‘సామాజిక దూరం’ పాటించండి

ABN , First Publish Date - 2020-03-29T10:10:50+05:30 IST

విశాఖపట్నం ప్రశాంత నగరం. ప్రజలు శాంతస్వభావులు. ‘హుద్‌హుద్‌’ వంటి పెనుతుఫాన్‌ సంభవించిన సమయంలో విద్యుత్‌ లేకపోయినా, నిత్యావసరాలకు కొరత ఏర్పడినా అధికారులకు పూర్తిగా సహకరించారు.

‘సామాజిక దూరం’ పాటించండి

కరోనా వైరస్‌కు చెక్‌ చెప్పండి

ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తున్నా పట్టని కొంతమంది జనం

గుంపులు గుంపులుగా చేరి వీధుల్లో ముచ్చటు

 మీటరు దూరం ఉండాలని మర్చిపోతున్న వైనం

ఉబుసుపోక రోడ్లపై వాహనాలతో యువకుల చక్కర్లు 

రహదారులపై పిల్లల ఆటలు

మందీమార్బలంతో రాజకీయ నాయకుల పర్యటనలు

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా కొంతమంది నిర్లక్ష్యం

అవసరం లేకున్నా బయటకు వస్తున్న తీరు

ప్రభుత్వ సూచనలను పక్కనపెడితే ప్రమాదమే

ఇది కొనసాగితే ప్రమాదమంటున్న వైద్యులు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం):విశాఖపట్నం ప్రశాంత నగరం. ప్రజలు శాంతస్వభావులు. ‘హుద్‌హుద్‌’ వంటి పెనుతుఫాన్‌ సంభవించిన సమయంలో విద్యుత్‌ లేకపోయినా, నిత్యావసరాలకు కొరత ఏర్పడినా అధికారులకు పూర్తిగా సహకరించారు. అయితే ఇప్పుడు ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ కట్టడి విషయంలో మాత్రం స్వీయ నిర్బంధం పాటించలేకపోతున్నారు.


దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి ఇంకా ముందులు అందుబాటులోకి రాలేదు. రాకుండా జాగ్రత్త వహించడమొక్కటే మార్గం. అందుకు ‘సామాజిక దూరం’ పాటించడం అవసరం. అందుకే ప్రభుత్వం గత మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించింది. అత్యవసర సేవలు అందించే విభాగాల వారు తప్ప మిగిలిన వారంతా ఇంట్లోనే వుండాలని, బయటకు రావద్దని ఆదేశించింది. కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే...‘ఎవరితోను పోరాటాలు చేయొద్దు...ఎవరి ఇంట్లో వారు ఉండండి. ఎవరూ బయటకు రావద్దు’ అని సూచించింది. అయితే నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం కల్పించింది. వేటికీ కొరత రాకుండా ఏర్పాట్లుచేస్తోంది. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.


తెల్లవారి లేచింది మొదలు...

ఈ 21 రోజులు బయటకు వచ్చి వాకింగ్‌ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఎవరింట్లో వారు వ్యాయామాలు చేసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిని చాలామంది పాటించడం లేదు. ఎప్పటిలాగే ఉదయాన్నే వాకింగ్‌కు బయటకు వస్తున్నారు. కొందరు ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి ప్రారంభించిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొందరు పిల్లలను ఖాళీగా వున్న రోడ్లపైకి తీసుకువచ్చి వారితో కలిసి షటిల్‌ ఆడుతున్నారు. కొందరు యువకులు వాహనాలు ఏమీ తిరగడం లేదనే ధీమాతో జాతీయ రహదారిపై క్రికెట్‌ ఆడుతున్నారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం. అయితే విద్యావంతులే ఇలా చేయడం గమనార్హం.


కూరగాయల కోసం ఆత్రం

నగరంలో కేవలం 14 రైతుబజార్లు ఉండేవి. ఉల్లిపాయల కొరత వచ్చినప్పుడు, ఆదివారాల్లో తప్పితే మిగిలిన రోజుల్లో సాధారణ రద్దీయే ఉండేది. ఇప్పుడు నిత్యవసరాలకు కొరత రాకూడదని జిల్లా యంత్రాంగం అదనంగా 18 కొత్త రైతుబజార్లు ఏర్పాటుచేసింది. వీటిని మైదానాల్లో పెట్టింది. అయినా సరే జనాలు...దొరకని వస్తువులు అమ్మకానికి పెట్టినట్టు తెల్లవారి ఆరు గంటలకే రైతుబజార్లలో క్యూ కడుతున్నారు. పోలీసులు, రైతుబజార్ల సిబ్బంది ఎంత మొత్తుకున్నా ‘సామాజిక దూరం’ అనే మాట వారి చెవికి ఎక్కడం లేదు.


