కార్యాలయానికి కరోనా!

ABN , First Publish Date - 2020-06-05T09:50:50+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత ఐదు 5 రోజుల్లోనే జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా ..

కార్యాలయానికి కరోనా!

ఆస్పత్రి, ఐసీడీఎస్‌ కార్యాలయం, కియ పరిశ్రమలో వైరస్‌ బాధితులు..

జిల్లాలో 400కి చేరినట్లు సమాచారం

తాజాగా జిల్లా కేంద్రంలో ముగ్గురికి..

ఐసీడీఎస్‌ ఆఫీస్‌కు తాళం, హోం క్వారంటైన్‌కు 30 మంది..


 అనంతపురం వైద్యం, జూన్‌ 4: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత ఐదు 5 రోజుల్లోనే జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. అధికార వర్గాలు కేసుల సంఖ్య చెప్పకపోయినా వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు జిల్లాలో 400 వరకూ కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకూ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలు అధిక మంది కరోనా బారిన పడ్డారు. వారిని గుట్టుగా ఆస్పత్రులకు తరలించి, వైద్యసేవలు అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో పదిరోజుల్లోనే దాదాపు 160 మందిని ఇళ్లకు పంపించారు. తాజాగా ఉద్యోగవర్గాలు, కీలక ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు, వ్యాపారులు కరోనా బారిన పడుతున్నారు. పోలీసు శాఖలో శిక్షణ పొందుతున్న 9 మంది ఆర్‌ఎస్‌ఐలు కరోనా బారిన పడ్డారు. దీంతో పీటీసీలో హైటెన్షన్‌ నెలకొంది. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి కుటుంబంలో మహిళ కరోనాతో చనిపోగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పామిడి, తాడిపత్రి, యాడికి, బెళుగుప్ప, కదిరి, హిందూపు రం ప్రాంతాల్లో కూడా జిల్లావాసులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబసభ్యులు, కాంటాక్ట్‌లను గుర్తించి అధికారులు, క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాలో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తుండటం అధికారవర్గాలు, ప్రజలను ఆందోళనపరుస్తోంది.


గురువారం కూడా జిల్లా కేంద్రంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అనంతపురం రహమత్‌నగర్‌ నుంచి రాకపోకలు సాగిస్తూ లేపాక్షి పీహెచ్‌సీలో పనిచేసే మహిళా వైద్యురాలికి పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మరోసారి వైద్యవర్గాల్లో టెన్షన్‌ నెలకొంది. లేపాక్షి పీహెచ్‌సీలో పనిచేస్తున్న తోటి సిబ్బందిని హోం క్వారంటైన్‌కు పంపించారు. వైద్యురాలు ఆస్పత్రికి వచ్చిన పలువురికి చికిత్సలు అందించారు. ఆ రోగుల్లో ఆందోళన మొదలైంది. ఇంకోవైపు జిల్లా స్ర్తీ శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కార్యాలయ ఉన్నతాధికారులు ఇతర ఉద్యోగులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. దాదాపు 30 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారందరినీ హోం క్వారంటైన్‌కు పంపించారు. ఐసీడీఎస్‌ కార్యాలయానికి గురువారం సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేశారు. పక్కనేవున్న పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాల్లోనూ ద్రావణం పిచికారీ చేశారు. పాతూరు ఉమానగర్‌కు చెందిన 22 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను కొవిడ్‌-19 ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబసభ్యులు, కాంటాక్ట్‌లను క్వారంటైన్‌కు తరలించారు. కియ పరిశ్రమలో కరోనా కలవరం రేపింది.


పరిశ్రమలో పనిచేస్తున్న తమిళ నాడుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఆ వ్యక్తిని ఎస్కే యూ క్వారంటైన్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న వందలాది మందిలో టెన్షన్‌ మొదలైంది. ఇలా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న కరోనా కొత్త కేసులు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. అయినా అధికారులు మౌనం వీడలేదు. గుట్టుగానే వ్యవహారాలు సాగిస్తున్నారు. వాస్తవ సమాచారం చెప్పకుండా జనంతో ఆడు కుంటున్నారు.


అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తికి కరోనా ?

పుట్టపర్తి: బంధువుల అంత్యక్రియల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలుండటంతో క్వారంటైన్‌కు తరలించారు. పుట్టపర్తికి చెందిన ఓవ్యక్తి తాడిపత్రిలో ఇటీవల తమ సమీప బంధువు మృతిచెందటంతో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మృతుడికి కరోనా పాజిటివ్‌ అని తేలటంతో ఆ వ్యక్తిని అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. దీంతో సమీప నివాసాల్లో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.


కియలో కరోనా కలకలం

పెనుకొండ టౌన్‌: మండలంలోని అమ్మవారుపల్లి వద్ద ఉన్న కియ కార్లపరిశ్రమ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో పని చేసే కార్మికుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తమిళనాడుకు చెందిన కార్మికుడు మే 26న కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నాడు. గురువారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో అతడిని పెనుకొండ క్వారంటైన్‌ ఇన్‌చార్జ్‌ వైద్యుడు జగదీశ్‌, సీఐ శ్రీహరి, ఎస్‌ఐ గణేష్‌ పరిశ్రమ యజమానితో చర్చించి, అనంతపురం క్వారంటైన్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపు ఇవ్వడంతో మే 12 నుంచి 30శాతం మంది కార్మికులతో కార్ల ఉత్పత్తిని ప్రారంభించారు. పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. అయినా కరోనా సోకటం ఆందోళన కల్గిస్తోంది. వైరస్‌ సోకిన కార్మికుడు రోజూ అనంతపురం నుంచి యాజమాన్యం ఏర్పాటు చేసిన బస్సులో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.


యాజమాన్యాన్ని హెచ్చరించిన మంత్రి 

ఆరు రోజుల క్రితం బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పెనుకొండ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కియ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇత ర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి కార్మికుడికీ కొవిడ్‌ పరీక్షలు చేయించి, నెగిటివ్‌గా నిర్ధారణ అయిన తరువాతే విధుల్లోకి తీసుకోవాలని తెలిపారు. యాజమాన్యం తమిళనాడు కార్మికులకు మినహాయింపు ఇచ్చినట్లు దీనిని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే పోలీసులు, వైద్య సిబ్బంది కరోనా బాధితుడు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నాడో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రెడ్‌జోన్‌ ఏర్పాటుపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులతో తహసీ ల్దార్‌ నాగరాజు చర్చలు సాగించారు.


నేటి నుంచి పురంలో కొవిడ్‌-19 వైద్య సేవలు

హిందూపురం: పట్టణంలో శుక్రవారం నుంచి కొవిడ్‌-19 వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పట్టణంలోని జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి కొవిడ్‌-19 ఆసుపత్రిగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో 20 ఐసీయూ 30 నాన్‌ ఐసీయూ పడకలను ఏర్పాటు చేశారు. మూడు ప్రత్యేక వైద్య బృందాలు, మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.

Updated Date - 2020-06-05T09:50:50+05:30 IST