జిల్లాలో తాజాగా 12 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-06-05T09:22:06+05:30 IST

జిల్లాలో కరోనా కట్టడి కావడంలేదు. రోజూ పదికిపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి.

జిల్లాలో తాజాగా 12 మందికి కరోనా

వీవీఐటీ క్వారంటైన్‌లో ముగ్గురికి పాజిటివ్‌ 

వెలగపూడి సచివాలయంలో ఇద్దరికి వైరస్‌

తాడేపల్లి సీఎం నివాస సమీపంలో ఇద్దరికి కరోనా

గుంటూరులో పంచాయతీ సెక్రటరీకి, అతడి కుమార్తెకు

ఉండవలి, ఇనిమెట్లలో వలంటీర్లకు వైరస్‌తో స్థానికుల్లో ఆందోళన

జిల్లాలో 517కు చేరిన కేసుల సంఖ్య

  

జిల్లాలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ పదికిపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. గురువారం 12 మందికి వైరస్‌ వచ్చినట్లు వైద్యశాఖ నివేదికలు ద్వారా సమాచారం అందింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న ముగ్గురు వైరస్‌ బారిన పడ్డారు. తాడేపల్లిలోని సీఎం నివాస ప్రాంత సమీపంలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఉండవల్లి, ఇనిమెట్ల గ్రామాల్లో వలంటీర్లకు వైరస్‌ రావడంతో వారి నుంచి ఇటీవల పింఛన్లు తీసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ఢిల్లీ, కోయంబేడు మూలాలకు సంబంధించి జిల్లాలో వైరస్‌ తగ్గుతుంది అనుకుంటున్న తరుణంలో గుంటూరు మార్కెట్‌ నుంచి కరోనా విజృంభిస్తుండటంతో అటు ప్రజలు, ఇటు అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే గురువారం వచ్చిన నివేదికల్లో ఈ మర్కెట్‌ లింకులు లేవు. 


 గుంటూరు(సంగడిగుంట), మంగళగిరి, తాడేపల్లి టౌన్‌,  రాజుపాలెం, సత్తెనపల్లి, జూన్‌ 4: జిల్లాలో కరోనా కట్టడి కావడంలేదు. రోజూ పదికిపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. గురువారం 12 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు ముత్యాలరెడ్డినగర్‌కు చెందిన తండ్రి, కుమార్తెలకు పాజిటివ్‌ వచ్చింది. కుమార్తె గర్భవతి కావడంతో సాధారణ పరీక్షల కోసం వైద్యశాలకు వెళ్లగా ఆమెకు వైద్యులు కరోనా పరీక్షలు సూచించారు. దీంతో జీజీహెచ్‌లో పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఆమెతో కలిసి ఉంటున్న తండ్రికి కూడా పరీక్షలు చేయగా అతడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఆయన గుంటూరు సమీపంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. దీంతో కార్యాలయ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. పాతగుంటూరు బాలాజీనగర్‌ సమీపంలోని లాల్‌బహుదూర్‌నగర్‌కు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీరు సీతానగర్‌లో పాజిటివ్‌ ఉన్న వారికి దగ్గరి బంధువులని అధికారులు గుర్తించారు. అందువల్లే వీరికి వైరస్‌ వచ్చినట్లు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వీవీఐటీ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంటున్న మరో ముగ్గురికి పాటిజివ్‌ వచ్చింది. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 517కు చేరింది.


మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలో గురువారం మరో కేసు నమోదైంది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగులు గత నెల 27న హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు రాగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించి పంపించివేశారు. వీరిలో కొందరు మంగళగిరి మండల పరిధిలోని నవులూరు గోలివారితోటలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. గత నెల 30న వచ్చిన కరోనా పరీక్షల ఫలితాల్లో ఈ అపార్టుమెంటులోని ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికే ఆ ఉద్యోగి రెండు, మూడు రోజులు సచివాలయంలో విధులకు హాజరైనట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడితో ఉంటున్న వారితో కలిపి మొత్తం 14 మందిని ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి, కార్వంటైన్‌కు తరలించారు.


వీరికి పరీక్షలు నిర్వహించగా గురువారం వచ్చిన ఫలితాల్లో మరో ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వారు ఉన్న అపార్టుమెంటు వద్ద కరోనా నియంత్రణా చర్యలు చేపడుతున్నారు. కాజ గ్రామంలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ నలుగురిని క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళగిరి రత్నాల చెరువులోని పాజిటివ్‌ కేసు వ్యక్తి కాజ గ్రామంలో బంధువుల ఇంటికి రావడంతో వివరాలు సేకరించిన అధికారులు అతడి కుటుంబ సభ్యులు నలుగురిని క్వారంటైన్‌కు పంపుతున్నట్లు తెలిపారు. 


సీఎం నివాస సమీపంలో నాలుగు కేసులు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలోని ఎన్టీఆర్‌ కట్ట, క్రిస్టియన్‌పేటలలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. క్రిస్టియన్‌పేటలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి విజయవాడ కార్పొరేషన్‌లో శానిటరీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో ఉన్న ఎన్టీఆర్‌ కట్ట మీద నివాసం ఉండే ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. సదరు యువకుడు వెలగపూడి సచివాలయంలో చిరు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే క్రిస్టియన్‌ పేట ప్రాంత పరిధిలోని ఓ అపార్ట్మెంట్‌లో మహిళకు పాజిటివ్‌ రాగా, ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. సీఎం నివాసం ఉన్న ప్రాంతం, హై సెక్యూరిటీ జోన్‌ ఏరియా కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు, రెండు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి, కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలోని ఉండవల్లి గ్రామంలో ఓ వలంటీరుకు, మెల్లెంపూడి గ్రామంలో ఒకరికి కరోనా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వలంటీరు ఈ నెల 1న గుంటూరు జీజీహెచ్‌లో టెస్ట్‌ చేయించుకోగా వైరస్‌ వచ్చినట్లు తేలింది. మెల్లెంపూడి గ్రామంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కాంటాక్ట్‌ ఎలా అనేది ఇంకా గుర్తించలేదు. పాజిటివ్‌ కేసులు వచ్చిన రెండు గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు, ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.


రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన ఓ వలంటీర్‌కు పాజిటివ్‌ నిర్థారణ అయ్యినట్లు అధికారులు ప్రకటించారు. వలంటీరు ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరెవరిని కలిశాడు.. అనే వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సచివాలయానికి రావటంతో పాటు రాజుపాలెం మండలపరిషత్‌ కార్యాలయానికి కూడా వచ్చినట్లు సమాచారం. ఇతడు సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లకు సమీపంలో ఉన్న ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. దీంతో అక్కడ కూడా ఎవరెవరిని కలిశాడు అనే విషయాలను క్షుణ్ణంగా రాబడుతున్నారు. అతడ్ని గుంటూరు తరలించినట్లు తహసీల్దారు చెంచులక్ష్మి తెలిపారు.


సత్తెనపల్లిలో కరోనా మృతుడితో ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న ఎనిమిది మందిని గురువారం గుంటూరుకు పంపించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. సెకండరీ కాంటాక్ట్‌ ఉన్న 22 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచామన్నారు. భావనారుషినగర్‌లో ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. గుంటూరులో ఉన్న వారికి శుక్రవారం పరీక్షలు చేస్తారని తెలిపారు. 

Updated Date - 2020-06-05T09:22:06+05:30 IST