ఇంకా కొందరు రైతుల చుట్టూ గుమిగూడుతున్నారు. వారానికి సరిపడా కూరగాయలు ఒకసారి కొనుక్కోకుండా కొందరు రోజూ మార్కెట్‌కు వస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరికి వారే స్వీయ నిర్బంధం పాటించాలి. బయటకు రావడం తగ్గించుకోవాలి.


పని లేకుండానే షికార్లు

కొందరు యువకులు బైకులపై షికార్లకు అలవాటుపడి ఇప్పుడు ఇంట్లో ఉండలేకపోతున్నారు. స్నేహితులను ఎక్కించుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. పోలీసులు కూడా కేవలం జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌కే పరిమితమవుతున్నారు. వీధుల వైపు తొంగి చూడడం లేదు. కుర్రకారుకు కళ్లెం వేయలేకపోతున్నారు. జిల్లా యంత్రాంగం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బయట తిరగడానికి అనుమతి ఇచ్చింది. ఆ తరువాత ఎవరు రోడ్లపైకి వచ్చినా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఒంటి గంట దాటిన తరువాత వీధుల్లోకి వచ్చి అనవసరంగా తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది.


గుంపులుగా రాజకీయ నేతలు

‘సామాజిక దూరం’ అనే నిబంధనకు రాజకీయ నాయకులు గండి కొడుతున్నారు. రైతుబజార్లలో యాక్టివిటీ ఎక్కువగా వున్నందున మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వాటిని సందర్శించి సూచనలు చేస్తున్నారు. ఈ సందర్భాల్లోను వారి వెంట పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇక జీవీఎంసీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు కొందరు ప్రచారానికి ఇదే మంచి సమయంగా భావించి వార్డుల్లోకి గుంపులుగా వెళ్లి బ్లీచింగ్‌ జల్లడం, ఏవేవో పంచిపెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిపై కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 144 సెక్షన్‌ అమలులో వున్నప్పుడు అంతమందిని ఎలా అనుమతిస్తున్నారో పోలీసు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. సామాన్యులపై లాఠీ ఝళిపించడానికి ఏమాత్రం వెనకాడని వారు నాయకుల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు. 


జంక్షన్లలో ముచ్చట్లు

సాయంత్రం ఐదు గంటల తరువాత వీధుల్లో జంక్షన్లు, అపార్టుమెంట్లలో సెల్లార్లు, టెర్రస్‌లపై యువకులంతా ఒకచోట, 40 ప్లస్‌ పెద్దలంతా మరొకచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరికీ ఒకరిని మరొకరు తాకకుండా వుండాలనే భయం ఏ కోశానా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏదో చెబుతోందిఅనే ధ్యాసే తప్ప ఇలా గుంపులుగా తిరగడం వల్ల ప్రమాదం పొంచి వుందనే విషయం అర్థం కావడం లేదు. పోలీసులే వారికి దానిపై అవగాహన కల్పించాల్సి ఉంది. పోలీసులు తప్పనిసరిగా వీధుల్లో వాహనాల్లో తిరగాల్సిన అవసరం చాలా ఉంది. 


ఏమి చేయాలంటే...?


ఏదైనా అవసరం వుంటే ఒక కుటుంబం నుంచి ఒకరే బయటకు రావాలి. రెండు కి.మీ. పరిధిలో నిత్యావసరాలు కొనుక్కొని వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి.


పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రాకూడదు.


మధ్యాహ్నం ఒంటి గంట తరువాత అసలు అడుగు బయట పెట్టకూడదు.


అపార్టుమెంట్లో అంతా ఒక చోట చేరి హౌసీలు, పేకాటలు వంటివి ఆడకూడదు. ఎవరి ఇంట్లో వారే ఉండాలి.


ఫ్యామిలీని తీసుకొని స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, వారిని ఇళ్లకు ఆహ్వానించడం వంటివి చేయకూడదు.


ఇంట్లో కూడా వీలైతే సామాజిక దూరం పాటించాలి.


రోజుకు కనీసం పదిసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి.


నిత్యవసరాలు ఫోన్‌ చేసి డోర్‌ డెలివరీ చేయించుకోవచ్చు. దీనిని బాగా ఉపయోగించుకోవాలి. 

Updated Date - 2020-03-29T10:10:50+05:30 IST