మళ్లీ కరోనా టెన్షన

ABN , First Publish Date - 2022-07-04T07:08:37+05:30 IST

కరోనా అంటేనే రెండేళ్ళపాటు జనం బెంబేలెత్తిపోయారు. ఆ మహమ్మారి దెబ్బకు వేలాది మంది ప్రాణాలు పోయాయి

మళ్లీ కరోనా టెన్షన

పక్క రాషా్ట్రల్లో విజృంభణ

అనంత జిల్లాలోనూ మొదలైన అలజడి

అటకెక్కిన కొవిడ్‌ నిబంధనలు

అనంతపురం టౌన జూలై 3: కరోనా అంటేనే రెండేళ్ళపాటు జనం బెంబేలెత్తిపోయారు. ఆ మహమ్మారి దెబ్బకు వేలాది మంది ప్రాణాలు పోయాయి. అనేక కుటుంబాలు ఛిద్రమైపోయాయి. అయితే ఇటీవల కొన్ని నెలల నుంచి వైరస్‌ ప్రభావం తగ్గడంతో కరోనా అంటే జనంలో ఒకింత భయం లేకుండా పోయింది. దీంతో కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేశారు. పాలకులు, అధికారులు సైతం కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. పెద్దఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తూ జనాన్ని సమీకరిస్తున్నా మాస్క్‌లు, భౌతికదూరం పాటించడం లేదు. అయితే మళ్ళీ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తూ వస్తోంది.  కర్ణాటక, తెలం గాణ, తమిళనాడు రాషా్ట్రల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశలోనూ వివిధ జిల్లాలో వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. అక్కడక్కడ పాజిటివ్‌ కేసులు రావడంతో పాటు వైరస్‌ వేగంగా పాకుతూ వస్తోంది. కొందరు ఎంఎల్‌ఏలు, అధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అనంత జిల్లాలోనూ వైరస్‌ అలజడి రేపుతోంది. సత్యసాయి జిల్లాలో ఇటీవల ఆరు రోజుల క్రితం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది.  డెల్టా, ఒమైక్రాన పేరుతో వైరస్‌ జనంపై విరుచుకుపడుతూ వచ్చింది. అనంత జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 1.78 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1150 మంది వరకు మరణించారు. దాదాపు 4వేల మంది వరకు కరోనా వైర్‌సకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా సాయం కోసం ఇంత మంది దరఖాస్తు చేసుకోవడంతో మరణాల రేటు ఆ స్థాయిలో పక్కాగా కనిపిస్తోంది.  అందుకే కరోనా అంటేనే జనంలో ఓ రకమైన భయం ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. ఇప్పుడు ఫోర్త్‌ వేవ్‌ కరోనా అంటుంటే మరింత ఆందోళన చెందాల్సి వస్తోంది.


 మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలి..: డాక్టర్‌ విశ్వనాథయ్య, డీఎంహెచఓ

కరోనా వైరస్‌ పోయిందన్న భావన సరికాదు. మళ్ళీ వైరస్‌ ప్రభావం దేశంలో విజృంభిస్తూ వస్తోంది. తొలుత కూడా ఇలాగే ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి జనాన్ని వెంటాడింది. అందుకే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలి. ఎక్కువ జన సమూహంలో తిరగకుండా ఉండాలి. ఒకవేళ వెళితే తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 200 వరకు శాంపిల్స్‌ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువగా జీరో వస్తున్నాయి. ఇటీవల సత్యసాయి జిల్లాలో ఆరు కేసులు వచ్చాయి. అందుకే మళ్ళీ ఆందోళన పడాల్సి వస్తోంది. 

Updated Date - 2022-07-04T07:08:37+05:30 IST