కరోనా చికిత్స ఇంట్లోనే సురక్షితం

ABN , First Publish Date - 2020-08-18T18:30:16+05:30 IST

కరోనా సోకిన ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలో చికిత్స అవసరం లేదు! 80శాతం కరోనా బాధితులు ఇంటిపట్టునే నిర్భయంగా చికిత్సను కొనసాగించవచ్చు! లక్షణాలు, వాటి తీవ్రత, ఆరోగ్య దశలను బట్టి... ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్

కరోనా చికిత్స ఇంట్లోనే సురక్షితం

ఆంధ్రజ్యోతి(18-08-2020)

కరోనా సోకిన ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలో చికిత్స అవసరం లేదు! 80శాతం కరోనా బాధితులు ఇంటిపట్టునే నిర్భయంగా చికిత్సను కొనసాగించవచ్చు! లక్షణాలు, వాటి తీవ్రత, ఆరోగ్య దశలను బట్టి... ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) నిర్దేశించిన ప్రొటోకాల్‌ ఆధారంగా వైద్యులు కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్నారుఇదీ నిజం!


కరోనా సోకిన ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలో చికిత్స అవసరం లేదు! 80శాతం కరోనా బాధితులు ఇంటిపట్టునే నిర్భయంగా చికిత్సను కొనసాగించవచ్చు! లక్షణాలు, వాటి తీవ్రత, ఆరోగ్య దశలను బట్టి... ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) నిర్దేశించిన ప్రొటోకాల్‌ ఆధారంగా వైద్యులు కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్నారుఇదీ నిజం!


80శాతం ఇంట్లోనే వైద్యం తీసుకోవచ్చు!

15శాతం ఆస్పత్రిలో లేదా అవసరాన్ని బట్టి ఐసీయూలో చికిత్స అవసరం పడవచ్చు!

5శాతం ఆస్పత్రిలో కృత్రిమ శ్వాస అవసరం అవుతుంది.


కరోనా మీద పట్టు పెరిగింది. ప్రారంభంలో వైరస్‌ తత్వాన్ని కచ్చితంగా అంచనా వేయడంలో తడబాటు పడినా, క్రమేపీ వైరస్‌ తత్వం, తీవ్రతలను బట్టి చికిత్సను అందించే మెలకువలు అలవరుచుకున్నాం. కాబట్టే కోలుకునే వారి సంఖ్య పెరగడంతో పాటు, వెంటిలేటర్‌ అవసరాన్నీ తగ్గించుకోగలిగాం. అయితే కరోనా వైరస్‌ పట్ల భయాలను వదిలి, వైద్యుల సూచనలను తూచ తప్పక పాటిస్తూ, చికిత్సను తీసుకోగలిగితే ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి నుంచి చాకచక్యంగా తప్పించుకోవచ్చు. 


80శాతం మందికి ఆస్పత్రి చికిత్స అవసరం లేదు!

కరోనా పట్ల ఉన్న భయం కారణంగా, స్పల్ప లక్షణాలు కనిపించగానే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీనివల్ల ఎవరికైతే ఆస్పత్రి చికిత్స అవసరమో, వారికి బెడ్స్‌ కొరత ఏర్పడుతోంది. నిజానికి కరోనా సోకిన 80శాతం మంది ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. 


రిజల్ట్‌ పాజిటివ్‌ - లక్షణాలు నిల్‌!

కరోనా పాజిటివ్‌ ఫలితం వచ్చినా, లక్షణాలు లేని వ్యక్తులు ఇంటిపట్టునే 14 రోజుల పాటు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలి. వీరికి ప్రత్యేకమైన కరోనా మందులు అవసరం ఉండవు. వ్యాధినిరోధకశక్తి పెరిగేలా కంటినిండా నిద్ర పోవాలి. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారం, ఎక్కువ ద్రవాహారం తీసుకోవాలి. అలాగే రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడేలా జింక్‌, విటమిన్‌ సి, విటమిన్‌ డి సప్లిమెంట్లు తీసుకుంటే సరిపోతుంది. అయితే ప్రారంభంలో లక్షణాలు కనిపించకపోయినా రెండు నుంచి మూడు రోజుల వ్యవఽధిలో లక్షణాలు మొదలయ్యే అవకాశమూ ఉంటుంది. కాబట్టి లక్షణాలు లేకపోయినా, ఒకసారి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యాక, 14 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శరీర ఉష్ణోగ్రత గమనించుకుంటూ ఉండాలి. వీరిలో ‘హ్యాపీ హైపాక్సియా’ అనే సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గినా, వీరిలో ఆయాసం లాంటి లక్షణాలు కనిపించవు. ఈ స్థితిని గమనించడం కోసం పల్స్‌ ఆక్సీమీటరుతో రోజుకు మూడుసార్లు రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఆక్సిజన్‌ పరిమాణం 92ు కన్నా తగ్గితే వైద్యులను కలవాలి. ఈ పరికరాలు అందుబాటులో లేనివారు ఆపకుండా 1 నుంచి 30 వరకూ అంకెలు లెక్కపెట్టాలి. ఆయాసపడకుండా అంకెలన్నీ ఆపకుండా చెప్పగలిగితే ఫర్వాలేదు. ఆయాసపడుతుంటే ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. అలాగే సాధారణస్థితిలో 98ు ఉన్న ఆక్సీమీటరు ఫలితం, ఆరు నిమిషాల నడక తర్వాత ఐదు శాతం కన్నా తగ్గినా వైద్యులను సంప్రతించాలి. 


