ఢిల్లీ వెళ్లొచ్చిన వారికీ నెగెటివ్‌ ఫలితాలే

ABN , First Publish Date - 2020-04-02T10:00:30+05:30 IST

జిల్లాలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ లక్షణాలతో బాధ పడుతున్న అనుమానితుల్లో తీసిన శాంపిల్స్‌ (స్వాబ్‌) అన్నింటిల్లోనూ నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి.

ఢిల్లీ వెళ్లొచ్చిన వారికీ నెగెటివ్‌ ఫలితాలే

ఊపిరి పీల్చుకుంటున్న జిల్లా వాసులు

మరో ఎనిమిది శాంపిల్స్‌ కోసం ఎదురుచూపు


గుజరాతీపేట, ఏప్రిల్‌ 1: జిల్లాలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ లక్షణాలతో బాధ పడుతున్న అనుమానితుల్లో తీసిన శాంపిల్స్‌ (స్వాబ్‌) అన్నింటిల్లోనూ నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి. వీటిలో ఢిల్లీ వెళ్లొచ్చిన కొంతమంది శాంపిల్స్‌ కూడా నెగటివ్‌ ఫలితాలే రావడంతో జిల్లావాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.  వీరితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారిలో జిల్లాలో ఇప్పటివరకూ మొత్తంగా 34 మంది శ్యాంపిల్స్‌ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) వైద్యాధికారులు సేకరించారు.  కాకినాడ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. వీటిలో 26 శాంపిల్స్‌ నెగెటివ్‌గా వచ్చాయి. మరో ఎనిమిది ఫలితాలు రావాల్సి ఉంది.   


ఫలితాలు నెగెటివ్‌ వచ్చినప్పటికీ వారిని ఐసోలేషన్‌ కేంద్రాల్లో 14 రోజులు విధిగా ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు,  ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. బుధవారం నాటికి ఎచ్చెర్లలోని త్రిపుల్‌ ఐటీలోని ఐసోలేషన్‌ కేంద్రంలో 138 మంది, డా. బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో 63 మంది, టెక్కలి ఐతం కళాశాలలో 59 మంది,  జీజీహెచ్‌ బోధనాసుపత్రి మెన్‌ హాస్టల్‌లో 105 మంది, ఉమెన్స్‌ హాస్టల్‌లో 90 మంది, సిస్టం కళాశాలలో 85 మందిని ఉంచారు. వారందరికీ భోజనం, వసతి సౌకర్యాలను రెవెన్యూ అధికారులు కల్పించారు.


వీటితో పాటు పాలకొండ, టెక్కలి ఏరియా ఆసుపత్రులు, రాగోలు జెమ్స్‌, రాజాం జీఎంఆర్‌, శ్రీకాకుళంలోని అమృత, బగ్గు సరోజనీదేవి తదితర ఆసుపత్రుల్లో మరో 15 ఐసోలేషన్‌ వార్డులను ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, సోమవారం కలెక్టరేట్‌లోని కాల్‌ సెంటర్‌కు కరోనా వైరస్‌కు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చాయని ఏడీఎంహెచ్‌వో డా.జగన్నాథరావు వెల్లడించారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లోని ఐసోలేషన్‌ వార్డులో సుమారు 20 మందిని చేర్చుకున్నామని తెలిపారు.  


 జీజీహెచ్‌లో అత్యధికంగా సేకరణ

ప్రస్తుతం కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతూ అనుమానితులుగా గుర్తించిన వారి నుంచి అత్యధికంగా శాంపిల్స్‌ సేకరించడంలో బుధవారం రాత్రి జీజీహెచ్‌ వైద్యులు నిమగ్నమయ్యారు. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి సుమారు 15 మంది  నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వీటిని కాకినాడలోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు జీజీహెచ్‌ ఆర్‌ఎంవో డా.హేమంత్‌ తెలిపారు. 

Updated Date - 2020-04-02T10:00:30+05:30 IST