కరోనా కంగారు

ABN , First Publish Date - 2020-08-09T06:49:30+05:30 IST

అవసరం అన్నీ నేర్పిస్తుందన్న పెద్దల నానుడి మరోసారి రుజువైంది. ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు బతుకు బండి..

కరోనా కంగారు

  • బతుకుదెరువుకు భిన్న మార్గాలు

అవసరం అన్నీ నేర్పిస్తుందన్న పెద్దల నానుడి మరోసారి రుజువైంది. ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు బతుకు బండి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటేనే జీవనం నడుస్తుంది. రక్షణ చర్యలు లేనట్టు కనిపిస్తే వినియోగదారులు భయపడుతున్నారు. స్వేచ్ఛగా వ్యాపారం, ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి. కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా లేకపోవడంతో ఉన్న బడ్జెట్‌తో, మధ్యతరగతి మేధస్సును ఉపయోగించి నల్లగొండ జిల్లా కేంద్రంలో వ్యాపారులు భిన్న మార్గాలు అనుసరిస్తున్నారు.


పాలిథిన్‌ కవర్లతో రక్ష

నల్లగొండ పట్టణం వీటీకాలనీ హనుమాన్‌ దేవాలయం పక్కన ఉండే ఓ మెడికల్‌షాపు యజమాని వనం జ్జానేశ్వర్‌ పాలిథిన్‌ కవర్లతో దుకాణాన్ని 75శాతం కవర్‌ చేశాడు. మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే ‘ఓ వైన్‌ షాపు వారిని చూశా.. మాకు మెడికల్‌ కార్టన్‌లకు పెద్ద మొత్తంలో పాలిథిన్‌ కవర్లు వస్తాయి.. నేనెందుకు చేయకూడదు అనుకొని వెంటనే మొదలు పెట్టా, దుకాణం ముప్పావు భాగం కవర్‌ అయ్యేలా ప్లాన్‌ చేశా, గతంలో కౌంటర్‌ మీద చేతులు పెట్టి మాట్లాడేవారు, ఎవరు పాజిటివో, ఎవరు నెగిటివో అడగలేం, గుర్తుపట్టలేం, ఇప్పుడు ఆ బాధలేదు ఉన్నంతలో ఏర్పాటు చేశా’ అన్నారు.


నల్లగొండ పట్టణంలోని పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్‌ రాజేష్‌ ఇదే తరహాలో ఆలోచన చేశారు. ‘కరోనా భయంతో ఇంట్లో కూర్చుం టే సంసారం నడవదు, ఇది ఎప్పుడు పోద్దో ఎవరూ చెప్పే పరిస్థితి లేదు, నేను బయట తిరగాలన్నా, గిరాకీ రావాలన్నా ఏదో చేయకతప్పదని నా సీటుకు కస్టమర్లు కూర్చునే సీటుకు మధ్య పలుచటి కవరు తెర ఏర్పాటుచేశా. నేను కూడా చేతికి గ్లౌజులు, మాస్క్‌, ముఖానికి షీల్డ్‌ పెట్టుకుంటున్నా, ఇప్పుడు కొంతభయం తగ్గింది, కస్లమర్లకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాన్న భావనలో ఉన్నారు’ అని చెప్పాడు.


నల్లగొండ పట్టణంలోని ఎన్‌జీ కళాశాల కు ఎదరుగా ఓ కంపెనీ సిమ్‌ కార్డుల అమ్మకా లు,రీఛార్జ్‌ షోరూం డీలర్‌ శేఖర్‌రెడ్డి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ తాడు కట్టి, దానికి పాలిథిన్‌ కవర్‌ వేలాడదీసి క్లిప్పులు పెట్టారు. భౌతికదూరం పాటించేలా నేలపై రెండు బాక్సు లు గీయించి ఇద్దరే వచ్చేలా ఏర్పాటుచేశారు.


‘మాది నిత్యం డబ్బులతో వ్యాపారం, రిజిస్టర్డ్‌ చిట్స్‌ నిర్వహిస్తున్నాం. కరెన్సీతో కరోనా వైరస్‌ సోకుతుందన్న సమాచారం తెలుసుకుని; జాగ్రత్తలు మొదలు పెట్టాను. రూ.6వేల వ్యయంతో శానిటైజర్‌ మిషన్‌ కొనుగోలు చేశా. మా సిబ్బంది క్యాష్‌ కలెక్షన్‌కు వెళ్లి లోపలికి వస్తూనే హాల్‌లో సోఫాపై డబ్బుల సంచి పెట్టేస్తారు. శానిటైజర్‌ మిషన్‌తో కరెన్సీ నోట్లను శానిటైజ్‌ చేస్తారు, అవి కొంచెం మెత్తగా మారుతాయి. కొద్దిసేపు ఫ్యాన్‌ కింద ఆరబెడతాం. శానిటైజర్‌ లిక్విడ్‌ వారానికి లీటరు పడుతుంది. నెలకు రూ.4వేలు అదనపుఖర్చు, సిబ్బందికిప్రతిరోజూ డిస్పోజబుల్‌ హ్యాండ్‌ గ్లౌజులు ఇచ్చాం, ఖర్చు అని భయపడితే పని జరగదు’ ఓ చిట్స్‌ యజమాని తేలుకుంట శ్రీనివాస్‌ తెలిపారు.


పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పాజిటివ్‌ కేసులు అధికంగా ఉండటంతో నల్లగొండ ఎస్పీ పీఆర్‌ఓ రామకృష్ణ శానిటైజ్‌ మిషన్‌ కొనుగోలు చేశారు. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆయన పిల్లలు శానిటైజ్‌ చేస్తున్నారని రామకృష్ణ తన అనుభవాన్ని పంచుకున్నారు.


Updated Date - 2020-08-09T06:49:30+05:30 IST