Abn logo
Jun 2 2020 @ 11:41AM

ఇప్పుడిక మరింత జాగ్రత్త

ఆంధ్రజ్యోతి(02-06-2020)

కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవడం కోసం ఎల్లకాలం లాక్‌డౌన్‌లో బందీలం కాలేం. అలాగని ఎటువంటి జాగ్రత్తలూ అనుసరించకుండా స్వేచ్ఛగానూ తిరగలేం. కరోనాను ఇప్పటికిప్పుడు తరిమికొట్టే వీలు లేదు కాబట్టి దాంతో కలిసి జబ్బుపడకుండా జీవనం ఎలా కొనసాగించాలనే అంశం మీద దృష్టి పెట్టడం అవసరం. అందుకోసం కొన్ని నియమాలను నిత్యజీవితంలో చేర్చుకోవాలి.


సామాజిక దూరం

వైరస్‌ వ్యాప్తికి సమర్థంగా అడ్డుకట్ట వేసే నియమం ఇది. షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడం, ఇతరులకు ఒక మీటరు దూరం పాటించడం, అత్యవసరం అయితే తప్ప సమూహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన జనసమ్మర్దం ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండడం లాంటి నియమాలూ కొనసాగించాలి. వినోదాలు, శుభకార్యాలు జరిగే సందర్భాల్లో బంధువులు, స్నేహితులందరూ ఒక ప్రదేశంలో గుమికూడడం మన దేశ సంప్రదాయంలో భాగం. కానీ ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అంతటా కరోనా విస్తరించిన ప్రస్తుత సమయంలో ఈ నియమాలు కచ్చితంగా పాటించడం అవసరం.


పరిశుభ్రత

పరిశుభ్రతకు పెద్ద పీట వేయవలసిన సమయం ఇది. ఇల్లు, ఆఫీసు, ప్రయాణమాధ్యమాలు, బహిరంగ ప్రదేశాలు... ఇలా ప్రతి ప్రదేశమూ పరిశుభ్రంగా ఉంచుకోక తప్పదు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ, మెట్ల పక్కన ఉండే రైలింగ్స్‌, తలుపు గడియలు, డెస్క్‌... ఇలా చేతులు తాకే వీలున్న ప్రతి ఉపరితలాన్నీ ఒక శాతం సోడియం హైపోక్లోరైట్‌ ఉన్న శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను తరచుగా సబ్బునీటితో, లేదా 80ు ఆల్కహాల్‌ కలిగిన శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు హ్యాండ్‌ శానిటైజర్‌ వెంట తీసుకువెళ్లాలి. చేతులు కలిపి పలకరించుకునే పాశ్చాత్య సంస్కృతి మాని, చేతులు జోడించి అభివాదం చేసే భారతీయ సంస్కృతినే అనుసరించాలి.


మాస్క్‌

ఒక అనస్థటిస్ట్‌గా శిక్షణ పొందే నాటి నుంచి ముఖానికి మాస్క్‌ ధరించడం నాకు అలవాటు. ఇంత కాలంలో నేనెప్పుడూ మాస్క్‌ వల్ల అసౌకర్యానికి గురి కాలేదు. ఫేస్‌ మాస్క్‌ అసౌకర్యాన్ని కలిగిస్తోందనీ, ఊపిరి అందడం లేదనీ కొంతమంది మాస్క్‌ ధరించడంలో ఇబ్బందులను ఏకరువు పెడుతూ ఉండడం గత కొంత కాలంగా నేను గమనిస్తూ ఉన్నాను. నిజానికి మాస్క్‌ ధరించడానికి అలవాటు పడితే, ఎలాంటి అసౌకర్యమూ అనిపించదని నేను హామీ ఇస్తున్నాను. కరోనా విస్తరించిన ప్రస్తుత సమయంలో మాస్క్‌ ధరించడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రతి రోజూ మాస్క్‌ ధరించడానికి అలవాటు పడక తప్పదు. సాధారణంగా కరోనా వైరస్‌తో పాటు ఇతరత్రా సూక్ష్మక్రిములు తేలికగా ముక్కు, నోటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మాస్క్‌ ధరిస్తే ఇవేవీ దాన్ని దాటుకుని మన శరీరంలోకి ప్రవేశించలేవు. మాస్క్‌ రక్షణ కవచంలా వాటికి అడ్డు పడుతుంది. కాబట్టి వీటిని తప్పక ధరించాలి. అయితే మాస్క్‌ ధరించే విధానం కూడా కీలకమే! దాన్ని ధరించేటప్పుడు, తొలగించేటప్పుడు మాస్క్‌ను కాకుండా, చెవులకు తగిలించుకొనే హ్యాంగింగ్స్‌నే పట్టుకోవాలి. ముక్కు నుంచి గడ్డం వరకూ మాస్క్‌ ముఖాన్ని కప్పి ఉంచేలా ఉండాలి. ఇలా కాకుండా ముక్కు, నోటిని సక్రమంగా మాస్క్‌ మూయకపోతే రక్షణ దక్కడం కష్టమే!


