ప్రస్తుతం బీసీ కోర్‌ కమిటీ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. 


వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా వనితను ప్రభుత్వం నియమించనుంది.ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన ఈమె స్వగ్రామం కుప్పం మండలం మల్లానూరు. భర్త శీను రాజేంద్రప్రసాద్‌తో పాటు కుటుంబమంతా వైఎస్సార్‌ అభిమానులే. వైసీపీ ప్రారంభం నుంచీ పార్టీలో కొనసాగుతున్నారు. రాజేంద్రప్రసాద్‌ తండ్రి మురుగేష్‌ ప్రస్తుతం కుప్పం మండల వైసీపీ కన్వీనర్‌గా ఉన్నారు.


పాలఏకిరి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించనున్న తరిగొండ మురళీధర్‌ పులిచెర్ల మండలం కల్లూరువాసి. 1986లో పులిచెర్ల మండల యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014-19 సంవత్సరాల మధ్య ఎంపీపీగా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పులిచెర్ల జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేశారు. గతంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడిగా, ఎస్వీ జూపార్కు డైరెక్టరుగా పనిచేశారు. మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటున్నారు.


ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితులు కానున్న కె. శాంతి 2014-19సంవత్సరాల మధ్య నగరి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. ఈయన భర్త కేజే కుమార్‌ గతంలో కాంగ్రెస్‌లో ఉంటూ వైసీపీ ప్రారంభం నుంచి జగన్‌ వెంటే కొనసాగుతున్నారు. 2004-09 మధ్యకాలంలో కాంగ్రెస్‌ ఉన్నప్పుడు ఈయన కూడా నగరి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. కుమార్‌ వైసీపీ రాష్ట్ర బీసీ విభాగ సెక్రటరీగా, వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.



Updated Date - 2020-10-01T17:46:13+05:30 IST