వైరస్‌.. విజృంభణ

ABN , First Publish Date - 2021-04-17T05:17:02+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా పాజిటివ్‌ ఉండడం వారి వల్ల వారి కుటుంబంలో సభ్యులకు, స్నేహితులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు.

వైరస్‌.. విజృంభణ
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సర్వర్‌ పనిచేయక పోవడంతో కరోనా పరీక్షలకు వచ్చిన జనం అవస్థలు

లోపించిన స్వీయ నియంత్రణ.. పెరుగుతున్న కేసులు

కొవిడ్‌ పరీక్షలకు క్యూ కడుతున్న జనం

ఏలూరు జిల్లా ఆసుపత్రిలో సర్వర్‌ సమస్య

పనిచేయని ఆన్‌లైన్‌ సైట్లు.. 

ప్రజల పడిగాపులు

హైదరాబాద్‌ నుంచి స్నేహితుడు వచ్చాడని.. మిత్రులందరితో కలిసి హోటల్‌కి వెళ్లి కాఫీ తాగాడు. రెండు రోజుల తర్వాత తెలిసింది ఆ స్నేహితుడికి కరోనా అని. అతనితో కలిసిన వారందరి గుండెల్లో గుబులు మొదలైంది. నిద్రపోతే ఒట్టు. టెస్టుల కోసం ఆసుపత్రికి వచ్చి ఒకటే టెన్షన్‌ పడిపోతున్నారు. 

 ఒక మహిళ తమ చెట్టుకు ములక్కాడలు కాసాయని చుట్టుపక్కల వారి ఇళ్లకు వెళ్లి మరీ ఇచ్చి వచ్చింది. పనిలో పనిగా నాలుగు ముచ్చట్లు మాట్లాడి వచ్చింది. తర్వాత తెలిసింది. ములక్కాడలు తీసుకున్న ఒకామెకు కరోనా అని.. అంతే ఇచ్చిన మహిళకు గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. కుటుంబ సభ్యులు ఆమెను పరీక్ష చేయిద్దామని ఆసుపత్రికి తీసుకువచ్చారు. 

హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒక మహిళ మూలంగా కుటుంబ సభ్యులందరూ కరోనా బారినపడ్డారు. గుంటూరులో సోదరుడిని చూసేందుకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కుటుంబంలోని మిగిలిన వారు పరీక్షలకు ఆసుపత్రికి వచ్చారు. 

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 16 : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా పాజిటివ్‌ ఉండడం వారి వల్ల వారి కుటుంబంలో సభ్యులకు, స్నేహితులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారంటే కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించి పంపించేవారు. ఇప్పుడు వచ్చిన వారు కనీసం తమ ఇంటిలోనైనా ఒంటరిగా ఒక రూమ్‌లో ఉంటే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేది. కానీ తమకు ఏమీ లేదన్నట్లు స్నేహితులతో, సమాజంలో తిరగడంతో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. ఒకరూ ఇద్దరూ కాదు.. వందల మంది చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల కరోనా బారిన పడు తున్నారు. ఇతరులకు అంటిస్తున్నారు. నగరంలోని పలు వురు శుక్రవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం క్యూకట్టారు. వీరి గురించి ఆరా తీస్తే.. ఒక్కొక్కరూ ఒక్కో విషయం చెప్పారు. ఆన్‌లైన్‌లో కరోనా టెస్టు రిజిస్టర్‌ చేయించుకునే సమయానికి ఆన్‌లైన్‌ సైట్‌ మొరాయిండంతో ఏం చేయాలో తెలియక గంటల తరబడి అక్కడే ఉండిపోయారు. ఏలూరు ప్రభుత్వాసు పత్రి కరోనా నిర్ధారణ టెస్టులు ఆన్‌లైన్‌ చేసే  విభాగం ఒకటే కావడం, కేవలం ఇద్దరు మాత్రమే చేయడం వల్ల వందలాది మంది వచ్చి వెళ్లిపోతున్నారు. ఏలూరు ప్రభు త్వాసుపత్రిలో కనీసం ఐదు, ఆరు విభాగాలను ఏర్పాటు చేస్తే తప్ప టెస్టుల కోసం వచ్చిన వారికి త్వరితగతిన పరీక్ష లందవు. కరోనా పరీక్షలకు వచ్చే వారిలో పాజిటివ్‌ వున్న వారి పక్కనే మిగిలిన వారు ఉండడం వల్ల వారికి సోకే ప్ర మాదం ఉంది. అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి ఎక్కువ కరోనా టెస్టుల విభాగాలను పెంచాలి. 

