సిరిసిల్ల జిల్లాకు కార్పొరేషన్‌ పదవి

ABN , First Publish Date - 2022-09-14T05:42:55+05:30 IST

ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ పవర్‌లూం, టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా సిరిసిల్లకు చెందిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సిరిసిల్ల జిల్లాకు కార్పొరేషన్‌ పదవి
గూడూరి ప్రవీణ్‌ను అభినందిస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

- పవర్‌లూం, టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌

- మాట నిలుపుకున్న మంత్రి కేటీఆర్‌

- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊతం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ పవర్‌లూం, టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా సిరిసిల్లకు చెందిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్‌ నియామకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. జిల్లాకు తొలి కార్పొరేషన్‌ పదవి లభించడంతో జిల్లా నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండే సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర అవిర్భావంతో అధికార పక్షంలో నిలిచింది. జిల్లా ఏర్పడడంతో పలువురికి పదవులు దక్కగా ప్రవీణ్‌కు రాష్ట్ర స్థాయి పదవి లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. చేనేత, జౌళి శాఖలో మార్పులు తీసుకవస్తూ 2018లో మరమగ్గాలు, చేనేత మగ్గాల బంధాన్ని విడదీశారు. తెలంగాణ పవర్‌లూం, టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌, తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌లను విడివిడిగా ఏర్పాటు చేశారు. 28, 29 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. ఒక్కొ కార్పొరేషన్‌కు రూ. 5.10 కోట్లు షేర్‌ క్యాపిటల్‌ కేటాయించింది. కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినా కార్యాలయం, చైర్మన్‌లను మాత్రం నియమించలేదు. నాలుగేళ్లుగా కార్పొరేషన్‌ ఎప్పుడూ అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న క్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక,ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన క్రమంలోనే సిరిసిల్ల పద్మశాలి సామాజిక వర్గానికే చైర్మన్‌ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆలస్యమైనా సిరిసిల్ల పద్మశాలి సామాజిక వర్గానికే చైర్మన్‌ పదవి అందించారు. నియామకంపై సిరిసిల్ల వస్త్ర పారిశ్రామికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సిరిసిల్లలో కార్పొరేషన్‌ డివిజన్‌ కార్యాలయం 

తెలంగాణ పవర్‌లూం టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. గతంలో జీవోలో పేర్కొన్నట్లు పది జిల్లాలకు కలిపి సిరిసిల్లలో డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. డివిజన్‌ కార్యాలయం ఏర్పాటుతో సిరిసిల్లలో ప్రభుత్వ అర్డర్ల కొనుగోళ్లు, అర్థిక లావాదేవీలు జరుపుకునే వీలు కలుగుతుంది.

