జిల్లాలో కరోనా వైరస్‌ లేనట్టే ..

ABN , First Publish Date - 2020-04-04T11:08:45+05:30 IST

జిల్లా అధికారులు, ప్రజలకు శుక్రవారం పెద్ద ఊరటే లభించింది. కరోనా వైరస్‌ ఛాయలు జిల్లాను తాకలేదని నిర్ధారణ అయింది.

జిల్లాలో కరోనా వైరస్‌ లేనట్టే ..

ఊపిరి పీల్చుకున్న అధికారులు, జిల్లా ప్రజలు

పెండింగ్‌లో ఉన్న మూడు కేసుల్లోనూ నెగిటివ్‌ రిపోర్టులే

హోం క్వారంటైన్‌లో 352 మంది


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/రింగురోడ్డు: జిల్లా అధికారులు, ప్రజలకు శుక్రవారం పెద్ద ఊరటే లభించింది. కరోనా వైరస్‌ ఛాయలు జిల్లాను తాకలేదని నిర్ధారణ అయింది. పెండింగ్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన రిపోర్టుల్లో కూడా నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. వైరస్‌ నిర్ధారణ కేంద్రం నుంచి శుక్రవారం జిల్లా కేంద్రానికి తాజా నివేదికలు చేరాయి. మొత్తంగా అనుమానిత 13 కేసుల్లోనూ వైరస్‌ ప్రభావం లేనట్లు నివేదికలు రావటం మంచి పరిణామంగా భావిస్తున్నారు. తాజాగా శుక్రవారం రెండు అనుమానిత కేసులు మాత్రం వచ్చాయి. వారి నుంచి శాంపిల్స్‌ను కాకినాడలోని ల్యాబ్‌కు పంపిస్తున్నారు. 


 అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు.. పోలీస్‌ శాఖ చేపట్టిన కట్టుదిట్టమైన నిర్భంద చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో కరోనాపై బాగా చైతన్యం వచ్చింది. లాక్‌డౌన్‌ను దాదాపుగా అందరూ పాటిస్తున్నారు. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒకరిని మాత్రమే బయటకు పంపుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లను ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు జిల్లాలో 476 మంది ఉన్నారు. వీరిలో ఎవరికీ వైరస్‌ లేక పోవటం గమనించాల్సిన అంశం. ఇంతవరకు 124 మంది క్వారంటైన్‌ స్థాయి నుంచి బయటపడ్డారు. వీరు కూడా విచ్చలవిడిగా తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 352 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోనే 85మంది వలస కార్మికులు క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా వైద్య శాలగా నెల్లిమర్లలోని మిమ్స్‌ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు.


ఇక్కడ వైరస్‌ అనుమానిత కేసులకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. మందులు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు సిద్ధం చేసి ఉంచారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వీటిన్నింటినీ అందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సామాజిక వైద్య కేంద్రాలను కారంటైన్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కూడా బెడ్లు, మందులు సిద్ధం చేశారు.  పార్వతీపురంలోని ఏరియా ఆసుపత్రిని క్వారంటైన్‌ కేంద్రంగా మార్చారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిని కరోనా వైద్య శాలగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ముందుజాగ్రత్తలు పాటించారు. ఒకవేళ కేసుల ఉధృతి పెరిగినా ఇబ్బంది లేకుండా అందుకు అనుగుణంగా ఏర్పాట్ల చేయటంలో యంత్రాంగం సఫలమైంది. జిల్లాలో వైరస్‌ వ్యాప్తి లేని కారణంగా ఇటు ప్రజలు అటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. అయితే శుక్రువారం కొత్తగా వచ్చిన కేసుల విషయంలో శాంపిళ్లు తీసుకుని శనివారం ల్యాబ్‌కు పంపించనున్నారు. వీరు హైదరాబాద్‌, కోల్‌కతా, రాజమండ్రి నుంచి వచ్చినవారు. దీనిపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జి.నాగభూషణరావు మాట్లాడుతూ ఈ కేసుల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదని వివరించారు. 


మూడూ నెగిటివ్‌ ఫలితాలే...హరిజవహర్‌లాల్‌, కలెక్టర్‌

జిల్లా నుంచి కరోనా నిర్ధారిత పరీక్షలకు పంపిన మూడు శాంపిల్స్‌ నెగిటివ్‌ రిపోర్టులు వచ్చియి. గతంలో పంపిన 10 శాంపిల్స్‌ నెగిటివ్‌ రాగా తాజాగా పంపిన మూడు కూడా నెగిటీవ్‌గానే తేలాయి. జిల్లాలో ఒక్కటి కూడా పాజిటివ్‌ నమోదుకాలేదు.  కరోనా నివారణ చర్యలన్నీ యథావిధిగా కొన సాగుతాయి.

Updated Date - 2020-04-04T11:08:45+05:30 IST