Abn logo
Mar 27 2020 @ 04:26AM

కరోనా నివారణకు 50 లక్షలు ఏ మూలకు?

రూ.2 కోట్లు  అవసరమంటున్న  వైద్యాధికారులు

ఇప్పటికీ అందని  మాస్కులు, శానిటైజర్లు

జిల్లావ్యాప్తంగా 1610  క్వారంటైన్‌ పడకలకు ప్రణాళికలు

ఐసొలేషన్‌ కోసం  వసతులున్న ప్రైవేటు ఆస్పత్రుల పరిశీలనచిత్తూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌వ్యాప్తి నివారణ నిమిత్తం జిల్లాకు రూ.50 లక్షలు విడుదలయ్యాయి. కనీసం రూ.2 కోట్లు అవసరమని వైద్యాధికారులు అంచనా వేస్తుండగా అందులో 25శాతమే విడుదల కావడం పట్ల అధికారయంత్రాంగంలో నిస్పృహ వ్యక్తమవుతోంది.నియోజకవర్గానికో క్వారెంటైన్‌ కేంద్రాన్ని కనీసం వంద పడకలతో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. జిల్లాలో 14 ప్రాంతాలను గుర్తించి.. కొన్ని చోట్ల ఏర్పాట్లు చేశారు.. మరికొన్నిచోట్ల పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేకపోయారు. ఇక ఐసొలేషన్‌ కేంద్రాల విషయానికొస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంది.


అధికారులు జిల్లా అంతటా రెండువందలకుపైగా ఐసొలేషన్‌ పడకలున్నా యని చెబుతున్నా.. కరోనాను దీటుగా ఎదుర్కొనే పడకలు 39 మాత్రమే ఉన్నాయి. తిరుపతిలోని రుయాలో 20, స్విమ్స్‌లో 6, చిత్తూరులో 8, మదనపల్లెలో 5 పడకలు.. మొత్తం 39 పడకలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా అనుమానితులను, విదేశాల నుంచి వచ్చిన వారిని మాత్రమే క్వారంటైన్‌ కేంద్రంలో, కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగిని ఐసొలేషన్‌లో ఉంచుతారనే విషయం తెలిసిందే. క్వారంటైన్‌లో పడకలు, అందులో ఉన్నవారికి వసతులుంటే సరిపోతుంది.ఐసొలేషన్‌ వార్డుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ వంటి అత్యున్నత స్థాయి వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలి. ఇలా  జిల్లాలో నాలుగు వార్డులు మాత్రమే ఉన్నాయి. అంటే 39 మందికి కరోనా పాజిటివ్‌ వస్తే ఎదుర్కోవడానికి మాత్రమే సిద్ధంగా యంత్రాంగ ముంది.


అరకొర నిధులతో ఇబ్బందులు

జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వంద పడకల చొప్పున క్వారెంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఏర్పాటుచేశారు. వీటితో పాటు తిరుపతిలో ఐసొలేషన్‌ పడకలను పెంచనున్నారు. రుయాలోని ఓల్డ్‌ మెటర్నిటీ హాస్పిటల్‌లో 200 పడకలతో ఐసొలేషన్‌ కేంద్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ వంటి  సదుపాయాలున్న ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు రెండు రోజులు జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను పరిశీలించారు. ఇదంతా పూర్తిస్థాయిలో అమలు కావాలంటే జిల్లాకు కనీసం రూ.2 కోట్ల నిధులు అవసరమని వైద్యాధికారులు అంటున్నారు. 


అయితే ప్రభుత్వం రూ.50 లక్షలను మాత్రమే కేటాయించింది. తిరుపతిలోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్‌కు రూ.5 లక్షలు, మిగిలిన నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసే క్వారంటైన్లకు రూ.లక్ష చొప్పున కేటాయించారు. ఇదివరకే కరోనా నివారణలో భాగంగా చేసిన ప్రచారం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు.


ప్రతిపాదించినా.. అందని లక్ష మాస్కులు

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో మాస్కులు నిండుకున్న వేళ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారులు లక్ష మాస్కులు అవసరమని ప్రభుత్వానికి వారం కిందట ప్రతిపాదనలు పంపించారు. జిల్లా లో ఉన్న 9వేల మాస్కులను వైద్య సిబ్బందికి, పోలీసులకు,కోర్టు సిబ్బందికి పంపిణీ చేశారు. మాస్కు లు కొనుగోలు చేసుకోవాలన్నా సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. మాస్కులతో పాటు శాని టైజర్స్‌ కొరతా జిల్లాలో తీవ్రంగా ఉంది.అధికారుల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పంద నా లేదు. డీఆర్డీఏ అధికారులు పది వేల మాస్కులు తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


క్వారంటైన్ల ఏర్పాటుపై స్థానికుల్లో వ్యతిరేకత

కరోనా వ్యాధి అనుమానితులను, విదేశాల నుంచి వచ్చిన వారిని ఉంచేందుకు మాత్రమే క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాల్లో అనుమానితులను 14 రోజులు ఉంచి, రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. రిజల్ట్‌ పాజిటివ్‌ వస్తే ఐసొలేషన్‌కు.. నెగిటివ్‌ వస్తే ఇంటికి పంపించేస్తారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో అనుమానితుల కోసం పడక,  భోజన వసతి, టీవీ.. వంటి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. అయితే ఇక్కడ రోగుల కారణంగా కరోనా స్థానికంగా ప్రబలుతుందనే అపోహలో కొందరు క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తు న్నారు.ఉదాహరణకు పూతలపట్టు నియోజకవర్గానికి గానూ కాణిపాకం దేవస్థాన గదుల్లో క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ.. స్థానికంగా ఉన్న 14 గ్రామాల నుంచి ఉభయదారులు కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దని సోమవారం ఆలయ ఈవోకు వినతి పత్రం అందించారు. దీంతో అధికారులు పునరాలోచనలోపడ్డారు. 


తంబళ్లపల్లె నియోజకవర్గం కోసం అంగళ్లులోని విశ్వం ఇంజనీరింగ్‌ కళాశాలను, గోల్డెన్‌ వాలీ స్కూల్‌ను పరిశీలించారు. విశ్వం కళాశాలలో కేంద్రం ఏర్పాటు చేయవద్దని ఇక్కడికి వచ్చిన అధికారులను స్థానికులు కోరడంతో కేవలం గోల్డెన్‌ వాలీ స్కూల్‌లో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. 


నగరి నియోజకవర్గానికిగానూ ప్రాంతీయ ఆస్పత్రిలోని కేకేసీ భవనంలో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు సిద్ధం చేసినా.. అది నగరానికి దూరంగా ఉంటుందనే కారణంగా మంగళవారం సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలకు మార్చారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. కలెక్టర్‌ భరత్‌గుప్తా మంగళవారం పలు క్వారంటైన్‌ కేంద్రాలను పరిశీలించారు.

Advertisement
Advertisement
Advertisement