ఊపిరి అందకపోతుంటే?

ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేరుకోవాలి. వీరికి మొదట వైద్యులు నార్మల్‌ ఆక్సిజన్‌, తీవ్రతను బట్టి నాసల్‌ ఆక్సిజన్‌ అందిస్తారు. అప్పటికీ ఆక్సిజన్‌ సరిపోకపోతే ఇన్వేజివ్‌, నాన్‌ ఇన్వేజివ్‌ విధానాల్లో వెంటిలేటర్‌ను అమరుస్తారు. ఇన్వేజివ్‌ విధానంలో ఊపిరితిత్తుల్లోకి పైప్‌ ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తారు. నాన్‌ ఇన్వేజివ్‌ విధానంలో సీపాప్‌ (కంటిన్యుయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెజర్‌) అమరుస్తారు.


తీవ్ర రుగ్మతలున్నా ఇంట్లోనే....

మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కరోనా సోకినట్టు నిర్థారణ అయిన వెంటనే ఆస్పత్రులకు పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. వీరికి ఆయాసం లాంటి తీవ్ర లక్షణాలు లేకుంటే, ఇంటి నుంచే కరోనా చికిత్స పొందవచ్చు. ఇంటిపట్టునే ఉండి, రక్తనాళాల్లో గడ్డలు, ఇన్‌ఫ్లమేషన్‌లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ వైద్యులను ఆన్‌లైన్‌లో సంప్రతిస్తూ, చికిత్సతో కరోనా నుంచి కోలుకోవచ్చు.


ఆస్పత్రిలో చేరాల్సింది వీరే...

అరవై ఏళ్లు దాటిన పెద్దలు, అంతకంటే తక్కువ వయస్కులు... రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం 92ు కంటే పడిపోతూ ఉన్నా, ఊపిరి అందకపోయినా ఆస్పత్రిలో చేరక తప్పదు. రక్తపోటు త్వరితంగా పడిపోతున్నా ఆస్పత్రిలో చేరవలసిందే! అలాగే అయోమయం మొదలైనా నిర్లక్ష్యం చేయకూడదు. ఉమ్మి, కళ్లెలో రక్తం పడుతున్నా అప్రమత్తం కావాలి. ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉన్నా, చమటలు పడుతున్నా ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేరుకోవాలి.


లక్షణాలు పుష్కలం!

కరోనా వైరస్‌ లక్షణాలు ప్రధానంగా 13. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు, పొట్టలో నొప్పి, అయోమయం, ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం, వాసన, రుచి తెలియకపోవడం, ఆకలి మందగించడం... ఈ లక్షణాలు ఉంటే వారిలో వైరస్‌ త్వరితంగా పెరుగుతోందని అర్థం. అయితే అందరిలో ఇవన్నీ ఉండకపోవచ్చు. రెండు వేర్వేరు లక్షణాలు కలిసి ఉండవచ్చు. అలాగే ఈ లక్షణాలలో ఛాతీలో బరువు, ఆయాసం, అయోమయానికి లోనవడం, శరీరం నీలంగా మారడం లాంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే, ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి. స్వల్ప లక్షణాలు ఉంటే, హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండి, యాంటీవైరల్‌, యాంటీబయాటిక్‌ మందులు తీసుకోవాలి. జింక్‌, విటమిన్‌ సి, డి సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటితో పాటు లక్షణాలు తీవ్రం కాకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన మందులతో పాటు, యాంటీ హిస్టమిన్‌ కూడా తీసుకోవడం అవసరం. 


