కార్పొరేషన్‌.. పరేషాన్‌!

ABN , First Publish Date - 2022-07-27T05:12:34+05:30 IST

అన్ని వర్గాల అభివృద్ధే తమ లక్ష్యమని చెబుతూ వివిధ కులాల పేరిట అట్టహాసంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భిన్నంగా వ్యవహరిస్తోంది.

కార్పొరేషన్‌.. పరేషాన్‌!
పార్వతీపురంలో బోర్డుకే పరిమితమైన ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

   బోర్డులకే పరిమితమైన కార్పొరేషన్ల కార్యాలయాలు

    సేవలు శూన్యం 

 ఇబ్బందుల్లో నిరుద్యోగ అభ్యర్థులు

  మూడేళ్లుగా అందని ఆర్థిక సాయం 

 బ్యాంకులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి 

 ప్రభుత్వం స్పందించాలని విన్నపం

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

 అన్ని వర్గాల అభివృద్ధే తమ లక్ష్యమని చెబుతూ వివిధ కులాల పేరిట అట్టహాసంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రతి కార్పొరేషన్‌కు చైర్మన్‌, డైరక్టర్లను నియమించి మమ అనిపించింది. మూడేళ్లుగా వారిని కుర్చీలకే పరిమితం చేసింది.  నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై రుణాల మంజూరు, వాహనాల అందజేత వంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. అసలు జిల్లాలో ఆయా కార్యాలయాలు ఎక్కుడున్నాయో తెలియని పరిస్థితి. మొత్తంగా సర్కారు తీరుపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదు. కొత్తగా ఏర్పడిన అనేక కార్పొరేషన్ల  చైర్మన్లు, డైరెక్టరలకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యం  కల్పించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ప్రజలకు కార్పొరేషన్ల నుంచి సేవలందించాల్సిన వారు సమావేశాలు, వాహనాల ముందు బోర్డుల  ఏర్పాటుకే పరిమితమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడేళ్లుగా ఏ ఒక్క కార్పొరేషన్‌ ద్వారా కూడా నిరుద్యోగులను ఆదుకోలేదు.  ఉపాధి కల్పించేందుకు అవసరమైన సబ్సిడీ రుణాలు గాని, మరే ఇతర రుణాలు గాని అందించే పరిస్థితి లేదు. ఒకప్పుడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించేవారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. అయితే ఇప్పుడు సీన్‌ మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నిరుద్యోగ అభ్యర్థులకు ఏ మాత్రం తోడ్పాడు అందించడం లేదు. వాస్తవంగా ఆయా కార్పొరేషన్లకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే  50 శాతం నుంచి 90 శాతం వరకు సబ్సిడీతో కూడిన రుణాలను ప్రభుత్వాలు మంజూరు చేసేవి. నిరుద్యోగుల జీవనోపాధి కోసం చేపట్టే వ్యాపారాలు, డెయిరీల ఏర్పాటుకు ఆర్థికంగా సహకరించేవి.  ఇవే కాకుండా బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా కార్లు, వ్యాన్లు, తదితర వాహనాలను కూడా సబ్సిడీపై అందించేవారు. అయితే గత మూడేళ్లుగా  అటువంటి పరిస్థితి లేదు. 

జిల్లాకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్‌ ప్రత్యేక కార్యాలయాన్ని పార్వతీపురంలోని ఆర్‌సీఎం ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యాలయం ఏర్పాటు బోర్డుకు మాత్రమే పరిమితమైందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాకు ఒకటే కార్పొరేషన్‌ ఉంది. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జిల్లా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయ నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను మాత్రం జిల్లాకు కేటాయించలేదు. దీంతో  కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌  అప్పారావు హాజరై తమ శాఖకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. ఒకప్పుడు బీసీ కార్పొరేషన్‌ అంటే నిరుద్యోగులకు కేరాఫ్‌గా ఉండేది. అటువంటిది కొత్తగా ఏర్పాటు చేసిన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ కార్పొరేషన్‌ ద్వారా వెనుకబడిన తరగతి వారికి  సబ్సిడీతో కూడిన రుణాలు అందడం లేదు. దీంతో స్వయం ఉపాధి పొందాలనుకుంటున్న నిరుద్యోగులు బ్యాంకులనే ఆశ్రయించాల్సి వస్తోంది. 

    సేవలు అందిస్తున్నాం

మూడేళ్లలో ఎటువంటి ప్రాజెక్టులు ప్రారంభించలేదు. ‘చేయూత’ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి హాజరవుతూ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సెప్టిక్‌ క్లీనింగ్‌ వాహనాలను అందించేందుకు  ప్రతిపాదనలు పంపించాలని జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లను అడిగాం. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం కార్పొరేషన్‌ ద్వారా అర్హులకు వాహనాలు అందిస్తాం. 

 - అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, పార్వతీపురం మన్యం జిల్లా


Updated Date - 2022-07-27T05:12:34+05:30 IST