లక్ష టన్నుల గడ్డి కావాలి!

ABN , First Publish Date - 2020-03-29T11:13:45+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలోని పాడి పరిశ్రమపై అధికంగా పడింది.

లక్ష టన్నుల గడ్డి కావాలి!

నో కలెక్షన్‌ డేగా ప్రకటిస్తున్న డెయిరీలు

ఆందోళన చెందుతున్న పాడిరైతులు


చిత్తూరు(వ్యవసాయం), మార్చి 28: కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలోని పాడి పరిశ్రమపై అధికంగా పడింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో లక్ష టన్నుల మేర మేత కొరత ఏర్పడింది.జిల్లాలో 12.50 లక్షల పశువులకు వచ్చే మూడు నెలలకు గాను 5.42 లక్షల టన్నుల మేత అవసరం. ప్రస్తుతం 4.41 లక్షల టన్నులు అందుబాటులో ఉండడంతో, లక్ష టన్నుల కొరత ఏర్పడినట్టయింది. దీనికి సంబంధించి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తుగా నివేదిక పంపారు. ఆ మేరకు 8 వేల టన్నుల సైలేజ్‌, పోషకాలను అందించే 4 వేల టన్నుల టీఎంఆర్‌(టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌),  ఆరువేల టన్నుల దాణా, 400 టన్నుల పశుగ్రాస విత్తనాలు, రెండువేల టన్నుల ఎండుగడ్డి తదితర వాటి సరఫరాతో పాడిరైతులను ఆదుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.


ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలోపు లాక్‌డౌన్‌ అమలుల్లోకి రావడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ఏం చేయాలో తోచక పశుసంవర్ధక శాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు. 


పశుగ్రాసం కోసం పాట్లు... 

 వేసవిలో పశుగ్రాసం కొరతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతులు మూడునెలలకు సరపడా ఎండుగడ్డిని తూర్పు మండలాల తెచ్చుకుంటున్నారు. కరోనా ప్రభావంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడం సమస్యగా మారింది. లాక్‌డౌన్‌ అమల్లోకి రాకముందు రోజుకు 30 ట్రాక్టర్ల వరకు వరిగడ్డి సరఫరా అవుతుండగా, ఇప్పుడు వాహనాల జాడ లేదు. అన్నీవెరసి పశువులకు మేత కొరత ఏర్పడడంపై పాడిరైతుల్లో ఆందోళన నెలకొంది. 


పాల సేకరణకూ బ్రేక్‌ 

లాక్‌డౌన్‌ అమలుతో హోటళ్ళు, టీ తదితర దుకాణాలు మూతపడ్డాయి. సేకరించిన పాలను విక్రయించలేని పరిస్థితి జిల్లాలోని డెయిరీలకు ఏర్పడింది. దీంతో వారంలో రెండు, మూడురోజుల పాటు పాల సేకరణను ఆపివేస్తున్నాయి. ఆయా రోజుల్లో పాలు మిగలడంతో పాడిరైతులు నష్టపోతున్నారు. జిల్లాలో 65 వరకు డెయిరీలుండగా, ఇప్పటి వరకు పాల సేకరణ ఆపిన దాఖలాలు లేవు. కరోనా ప్రభావంతో పాలను మార్కెట్లో విక్రయించుకోలేక డెయిరీలు సతమతమవుతున్నాయి. దాదాపు 40 డెయిరీల వరకు రోజూ మిగిలిన పాలను పౌడర్‌గా మార్చడంపై దృష్టిసారించాయి. మిగిలిన డెయిరీలు పాలను పౌడరుగా మార్చే అవకాశం లేకపోవడం పాడి పరిశ్రమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతోంది. దీంతో కొన్ని డెయిరీలు పాల సేకరణకు దూరంగా నో కలెక్షన్‌ డేను ప్రకటిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగితే తమ పరిస్థితి ఏంటని జిల్లాలోని పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ చూపి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-03-29T11:13:45+05:30 IST