జాగ్రత్తలు పాటిస్తే కరోనా దూరం

ABN , First Publish Date - 2020-03-11T09:26:31+05:30 IST

కరోనా వైరస్‌ ప్రమాదకరమైనదేనని, అయితే.. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ సోకదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అడిషనల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమణ ధార తెలిపారు.

జాగ్రత్తలు పాటిస్తే కరోనా దూరం

ప్రభుత్వం బాగా కృషి చేస్తోంది : డాక్టర్‌ రమణ ధార 


హైదరాబాద్‌ సిటీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రమాదకరమైనదేనని, అయితే.. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ సోకదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అడిషనల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమణ ధార తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యల గురించి ప్రచారం చేయడం మంచి విషయమని అభినందించారు. మంగళవారం లామకాన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, మనదేశంలో ప్రభావం వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. కొవిడ్‌- 2019గా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నామకరణం చేసిన ఈ వైరస్‌ చాలాకాలంగా జంతువుల్లో ఉందని, ఇప్పుడు మొదటిసారిగా మనుషులకు వ్యాప్తి చెందిందన్నారు. 


దీని కారణంగా జరగబోయే అనర్ధాన్ని అంచనావేయలేమన్నారు. ఎబోలా, మెక్సికన్‌ స్వైన్‌ప్లూలతో పోల్చితే ఇప్పటి వరకూ ఆ స్థాయిలో మరణాలు నమోదు కాలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా వైరస్‌ బారిన పడ్డారని, మనదేశంలో ఈ రోజు వరకూ 45 మందికి సోకిందన్నారు. మాస్క్‌లు వాడటం ద్వారా కరోనా వైరస్‌ రాదు అనేది అపోహేనని, కరోనా బాధితులు మాస్కులు వాడాలన్నారు. కరోనా వైర్‌సను చికిత్స ఇప్పటి వరకూ అందుబాటులోకి రాలేదని, ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్నవి నిరూపితం కాలేదన్నారు. కరోనా వైరస్‌ వచ్చినప్పటికీ మంచి రోగ నిరోధక శక్తి ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. సాధారణ ఫ్లూ, కరోనా రెంటింటి లక్షణాలు ఒకటేనని.. జలుబు, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు అప్పుడు అనుమానించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడంతో పాటు, దానిని అరికట్టడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా డాక్టర్‌ రమణధార వివరించారు. ఈ సందర్భంగా ఆయన కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

Updated Date - 2020-03-11T09:26:31+05:30 IST