కరోనా కాటు

ABN , First Publish Date - 2020-04-02T07:45:11+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ లింకుతో కేసులు, మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 23 మంది మరణించారు. దీంతో

కరోనా కాటు

  • దేశంలో ఒక్క రోజే 437 కేసులు, 23 మరణాలు
  • తెలంగాణలో 30 పాజిటివ్‌లు.. ముగ్గురి మృతి
  • ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 67 మందికి కరోనా
  • తమిళనాడులో బుధవారమే 110 పాజిటివ్‌ కేసులు
  • మొత్తం అందరికీ ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ లింకు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ లింకుతో కేసులు, మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 23 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 58కి చేరింది. వీరిలో ఒక్క తెలంగాణలోనే ముగ్గురు ఉన్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 437 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,900 దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి.  వీరిలో అత్యధికులకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లడం వల్లే కరోనా సోకింది. కాగా.. ఉత్తరప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదయింది. రెండు రోజుల కిందట గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో 25 ఏళ్ల యువకుడు మరణించాడు. తరువాత వచ్చిన పరీక్ష ఫలితాల్లో అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. దేశంలో వైరస్‌ బారినపడిన 132 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 20 కేసులు నమోదయ్యాయి. వాటిలో 19 ఇండోర్‌లోనే బయటపడ్డాయి.


వారిలో ముగ్గురు పిల్లలు సహా 9 మంది ఒకే కుటుంబంవారు. బాధితుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 86కు పెరిగింది. వారిలో ఐదుగురు మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 18 కేసులు నమోదవడంతో మొత్తం 320కు పెరిగింది. తాజా కేసుల్లో 16 ముంబైలోనే వెలుగుచూశాయి. రాష్ట్రంలో మరో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 12కు చేరింది. రాష్ట్రంలో 162 మంది కరోనా సోకిన వారితో దగ్గరగా మసలిన 5,000 మందిని క్వారంటైన్‌ చేశారు. ముంబైలో తొలిసారిగా ఓ పోలీసు కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో అతని కుటుంబ సభ్యులను, 32 మంది సహ సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. ఢిల్లీలో కేసుల సంఖ్య 152కు ఎగబాకింది. వీరిలో 53 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ప్రార్థనలకు హాజరైన వారు ఉన్నారు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లా సర్వాడ్‌ పట్టణంలో ఓ దర్గా వద్ద మత ప్రార్థనల కోసం వంద మంది గుమిగూడగా పోలీసులు చెదరగొట్టారు.


ఆరుగుర్ని అరెస్టు చేశారు. అసోంలో కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ నలుగురూ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్‌కు వెళ్లి వచ్చినవారే. పంజాబ్‌లో తాజాగా ఐదు కేసులు బయటపడగా... మొత్తం 46కు చేరాయి. విదేశాల నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన 2,800 మందిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఒడిసా ప్రభుత్వం తెలిపింది. గుజరాత్‌లో వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగుల పదవీ విరమణను రెండు నెలలు(మే 31 వరకు) వాయిదా వేశారు. 


వైద్యుడికి కరోనా.. కేన్సర్‌ ఆస్పత్రి మూసివేత

ఢిల్లీ ప్రభుత్వ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఒక డాక్టర్‌కు కరోనా సోకడంతో ఆస్పత్రిని రసాయనాలతో శుద్ధి చేయడానికి ఒక రోజు మూసివేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఇద్దరు రెసిడెంట్‌ డాక్టర్లు కూడా కొవిడ్‌-19 బారినపడ్డారు.  


సొంతూరికి వెళ్లేందుకు చనిపోయినట్లు నటన 

శ్రీనగర్‌:లాక్‌డౌన్‌ను తప్పించుకొని ఇంటికెళ్లడానికి 70 ఏళ్ల హకీమ్‌దిన్‌ నకిలీ మరణ ధ్రువపత్రం సృష్టించాడు. చనిపోయినట్లు నటిస్తూ అంబులెన్స్‌లో పడుకొని ముగ్గురు స్నేహితులతో కలిసి జమ్మూ నుంచి స్వగ్రామం(పూంచ్‌)కు బయలుదేరాడు. 160 కిలోమీటర్ల దాకా ఎవరూ గుర్తించలేదు. చివరి చెక్‌పోస్టు దగ్గర అతడి నాటకాన్ని ఓ కానిస్టేబుల్‌ గుర్తుపట్టాడు. వారిని క్వారంటైన్‌కు తరలించారు.


తమిళనాట 110మందికి పాజిటివ్‌

చెన్నై/బెంగళూరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): తమిళనాట బుధవారం ఒక్కరోజే 110 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 234కు చేరింది. బాధితుల్లో 190 మంది ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారేనని రాష్ట్ర ఆరోగ్య మంత్రి బీలా రాజేష్‌ తెలిపారు. కర్ణాటకలో మరో 9 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 110 మంది బాధితులుగా తేలగా వీరిలో ముగ్గురు మృతిచెందారు. మరో 9 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 


మొబైల్‌ ట్రాకింగ్‌తో క్వారంటైన్‌పై నిఘా 

హోం క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలపై కన్నేసి ఉంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చైనా, సింగపూర్‌ బాటను అనుసరిస్తోంది. గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించిన వ్యక్తుల మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేయాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు 25 వేల ఫోన్‌ నంబర్లను పోలీసులకు ఇచ్చారు. సింగపూర్‌ వంటి దేశాల స్ఫూర్తితో టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. మొబైల్‌ ఫోన్ల ట్రాకింగ్‌ పద్ధతిని మొదట చైనా అవలంబించింది. కరోనా కట్టడికి అనుమానితులను హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించినా వారిని గడప దాటకుండా చూడడం పెద్ద సవాల్‌. అటువంటి వారి ఇళ్లకు నోటీసులు అంటించడం, నిబంధనలు పాటించకపోతే సమాచారమివ్వాలని ఇరుగు పొరుగు వారికి చెప్పడం వంటివి అధికారులు చేశారు. ఈ ప్రయత్నాలు ఒక్కటే సరిపోలేదు. దాంతో కర్ణాటక ఓ యాప్‌ తీసుకొచ్చింది. దాని ద్వారా గంటకోసారి జియోట్యాగ్‌డ్‌ సెల్ఫీ పంపాలి. 


నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్‌ గత నెలలో నిర్వహించిన కార్యక్రమానికి పలు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు.

రాష్ట్రాల వారీగా మర్కజ్‌కు హాజరైన వారి సంఖ్య 


Updated Date - 2020-04-02T07:45:11+05:30 IST