కొద్దిరోజులు సరదాలకు సెలవివ్వండి..

ABN , First Publish Date - 2022-01-20T16:11:04+05:30 IST

నగరంలో మాయదారి వైరస్‌ విజృంభిస్తోంది. నానాటికీ కేసులు పెచ్చుమీరుతున్నాయని వైద్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజులు సరదాలకు సెలవివ్వండి..

వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వైద్యుల విజ్ఞప్తులు


ఫిబ్రవరిలో జరిగే జాతరలో జనం తాకిడి ఎక్కువ ఉంటుందని సంక్రాంతి సెలవుల్లో సమ్మక్క సారక్కకు మొక్కు చెల్లిద్దామని మేడారం వెళ్లారు రామంతాపూర్‌కి చెందిన శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు. తిరుగు ప్రయాణంలో హన్మకొండలోని బంధువులనూ పరామర్శించి వచ్చారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు పాజిటివ్‌ అయ్యాయి. అందులో తొమ్మిదేళ్ల పాపను, పదకొండేళ్ల బాబునూ వదల్లేదు మాయదారి వైరస్‌. వారెవ్వరికీ ప్రాణాపాయం లేకపోవచ్చు కానీ ఇల్లంతా పడకేయడంతో వాళ్ల రోజూవారీ జీవితానికి బ్రేక్‌ పడినట్లు అయింది.


మియాపూర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హేమంత్‌ భార్యా, పిల్లలతో కలిసి సంక్రాంతికి సొంతూరెళ్లి వస్తూ కరోనానూ వెంటపెట్టుకొని వచ్చాడు. పైగా ఆయన నిర్లక్ష్యం వల్ల డెభ్భై ఏళ్లు దాటిన తన తల్లిదండ్రులూ ఇన్ఫెక్షన్లకు లోనయ్యారు. అసలే ఆస్తమాతో బాధపడుతున్న ఆ పెద్దలను మాయదారి వైరస్‌ మరింత వేదనకు లోనుచేసింది. ఇదే విషయాన్ని అతను సోషల్‌మీడియాలో వ్యక్తం చేస్తూ ‘తన అనాలోచిత నిర్ణయానికి ఇప్పుడు ఇంటిల్లపాది నరకయాతన అనుభవిస్తుంది. కనుక ఆ తప్పు మరెవ్వరూ చేయొద్దు’ అని ఇతరులను వేడుకుంటున్నాడు.


హైదరాబాద్‌ సిటీ, జనవరి19 (ఆంధ్రజ్యోతి): నగరంలో మాయదారి వైరస్‌ విజృంభిస్తోంది. నానాటికీ కేసులు పెచ్చుమీరుతున్నాయని వైద్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని ముందస్తుగా హెచ్చరించినా, చాలామంది పెడచెవిన పెట్టడంతో కొన్ని కాలనీలలో ఇళ్లకు ఇళ్లు కొవిడ్‌తో మంచం పట్టాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులు సరదాలకు సెలవు ఇవ్వాలని హితవు పలుకుతున్నారు. 


వేగంగా వ్యాప్తి..

 కూకట్‌పల్లి, బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఒక్కరోజే 320 పాజిటివ్‌ కేసులు రావడం కరోనా మూడో దశవ్యాప్తి వేగానికి అద్దం పడుతోంది. రామాంతపూర్‌లోని ఒక్క ఆరోగ్య కేంద్రంలో 205 శాంపిల్స్‌లో 63 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకు మాత్రమే బయటకు రావాలని నగరవాసులకు వైద్యులు సూచిస్తున్నారు. అంతవరకు సామూహిక కార్యక్రమాలు, వేడుకలకూ దూరంగా ఉండటం మంచిదని హితవు పలుకుతున్నారు. షికార్లు సైతం కొద్దిరోజులు మానుకోవాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-01-20T16:11:04+05:30 IST