ఆరోగ్యం

కరోనా విస్తరించినప్పటి నుంచి ఇతరత్రా వ్యాధులు కలిగిన వారికే ఇన్‌ఫెక్షన్‌ తేలికగా సోకడం, ఇలాంటి వారికే వ్యాధి ముదిరి ప్రాణాంతకంగా పరిణమించడం చూస్తున్నాం. కరోనా మరణాల్లో కేన్సర్‌, మధుమేహం, హైపర్‌టెన్షన్‌, హృద్రోగం మొదలైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారివే ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమస్యలను ప్రారంభంలోనే గుర్తించడం కోసం ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఉబ్బసం, అధిక రక్తపోటు, మధుమేహం కలిగిన వారు క్రమంతప్పక పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఉండాలి. వైద్యుల కనుసన్నల్లో మెలుగుతూ ఉండాలి. వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ ఉండాలి. ఇలా మధుమేహులు, అధిక రక్తపోటు కలిగిన వారు జాగ్రత్తగా మెలిగితే కరోనా నుంచి రక్షణ పొందడంతో పాటు, గుండె పోటును కూడా నియంత్రించుకోవచ్చు.


డిజిటల్‌ ప్రపంచం

డిజిటల్‌ కనెక్టివిటీ కారణంగా ప్రపంచదేశాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. అయితే కరోనా కారణంగా రాకపోకలకు ఆటంకం కలిగినా, డిజిటల్‌ సేవల వినియోగం పూర్వం కంటే పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి బిల్లుల చెల్లింపులకు, షాపింగ్‌కు, చదువు, ఇతరత్రా ఫీజుల భర్తీలకు డిజిటల్‌ విధానం ద్వారా డబ్బులు చెల్లించే వెసులుబాట్లను ఉపయోగించుకోవాలి. 


వ్యాధి నిరోధకశక్తి

వ్యాధినిరోధకశక్తికి జీవనశైలితో ప్రత్యక్ష సంబంధం ఉంది. వ్యాయామం, సమతులాహారం, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు, సరిపడా నిద్ర... ఇవన్నీ వ్యాధినిరోధకశక్తిని మెరుగ్గా ఉంచే అంశాలు. వ్యాధినిరోధకశక్తిని రాత్రికి రాత్రే పెంచే పరిస్థితి లేదు. మాత్రలతో, ఇతరత్రా మందులతో ఇమ్యూనిటీని పెంచుకునే వీలు లేదు. వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడం కోసం ఎవరికి వారు బాధ్యతగా, కచ్చితమైన, నియమానుసారమైన జీవనశైలిని అనుసరించే ప్రయత్నం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ప్రొటీన్లు, పిండిపదార్థాలు, కొవ్వులతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ఇవి వ్యాధినిరోధకశక్తి మెరుగుదలకు తోడ్పడతాయి. కాబట్టి తదనుగుణంగా, ఎవరికి వారు, వారి వారి జీవనశైలిని బట్టి ఆహారపుటలవాట్లను మలుచుకోవాలి. పోషకాలన్నీ సమపాళ్లలో అందే సమతులాహారం తీసుకోవాలి. కొందరికి అదనపు విటమిన్లు, ఖనిజ లవణాలు సప్లిమెంట్ల రూపంలోని తీసుకోవలసిన అవసరం రావచ్చు. ఒత్తిడి, నిద్రలను అలక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ వీటి ప్రభావం వ్యాధినిరోధకశక్తి మీద ఎక్కువ. కాబట్టి యోగా, ధ్యానం, సంగీతం వినడం, కుటుంబసభ్యులతో గడపడం ద్వారా ఒత్తిడిని తొలగించుకోవాలి. మానసిక ఉల్లాసం ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి మనసును హుషారుగా ఉంచే పనులను ఎవరికి వారు ఎంచుకోవాలి. రోజుకు కనీసం 8 గంటలకు తగ్గకుండా నిద్ర పోవాలి. నిద్రాభంగం కలగకుండా పడకగదిలో సెల్‌ ఫోన్లు, టివిలకు చోటు కల్పించకూడదు. పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా, గాలి చొరబడేలా ఉండేలా చూసుకోవాలి.- డాక్టర్‌ కె. హరిప్రసాద్‌

అపోలో హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.