ఒడిదొడుకుల్లోనే వస్త్ర పరిశ్రమ 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ అర్డర్లతో కార్మికులకు చేతినిండా పని, మెరుగైన వేతనాలు లభిస్తున్నాయని భావిస్తున్నా ఇంకా అనేక రంగాల్లో ఒడిదొడుకుల ప్రస్థానమే కొనసాగుతోంది. 2017 నుంచి క్రమం తప్పకుండా బతుకమ్మ చీరల అర్డర్లు వస్తున్నాయి. అర్డర్లతో వస్త్ర పరిశ్రమలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. కేవలం బతుకమ్మ చీరలపైనే అధారపడడంతో కొత్త తరహా ఉత్పత్తుల వైపు పరిశ్రమ అడుగు వేయడం లేదు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి అవుతున్నా ఉత్పత్తిదారులను బకాయిలు వెంటాడుతూనే ఉంటాయి. దాదాపు రూ.150 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. సిరిసిల్ల కార్మికుల అత్మహత్య నివారణ నేపధ్యంలో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి వద్ద 75 ఎకరాల్లో 2000- 2003 సంవత్సరంలో రూ 7.73 కోట్లతో టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణం చేపట్టారు. ప్రస్థుతం టెక్స్‌టైల్‌ పార్కులో 165 ఇండస్ట్రియల్‌ యూనిట్లు, 27 కమర్షియల్‌ యూనిట్లకు ప్లాట్లను కేటాయించారు. 115 యూనిట్లతో 1475 అధునిక రాపియర్‌ మరమగ్గాలను ఏర్పాటు చేశారు. వీటిపై అధునికమైన వస్త్రోత్పత్తి చేసే అవకాశం ఉన్నా బతుకమ్మ చీరలపైనే ఆధారపడే పరిస్థితి తీసుకవచ్చారు. ప్రస్తుతం టెక్స్‌టైల్‌ పరిశ్రమకు రావాల్సిన రాయితీలు రాకపోగా టెక్స్‌టైల్‌ పార్కులో యూనిట్లకు ఎన్‌వోసీ గైడ్‌లైన్స్‌ భారంగా మారాయి. పార్కు ఏర్పడి 18 సంవత్సరాలు అవుతున్నా కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పరిశ్రమలు స్థాపించిన వారు మరమగ్గాలను తరలించుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా విద్యుత్‌ భారం పరిశ్రమ మనుగడకు ఇబ్బందిని కలిగిస్తోంది. సిరిసిల్లలో 35 వేల మరమగ్గాలు ఉండగా ప్రత్యక్షంగా పరోక్షంగా 15 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చడానికి సిరిసిల్ల పెద్దూర్‌ వద్ద వర్కర్‌ టూ ఓనర్‌ పథకంలో భాగంగా మొదటి విడతలో 1,404 మంది లబ్ధిదారులకు 4,416 మరమగ్గాలను అందిస్తూ 46 వర్క్‌షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఇవి కూడా నత్తనడకగానే సాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో గార్మెంట్‌ రంగంలో మహిళలకు ఉపాధి అందించడానికి 60 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు పూనుకున్నారు. అపెరల్‌ పార్కు నిర్మాణం కొంత మేరకు కదలిక వచ్చింది. బహూళ జాతి కంపెనీలు పరిశ్రమలను స్థాపించడంతో మహిళలకు ఉపాధి ఏర్పడినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 

చెదిరిపోతున్న రంగుల కళ

మరమగ్గాల కార్మికులకు ఉపాధి అందించే దిశగా బతుకమ్మ చీరల అర్డర్లను అందించగా రంగుల అద్దకం పరిశ్రమ వెలవెలబోయింది. గతంలో సిరిసిల్లలో ఉన్న మరమగ్గాలపై కొంత మేరకు కాటన్‌ బట్ట ఉత్పత్తి జరిగేది. బతుకమ్మ అర్డర్లతో కాటన్‌ బట్ట ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. దీనికి అనుబంధంగా ఉన్న అద్దకం పరిశ్రమ, సైజింగ్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. గతంలో 300లకు పైగా ఉన్న డైయింగ్‌ యూనిట్లు ప్రస్తుతం 60 యూనిట్లకు మించి లేవు. 28 సైజింగ్‌లు ఉండగా అవి కూడా నడవని పరిస్థితుల్లో ఉన్నాయి. మరోవైపు రసాయనాల ధరలు పెరగడం ఇతర ప్రాంతాల నుంచి పోటీ తీవ్రతతో అద్దకం పరిశ్రమ వెలవెలబోతోంది. 

గూడూరి ప్రవీణ్‌ ప్రొపైల్‌.

పేరు : గూడూరి ప్రవీణ్‌ 

చదువు : ఎంఏ, ఎంఫిల్‌ 

భార్య :  మంజుల, మాజీ కౌన్సిలర్‌ 

పిల్లలు : కూతురు ప్రత్యూష, కొడుకు మానస్‌ 

పదవులు :

కార్యదర్శి ప్లానింగ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (అగ్రహారం), గతంలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర చేనేత సెల్‌ కార్యదర్శితో పాటు పలు పదవుల్లో పనిచేశారు. సెస్‌ వైస్‌ చైర్మన్‌, చైర్మన్‌గా పనిచేశారు. సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. 

Updated Date - 2022-09-14T05:42:55+05:30 IST