కరోనా.. 817

ABN , First Publish Date - 2020-08-08T08:05:18+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 817 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా.. 817

జిల్లాలో మొత్తం 21,855కు చేరిన కేసులు

ఇందులో యాక్టివ్‌ కేసులు 16,784

పల్లెలపైనా వైరస్‌ పడగ



ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 817 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 21,855కు చేరింది. వీరిలో 4,812 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 16,784 మంది కరోనాతో పోరాడుతున్నారు. గడచిన 24 గంటల్లో తొమ్మిదిమంది మరణించగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 259కి చేరింది. గుంటూరు నగరంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 8,443 మంది కొవిడ్‌ బారిన పడగా ఇంకా 6,478 మంది యాక్టివ్‌లో ఉన్నారు. నరసరావుపేటలో 1,435 పాజిటివ్‌ కేసులకు 1,036 యాక్టివ్‌లో ఉన్నాయి. తాడేపల్లిలో 870 కేసులకు 458 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇతర మండలాల్లో 11,107 పాజిటివ్‌ కేసులు రాగా 8,812 యాక్టివ్‌లో ఉన్నాయి. జిల్లాలో శుక్రవారం వరకు 2,35,942 మందికి పరీక్షలు నిర్వహించారు.


ప్రతీ 10 లక్షల మందిలో 48,349 మందికి పరీక్ష చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వర్గాలు తెలిపాయి. నరసరావుపేటలో  ఇప్పటివరకు కరోనాతో 15 మంది మృతి చెందినట్టు వైద్య శాఖ ధ్రువీకరించింది. ఏప్రిల్‌ 9న తొలి కేసు నమోదు కాగా జూలై 8 వరకు 305 కేసులు నమోదయ్యాయి. ఈ నెల రోజుల్లోనే 633 కేసులు నమోదు కావడం పట్టణ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. సగటున రోజుకు 63 కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే పట్టణంలో 63, రూరల్‌లోని గ్రామాలలో 25 కేసులు నమోదయ్యాయి. తెనాలి పట్టణంలో 15, రూరల్‌ మండలంలోని కఠెవరంలో 2, నందివెలుగులో 1 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భట్టిప్రోలులో ఓ మండల స్థాయి అధికారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యురాలు ఆకురాతి సీతాకుమారి చెప్పారు.

 

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య 

 కరోనా భయంతో ఈపూరులో మండవ లక్ష్మయ్య (39) అనే యువకుడు శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి గత వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. గురువారం ఆయనకు నెగిటివ్‌గా వచ్చింది. అయినప్పటికీ జ్వరం తీవ్రత తగ్గకపోవడం, తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో తన బాగోగులు చూసుకునేవారు లేరనే ఆందోళనతో బావిలో దూకినట్లు బంధువులు తెలిపారు. 

Updated Date - 2020-08-08T08:05:18+05:30 IST