అనుక్షణం భయం... భయం!

ABN , First Publish Date - 2020-07-28T18:39:56+05:30 IST

‘కరోనా... మన దాకా రాదులే!’ అనుకున్నాం. వచ్చి, మొండిగా తిష్ఠ వేసింది. ‘మనల్ని కబళించే దమ్ము దానికి లేదులే!’ అనుకున్నాం

అనుక్షణం భయం... భయం!

ఆంధ్రజ్యోతి(28-07-2020)

భయాన్ని భయపెడదాం!

 అనునిత్యం ఎడతెగని బెంగ! 

రాత్రుళ్లు నిద్ర పట్టనంత ఆందోళన!

ఏమవుతుందో? ఏం జరుగుతుందో? 

అందరిలో ఇదే కరోనా కలవరం!

ఇలాంటి భయాందోళనలు అవసరమా? 

మానసిక వైద్యులు ఏమంటున్నారు? 


‘కరోనా... మన దాకా రాదులే!’ అనుకున్నాం. వచ్చి, మొండిగా తిష్ఠ వేసింది. ‘మనల్ని కబళించే దమ్ము దానికి లేదులే!’ అనుకున్నాం. క్రమంగా విస్తరించి, తన ప్రతాపం చూపించింది. కేసులు పెరుగుతున్నా, మరణాల సంఖ్య తక్కువే! అయినా ఊహించని పరిణామానికి బెంబేలుపడిపోతున్నాం. తగిన రక్షణ చర్యలు పాటిస్తే సోకే వీలుండదని తెలిసినా, కంగారుపడిపోతున్నాం. భయంతో వణికిపోతున్నాం. మరణాల గురించిన వార్తలు వినేకొద్దీ లోలోపల ఆందోళనపడిపోతున్నాం. దీనికి ఆర్ధిక ఒడుదొడుకులు తోడై, భవిష్యత్తు అగమ్యగోచరమై మరింతగా మానసికంగా కుంగిపోతున్నాం. అయితే ఇలాంటి విపత్తు ఇదే మొదటిది కాదు. ఇంతకుముందు ఇంతకంటే పెద్ద మహమ్మారులను ఎదుర్కొన్నవాళ్లమే! ఎంతటి వైరస్‌ అయినా విస్తృతి విపరీతంగా పెంచుకుని, శిఖరాగ్రానికి చేరి, క్రమేపీ కృశిస్తూ చివరికి అంతం కాక తప్పదని పూర్వపు అనుభవాల నుంచి అర్థం చేసుకోవాలి. అంతకన్నా ముఖ్యంగా వాస్తవికంగా ఆలోచించి మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి.


డెడ్‌లైన్స్‌ వద్దు!

వైరస్‌ త్వరలో అంతరించిపోతుందనీ, వీలైనంత త్వరలో కరోనా వ్యాక్సీన్‌ అందుబాటులోకి రాబోతోందనీ, కొద్ది రోజుల్లోనే ఈ వైర్‌సను చంపే మందులు తయారవుతాయనీ... ఇలాంటి ఆలోచనలకు, ఊహలకు డెడ్‌లైన్స్‌ పెట్టుకోవడం సరికాదు. ఈ ఆశల వల్ల తాత్కాలికంగా ధైర్యం కలిగినా, డెడ్‌లైన్‌లోగా అవి నెరవేరనప్పుడు దిగాలు పడిపోతాం, నిరుత్సాహపడిపోతాం. మానసికంగా కుంగిపోతాం. కాబట్టి ఆశలు వాస్తవికంగా, శాస్త్రీయంగా ఉండాలి. ‘అప్పుడెప్పుడో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా అంది. ఫలానా శాస్త్రవేత్తలు అలా చెప్పారు కదా? ఇలా ఎందుకు జరగలేదు?’ అనే వాదన కూడా వ్యర్ధమే!


భయాలు పలు రూపాల్లో...

ఊహకు అందని అంశాల పట్ల భయాలు పెరగడం సహజం. మరీ ముఖ్యంగా సున్నిత మనస్తత్వం కలిగినవారిలో ఇలాంటి భయాలు అధికం. అయితే వీరిలో ప్రధానంగా భయాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవేమిటంటే...


