Abn logo
Apr 3 2020 @ 05:32AM

వైద్యం దూరం... అ‘ధన ’పు భారం!

ప్రభుత్వాసుపత్రుల్లో అందని సేవలు

జిల్లా వ్యాప్తంగా రోగులకు అవస్థలు 

సంచి వైద్యులను ఆశ్రయిస్తున్న వైనం

ఆర్థిక ఇబ్బందులతో సతమతం


(కలెక్టరేట్‌): కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీలు నిలిచిపోయాయి. సాధారణ రోగులకు వైద్యసేవలు అందడం లేదు. జలుబు, జ్వరం, తలనొప్పితో బాధ పడుతున్న రోగులకు ప్రాథమిక చికిత్స కూడా అందడం లేదు. కుక్క, పాము, తేలు కాటుకు గురైనా.. చికిత్సలు చేయడం లేదు. కరోనా నియంత్రణ పేరుతో కొందరు విధులకు డుమ్మా కొడుతున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బంది సక్రమంగా సేవలు అందజేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక దీర్ఘకాలిక రోగాలతో నలిగిపోతున్న వృద్ధులకు సైతం సర్కార్‌ వైద్యం అందుబాటులో లేకపోవడంతో సంచి వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది.


కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోంది. కరోనా అనుమానిత కేసులను పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఆసుపత్రులో ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తోంది. ఆయా ప్రాంతాల వైద్యులు రేయింబవళ్లు శ్రమిస్తూ సేవలు అందజేస్తున్నారు. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందికి మాత్రం పెద్దగా పనిలేకుండా పోయింది. కేవలం గ్రామాల్లో కరోనా అనుమానిత కేసులను గుర్తించి.. జిల్లా అధికారులకు సమాచారం అందించే కేంద్రాలుగానే పీహెచ్‌సీలు పనిచేస్తున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా ఆసుప్రతుల్లో సాధారణ వైద్యసేవలు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది. వైద్య బృందాలను ఏర్పాటు చేసి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి సేవలు అందజేయాలని ఆదేశించింది.


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వలంటీర్‌, ఆరోగ్య కార్యకర్త, ఏ.ఎన్‌.ఎం, ఆశావర్కుర్లతో కూడిన ప్రాథమిక స్థాయి బృందాలు ఏర్పాటు చేయాలి. అలాగే నగరపాలక సంస్థలో డివిజనకు ఒక సెకండరీ స్థాయి బృందం, మునిసిపాలిటీల్లో మూడు వార్డులకు ఒక బృందం చొప్పున ఏర్పాటు చేసి సాధారణ రోగులకు వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకూ బృందాల ఏర్పాటు కాలేదు. మరికొన్ని ప్రాంతాల్లో బృందాలు ఏర్పాటు చేసినా.. క్షేత్రస్థాయిలో పర్యటించిన పరిస్థితి లేదు. దీంతో సాధారణ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ బృందాలు ఇంటింటికీ సర్వే చేసి.. కరోనా అనుమానితులతో పాటు సాధారణ రోగులను కూడా గుర్తించి.. ఆ ప్రాంతాల వైద్యులకు సమాచారం ఇవ్వాలి. ఆ వైద్యులను రోగుల ఇంటికి తీసుకెళ్లి.. సేవలు అందజేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ దిశగా చర్యలు లేకపోవడంతో సాధారణ రోగులకు అవస్థలు పడుతున్నారు.  


ఉదాహరణలెన్నో..

ఫ సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన అంపోలు లక్ష్మి గురువారం తేలికాటుకు గురైంది. దగ్గరలో ఉన్న తొగరాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆమె వెళ్లగా.. అక్కడ తాళాలు వేసి ఉండడంతో బాధతోనే వెనుదిరిగింది. చేసేది లేక ఆర్‌ఎంపీ వైద్యుడ్ని ఆశ్రయించింది. 


ఆమదాలవలస మండలం కలివరం గ్రామానికి చెందిన పప్పల అక్కన్న శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ వైద్యం అందకు మూడు రోజులు కిందట మృతి చెందాడు. 


ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఏఎన్‌ఎం వై.లలితకుమారి ఇటీవల ఐటీ ఇన్‌ఫెక్షన్‌కు గురై.. సాధారణ వైద్యం అందక ప్రైవుటు ఆసుపత్రిని ఆశ్రయించింది.  


సరుబుజ్జిలి మండలం గోనుపాడు గ్రామానికి చెందిన మామిడి ఉగాది.. ఐబీపీతో బాధపడుతూ.. పీహెచ్‌సీకి వెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. దీంతో  మందుల దుకాణాన్ని ఆశ్రయించి మాత్రలు వేసుకున్నారు.  


సరుబుజ్జిలికి చెందిన నూకరాజు తీవ్ర జ్వరంలో అస్వస్థతకు గురై.. సంచి వైద్యుడ్ని ఆశ్రయించారు. 


ఇలా జిల్లాలో ఎందరో రోగులకు సాధారణ వైద్యసేవలు అందడం లేదు. పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో వైద్య బృందాలు పర్యటించడం లేదు. దీంతో సాధారణ రోగులు ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులను, మెడికల్‌ షాపు నిర్వాహకులను ఆశ్రయిస్తున్నారు. వారి సలహాల మేరకు మందులను వాడుతున్నారు. 


ఎంతమంది ఉన్నా.. సేవలు సున్నా!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ఓపీ నిలిపివేయడం.. అటు వైద్య బృందాలు గ్రామాల్లో పర్యటించకపోవడంతో అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 50 పీహెచ్‌సీలు, మరో ఆరు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 6వేల మందికిపైగా వైద్యసిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 3,720 మంది ఆశా వర్కుర్లు ఉన్నారు. అలాగే జిల్లాలో ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి సంబంధించి 850 మంది ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో పాటు సుమారు 5వేల మందికి పైగా వలంటీర్లు ఉన్నారు.


ఇంత పెద్దస్థాయిలో ప్రాథమిక, సెకండరీ స్థాయి వైద్య బృందాలను ఏర్పాటు చేసినా.. కనీసం సాధారణ రోగులకు సేవలు అందజేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కుర్లు, ఏఎన్‌ఎమ్‌లు, వలంటీర్లు కేవలం నిత్యావసర సరుకులు పంపిణీ, అనుమానితులు గుర్తిస్తున్నారే తప్ప.. సాధారణ రోగులకు వైద్యసేవలు అందజేసే పరిస్థితి లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు.. సాధారణ రోగులకు వైద్యం అందజేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. 


ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం.. ఎం.చెంచయ్య, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య బృందాలు ఏర్పాటు చేశాం. వైద్య సిబ్బంది పర్యవేక్షించి సాధారణ రోగులకు సేవలు అందజేస్తారు. ఎక్కడైనా సేవలు సక్రమంగా అందకపోతే నేరుగా ఫిర్యాదు చేయండి. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

Advertisement
Advertisement
Advertisement