మరో 68 మందికి పాజిటివ్‌ 

ఏలూరు ఎడ్యుకేషన్‌ : జిల్లాలో శుక్రవారం మరో 68 మందికి కరోనా పాజిటివ్‌ సోకింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 421కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 94,961కు చేరింది. మరణాల సంఖ్య 542. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి శుక్రవారం వరకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో మొత్తం 14 మంది టీచర్లు, 51 మంది విద్యార్థులు ఉన్నారు.


రెండు రోజుల్లో.. ప్రైవేటు చికిత్సకు అనుమతులు

ఏలూరు ఎడ్యుకేషన్‌  : కొవిడ్‌ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలపై కలెక్టర్‌ అధ్యక్షతన గల జిల్లా కమిటీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. జిల్లాలో 34 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉండగా వీటిలో నాలుగు ప్రైవేటు, ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, తణుకులలోని ఏరియా ఆసుపత్రులు, బుట్టా యిగూడెం, భీమవరం, పాలకొల్లులోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కరోనా బాధితులకు చికిత్సలు చేసేందుకు ప్రభు త్వం గత ఏడాది అధికారికంగా అనుమతులు ఇచ్చింది. కరోనా వైద్య సేవలకు ఫీజులను నిర్ధారించింది. ఇన్‌ పేషెంట్‌గా వసూలు చేయాల్సిన మొత్తం, ఐసీయూ సేవలు, వెంటిలేటర్‌ అమర్చాల్సి వస్తే అయ్యే ఖర్చులు నిర్దేశించింది. దీనికి భిన్నంగా పలు ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సలు చేసేందుకు అనుమతులు లేకున్నా రోగులను చేర్చుకోవడం, ఆసుపత్రుల్లో అడ్మిషన్‌ సమయంలోనే రూ.లక్షల్లో అడ్వాన్సులుగా డిపాజిట్‌ రూపంలో వసూలు చేయడం, కొన్ని చికిత్స లకు నిర్దేశించిన దానికంటే అధిక మొత్తాల్లో డబ్బులు వసూలు చేయడం వంటివి అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ దఫా అటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి ప్రస్తుతానికి ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి, జిల్లా ప్రభుత్వాసుపత్రి, ఏరియా ఆసు పత్రులు, సీహెచ్‌సీ లకు మాత్రమే కొవిడ్‌ చికిత్సలకు అనుమతులు ఇచ్చారు. మిగిలిన ప్రైవేటు ఆసుపత్రులకు అనుమ తిచ్చే ముందు ప్రభుత్వ షరతులకు అంగీకరిస్తేనే ప్రతిపాదనలను ఆమోదించనున్నారు.


హోం ఐసొలేషన్‌ కిట్లు రెడీ

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 16 : కరోనా వైరస్‌ నిర్ధారణ అయితే వారి వ్యాధిని పరిస్థితిని బట్టి హోం ఐసొలేషన్‌ ఉండే వారికి ప్రభుత్వం మందులను సిద్ధం చేసింది. వీటిని కిట్లుగా తయారు చేసి పంపించారు. వీటిలో విటమిన్‌ సి టాబ్లెట్స్‌ 28 ఉండగా రోజుకు రెండు చొప్పున, జింక్‌ 50 ఎంజి టాబ్లెట్స్‌ 14 రోజుకు ఒకటి చొప్పున, విటమిన్‌ డి3 క్యాపిల్స్‌ నాలుగు.. వారానికి ఒకటి చొప్పున, బి కాంప్లెక్స్‌ టాబ్లెట్లు 14 రోజుకు చొప్పున ఒకటి, పారాసెట్‌మాల్‌ 650 ఎంజీ 10 టాబ్లెట్స్‌ రోజుకు రెండు చొప్పున, సిట్రోజన్‌ 10 ఎంజి టాబ్లెట్స్‌ ఐదు రాత్రి పూట ఒకటి చొప్పున, ప్యాంటప్రోజోల్‌ 40 ఎంజీ టాబ్లెట్స్‌ 10 రోజూ ఉదయం పరగడుపున రోజుకు ఒకటి చొప్పున వేసుకోవాలని సూచించారు. జ్వరం, ఒళ్లునొప్పులు ఉన్నప్పుడు మాత్రమే పారాసెట్‌మాల్‌ వేసుకోవాలని, జలుబు, ముక్కు కారుతున్నప్పుడు మాత్రమే సిట్రజన్‌ వేసుకోవాలని సూచించారు. హోం ఐసోలేషన్‌ కిట్లు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రావడంతో హోం ఐసొలేషన్‌ కోరుకున్న వారికి వీటిని అందిస్తున్నారు.

Updated Date - 2021-04-17T05:17:02+05:30 IST