నాకు సోకితే: ప్రతి ఒక్కరిలో కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతోకొంత ఉంటుంది. అందుకు తగ్గట్టు రక్షణ చర్యలు పాటిస్తూ ఉంటారు. అయితే కొందరిలో ఆ భయం మరింత ఎక్కువగా పేరుకుపోయి, విపరీతమైన భయాందోళనలకు లోనవుతూ ఉంటారు.


ఆత్మీయులకు సోకితే: ‘‘నా ద్వారా నా ఆత్మీయులకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందేమో?’’ అనే భయం మరికొందరిలో ఉంటుంది. అలా సోకుతుందేమో అనే ఆందోళనతో నిరంతరం సతమతం అయిపోతూ ఉంటారు.


ఆస్పత్రులకు వెళ్లేదెలా?: కరోనా సోకుతుందేమో అనే భయం కన్నా ఎక్కువగా కొందరిలో ఇతర భయాలు ఉంటాయి. ‘‘ఈ సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే, ఆస్పత్రులకు వెళ్లేదెలా? ఒకవేళ వెళ్తే కరోనా సోకే అవకాశాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది’’... అనే భయాలు కొందరిని వేధిస్తూ ఉంటాయి.


పెద్దలు దేహాంతులైతే?: ఇంట్లో పెద్దలు ఉండి, వారు దేహాంతులైతే... ‘వారి అంత్యక్రియలను జరిపించేదెలా?’ అనే చిత్రమైన భయాలూ కొందరిలో ఉంటాయి. కరోనా వ్యాప్తి చెందిన ఈ సమయంలో ‘పెద్దల అంత్యక్రియలను దగ్గర ఉండి, సక్రమంగా నిర్వహించలేమేమో?’ అనే ఆందోళన వీరిది.


మెంటల్‌ ఇమ్యూనిటీ కూడా ముఖ్యమే!

కరోనా సోకకుండా శారీరక వ్యాధినిరోధకశక్తి ఎంత అవసరమో, మానసిక వ్యాధినిరోధకశక్తి కూడా అంతే అవసరమని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యానికి పోషకభరిత ఆహారం ఎంత అవసరమో, మానసిక ఆరోగ్యానికి మానసిక స్థైర్యం అంతే ముఖ్యం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి ఓర్పు, సహనాలతో శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ, ఫలితంగా కరోనా నుంచి రక్షణ దక్కుతుందని పలు పరిశోధనల్లో కూడా రుజువైంది. కాబట్టి భయాలకు కళ్లెం వేసి, మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి.


గెలుపు మనదే!

వ్యాక్సీన్‌ రాబోతోంది అనే ఆశ పెంచుకోవడం మంచిదే! అయితే వ్యాక్సీన్‌ అందరూ అనుకున్నంత త్వరగా సాధ్యపడదనే వాస్తవాన్నీ గ్రహించాలి. ఇలాంటి పాండమిక్స్‌ వచ్చిన ప్రతి సందర్భంలో, 80% నుంచి 90% మంది ప్రజానీకానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాతే వ్యాక్సీన్‌ తయారవుతూ ఉంటుంది. గతంలో తయారైన వ్యాక్సీన్లకు ఇంత కాలపరిమితి ఉంది. దీన్నిబట్టి కేవలం 10% మంది మిగిలిన ప్రజానీకానికి, భవిష్యత్తు తరాలకు ఈ వ్యాక్సీన్‌తో లబ్ది ఉంటుంది. అప్పటికే పాండమిక్‌ అంతానికి చేరువై ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. అలాగే ఎలాంటి వైరస్‌ అయినా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న తర్వాతే క్రమేపీ తీవ్రత తగ్గించుకుని అంతమైపోతూ ఉంటుంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా, మరణాల రేటు తగ్గుతుంది. కాబట్టి వైరస్‌ తీవ్రత పతాకస్థాయిలో ఉన్నప్పుడు మానసిక స్థైర్యంతో పోరాడిన మనం అది అంతరించే సమయంలో డీలా పడిపోవడం సరికాదు. అంతిమంగా వైరస్‌ మీద మనదే గెలుపు అనే ఆత్మస్థైర్యం పెంచుకోవాలి.