కరోనా లక్షణాలు మొదలైన ఐదు లేదా ఆరవ రోజు నుంచి వీరిలో ఇన్‌ఫ్లమేషన్‌, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడం లాంటి రెండు తీవ్ర లక్షణాలు తలెత్తే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పక పల్స్‌ ఆక్సీమీటరు, థర్మామీటరుతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకుంటూ ఉండాలి. కరోనా లక్షణాలు కనిపించిన అయిదో రోజు నుంచి, ప్రతి మూడు రోజులకు ఒకసారి శరీరంలో పెరిగే ఇన్‌ఫ్లమేషన్‌, రక్తపు గడ్డలను కనిపెట్టే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఫలితాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తే పరిస్థితిని అంచనా వేసి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కాగ్యులెంట్‌ మందులతో ఈ సమస్యలను అదుపుచేసుకోవచ్చు.


స్టిరాయిడ్‌... ఆధునిక సంజీవిని!

స్టిరాయిడ్‌ వాడుక పట్ల అంతటా అపోహలున్నాయి. ఈ మందులు వాడితే ఆరోగ్యం శాశ్వతంగా దెబ్బతింటుందనే అపోహతో స్టిరాయిడ్ల వాడకాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. నిజానికి కరోనా లక్షణాలు కనిపించిన ప్రారంభంలో స్టిరాయిడ్లను వాడడం ద్వారా ఆస్పత్రిలో చేరే పరిస్థితి రాకుండా నివారించుకోవచ్చు. అలాగే వెంటిలేటర్‌ దశకు వెళ్లకుండా చూసుకోవచ్చు. 


‘డెడ్‌ వైరస్‌’తో ప్రమాదం లేదు!

లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ ఫలితం వచ్చిన వారికి 14 రోజుల తర్వాత తిరిగి రెండోసారి పరీక్షించినప్పుడు వారిలోని వైరస్‌ కల్చర్‌లో పెరగడం లేదని ఐసిఎమ్మార్‌ (ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) గమనించింది. దీన్నిబట్టి ఐసొలేషన్‌ చివరి మూడు రోజుల్లో లక్షణాలు లేకపోతే, వారికి రెండోసారి కరోనా పరీక్ష అవసరం లేదు. ఒకవేళ ఆ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినా కంగారుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫలితంలో కనిపించిన వైరస్‌ డెడ్‌ వైరస్‌. ఈ వైరస్‌ కరోనా సోకిన రెండు నెలల వరకూ కూడా ఫలితాలను పాజిటివ్‌గానే చూపిస్తుంది. ఈవైరస్‌ వల్ల బాధితులకే కాదు, ఇతరులకూ హాని ఉండదు. 14 రోజుల తర్వాత కూడా లక్షణాలు ఉంటే, వారికి రెండోసారి కరోనా పరీక్ష చేయక తప్పదు.


ఆస్పత్రి ముప్పు!

కరోనా సోకిందనే భయంతో లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఆస్పత్రులకు పరుగులు తీయడం సరికాదు. ఆస్పత్రుల ద్వారా సెకండరీ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయి. అలాగే కరోనా సోకకపోయినా, సోకిందనే అనుమానంతో ఆస్పత్రులకు వెళ్లిన ఆరోగ్యవంతులకు కరోనా సోకే అవకాశం పెరుగుతుంది. కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఇంటి నుంచే చికిత్స తీసుకోవాలి.


ప్లాస్మా మార్పిడి ఉపయోగకరమే!

కరోనా సోకిన వారి శరీరంలో యాంటీబాడీల సంఖ్య తగ్గిపోవడం సహజం. వాటిని భర్తీ చేయడం కోసం కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను మార్పిడి చేసే చికిత్స అనుసరిస్తున్నారు. ఈ విధానం ద్వారా యాంటీబాడీలు కొంతమేరకు కరోనా వైరస్‌తో పోరాడి వ్యాధిని అదుపుచేయగలుగుతాయి. ఒక వ్య్తక్తి నుంచి స్వీకరించిన ప్లాస్మాతో ముగ్గురు కరోనా బాధితులకు చికిత్స చేయవచ్చు.


- డాక్టర్‌ సుభాకర్‌ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌, పల్మనరీ మెడిసిన్‌,

కామినేని మెడికల్‌ కాలేజి, హైదరాబాద్‌.


Updated Date - 2020-08-18T18:30:16+05:30 IST