కాలక్షేపాలు, అభిరుచులు!

మనసును ఉల్లాసంగా ఉంచే పనుల్లో నిమగ్నమైతే మానసిక కుంగుబాటు, ఆందోళనలు అదుపులో ఉంటాయి. కరోనా సంబంధిత వార్తలు, సందేశాలు చదువుకుంటూ బెంబేలు పడిపోకుండా శాస్త్రీయంగా నిర్ధారించుకోవాలి. అందుకోసం వైద్యులను ఆశ్రయించాలి. అలాకాకుండా గుడ్డిగా నమ్మితే, మనం మోసపోవడమే కాకుండా, వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ చేసి వాళ్లను మోసం చేసినవాళ్లం అవుతాం. కుటుంబసభ్యులతో గడపడం, ఆటలు ఆడడం, టీవీలో సినిమాలు చూడడం, కలిసి వంటచేయడం లాంటి ఉల్లాసభరిత కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. దైవ భక్తి కలిగిన వాళ్లు భక్తి ఛానళ్లు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ మీద ఆసక్తి కలిగినవాళ్లు లైఫ్‌స్టైల్‌ ఛానళ్లు చూడడం మేలు. మానసిక సాంత్వన కోసం ధ్యానం, ప్రాణాయామం సాధన చేయాలి.


టైమ్‌లైన్‌ లెక్క సరికాదు!

‘కరోనా వచ్చి అప్పుడే నాలుగు నెలలు అయ్యిందా? అమ్మో! ఇప్పటికే ఇంతమంది చనిపోయారా? ఇప్పటికే ఇన్ని పాజిటివ్‌ కేసులు వచ్చేశాయా? కరోనా ఇంకో ఏడాది పాటు ఉంటుందా? ఆలోగా నా ఉద్యోగం పోతే ఏం చేయాలి? పిల్లల చదువులు, వారి భవిష్యత్తు ఏమిటి?’ ఇలా సమయానికి లంకె పెట్టి ఆలోచించి కంగారు పడకూడదు. ఇలాంటి సమాధానం దొరకని ఆలోచనల దొంతర ఓ సుడిగుండం లాంటిది. అది మనల్ని లోలోపలికి లాగేసి, మానసిక కుంగుబాటుకు గురిచేస్తుంది. 


చిట్కాలు ఆచి తూచి!

వేడి నీళ్లు లేదా కషాయం తాగడం, ఆవిర్లు పట్టడం లాంటి చిట్కాలతో దీర్ఘకాలంలో గ్యాస్ర్టిక్‌ అల్సర్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడో చదివిన, విన్న చిట్కాలు, సొంత వైద్యాలూ అనుసరించడం సరికాదు. ఇలాంటి వాటితో వైరస్‌ నుంచి రక్షణ దొరికే విషయం అలా ఉంచితే, లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం.


అప్పటి అలవాట్లే ఇప్పుడూ...

అంటువ్యాధి వచ్చిన ప్రతి సందర్భంలోనూ మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి ఆరోగ్య సూత్రాలను దశాబ్దాల నుంచీ అనుసరిస్తూ వస్తున్నాం. శాస్త్రీయంగా ఎంత అభివృద్ధి సాధించినా ఇవే ఆరోగ్య సూత్రాలను  ఇప్పటికీ అనుసరించక తప్పదు. కాబట్టి కరోనా వ్యాప్తి గురించి చింతిస్తూ కూర్చోవడం కన్నా, రక్షణ చర్యలను పాటించడం మీద దృష్టి పెట్టడం అవసరం.


మొండి ధైర్యం తగదు!

ప్రారంభంలో కరోనా రక్షణ చర్యలను శ్రద్ధగా పాటించిన మనం ఇటీవలి కాలంలో కొంత అశ్రద్ధ కనబరుస్తున్నాం. విసుగు ఎక్కువ మందిలో కలుగుతోంది. రక్షణ చర్యలను నిర్లక్ష్యం చేస్తే మనతో పాటు, మన కుటుంబసభ్యులకూ కరోనా సోకే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మరో రెండు - మూడు నెలలు ఇదే పోరాటాన్ని కొనసాగించాలి.


షార్ట్‌టర్మ్‌ గోల్స్‌!

‘‘మున్ముందు కరోనా ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందో? భవిష్యత్తు ఎలాంటి మలుపు తిరగబోతోందో?’’ లాంటి ఆలోచనలకు స్వస్థి చెప్పి, వర్తమానం మీద మనసు పెట్టాలి. ‘ఈ రోజు పోషకాహారం తిన్నామా? సమయానికి పడుకున్నామా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా? మన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చామా?’ లాంటి స్వల్పకాలిక లక్ష్యాల మీద దృష్టి పెట్టాలి.



మనోధైర్యం వీడకూడదు!

గుండెపోటు వస్తుందని తెలిసీ, ధూమపానం మానలేని వారు ఉన్నట్టే, కరోనా ఎలా సోకుతుందో తెలిసీ రక్షణ చర్యలు పాటించని వారు ఉంటారు. ఇవేవీ పాటించకుండా కరోనా సోకుతుందేమో అని భయపడడంలో అర్ధం లేదు. ఒకవేళ కరోనా సోకి, పాజిటివ్‌ ఫలితం వచ్చినా, ఇక అంతా అయిపోయిందని ఆందోళన పడడమూ సరికాదు. పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థీ ఫలితాలు విడుదలై, పాసయినట్లు తేలేవరకూ ఆందోళన పడుతూనే ఉంటాడు. ‘నువ్వు పరీక్షలు బాగానే రాశావు. కచ్చితంగా పాసవుతావు’ అని ఎవరు, ఎంత చెప్పినా పిల్లల్లో ఆందోళన తగ్గదు. కరోనా సోకిన వారిలో కూడా ఇదే రకమైన ఆందోళన ఉండడం సహజమే! అయితే ఇలాంటి సమయంలో గణాంకాలను గమనించాలి. కరోనా సోకిన వారిలో 98% మంది పూర్తిగా కోలుకుంటున్నారు. మరణాల సంఖ్య కేవలం 2 శాతమే! కాబట్టి మనోధైర్యం వీడకూడదు.


- డాక్టర్‌ ఎమ్‌.ఎస్‌ రెడ్డి, సైకియాట్రిస్ట్‌

ఆశ హాస్పిటల్‌, హైదరాబాద్‌.



మానసిక సమస్యలు ఉంటే?

యాంగ్జయిటీ డిజార్డర్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌, ఫోబియాలు ఉన్నవాళ్లు ఈ సమయంలో మరింత తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. ‘చూశారా నేను భయపడిందే నిజం అయ్యింది’ అని యాంగ్జయిటీ డిజార్డర్‌ ఉన్నవాళ్లు అంటూ ఉంటారు. ‘చూశారా... నేను ఇంత శుభ్రంగా ఉండబట్టే కరోనా నాదాకా రాలేదు, నా పద్ధతే కరెక్ట్‌’’ అంటారు. అయితే ఇలాంటివాళ్లు పదే పదే ఇల్లు కడగడం, లేదా గదికే పరిమితమై కుటుంబసభ్యులకు దూరంగా ఉండిపోవడం చేస్తే, వారి భయాలను కుటుంబసభ్యులు దూరం చేసే బాధ్యత తీసుకోవాలి. ‘‘నీది అర్ధం లేని భయం, నేను నీలా భయపడుతున్నానా?’ అంటూ కటువుగా మాట్లాడి, వాళ్లను బలవంతం చేయకుండా నెమ్మదిగా నచ్చజెప్పి వాళ్ల భయాలను దూరం చేయాలి. అలాగే అప్పటికే వాడుతున్న మందులను కొనసాగించాలి. అవసరాన్నిబట్టి మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి.


- డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి, 

క్లినికల్‌ సైకియాట్రిస్ట్‌,

ల్యూసిడ్‌ డయాగ్నొస్టిక్స్‌, హైదరాబాద్‌.


Updated Date - 2020-07-28T18:39:56+05:30 IST