కరోనాతో పాతబస్తీ పరిస్థితి ఎలా ఉందో చూడండి..

ABN , First Publish Date - 2021-05-06T14:33:18+05:30 IST

ఇరుకైన గల్లీలు, చిన్న రోడ్లు.. అంతకంటే చిన్న ఇళ్లలో పెద్దపెద్ద కుటుంబాలు..

కరోనాతో పాతబస్తీ పరిస్థితి ఎలా ఉందో చూడండి..

  • పాతబస్తీ.. సుస్తీ
  • 15 వేలకుపైగానే కరోనా కేసులు  
  • అధికారిక లెక్కలకు మించి.. 
  • మృతులూ ఎక్కువే..  

హైదరాబాద్‌ సిటీ : ఇరుకైన గల్లీలు, చిన్న రోడ్లు.. అంతకంటే చిన్న ఇళ్లలో పెద్దపెద్ద కుటుంబాలు.. వెరసి పాతబస్తీ. ఇక్కడ కరోనా విజృంభిస్తోంది. నిర్లక్ష్యం, అవగాహన లేమి కారణంగా ఇక్కడి వారు ఈజీగా వైరస్‌ బారిన పడుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఈ ఏడాది  మార్చి నుంచి ఏప్రిల్‌ చివరి వరకు  పాతబస్తీ పరిధిలో అధికారికంగా లెక్కలు ఎలా ఉన్నప్పటికీ, సుమారు 15 వేలకుపైగా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 200మంది మృత్యువాత పడ్డారు. ఇంకా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ చాలా మంది ఆస్పత్రులకు వెళ్లకుండా వివిధ రకాలుగా చికిత్సలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో భారీగా నష్టపోతున్నారు. చాలా మంది బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. చాలా మంది ఇళ్ల వద్దే ఉంటూ, కొందరు హకీమ్‌ల వద్ద, ఇంకొందరు చిన్నచిన్న ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు కోలుకుంటున్నప్పటికీ, చిన్నారులు.. వృద్ధులు, ఇతర రోగాలు ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా కొందరు ప్రైవేట్‌ వైద్యులు, నర్సింగ్‌ హోం నిర్వాహకులు భయాందోళనలకు గురి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


పొంతన లేని లెక్కలు..

అధికారిక లెక్కల ప్రకారం మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటివరకు 1300కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  మాదన్నపేట్‌, ఆజాంపుర, చాదర్‌ఘాట్‌ ప్రాంతాల్లో 700కి పైగా  పాజిటివ్‌లు ఉన్నాయి. చార్మినార్‌,  చాంద్రాయణగుట్ట  ప్రాంతాల్లో మూడు వేలకు పైగా పాజిటివ్‌లు కేసులు నమోదు అయ్యాయి. బహదూర్‌పుర ప్రాంతంలో సుమారు 2000, రాజేంద్రనగర్‌లో  మూడు వేల వరకు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. యాకుత్‌పురా, రెయిన్‌ బజార్‌ ప్రాంతాల్లో రెండు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇలా పాతబస్తీలో ఇప్పటికే 15వేలకు పైగా ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అంచనా. ఇందులో సుమారు వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ అధికారిక లెక్కల కంటే సుమారు ఐదు రెట్లు అధికంగా పాతబస్తీలో కేసులు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. పాతబస్తీలోని శ్మశానవాటికకు రోజుకు సగటున ఐదు నుంచి ఆరు మృతదేహాలు వస్తున్నాయని శ్మశానవాటికల నిర్వాహకులు చెబుతున్నారు. అందరూ కరోనాతో మరణించకున్నా, ఎక్కువగా అవే ఉండే అవకాశముందని అంటున్నారు.

Updated Date - 2021-05-06T14:33:18+05:30 IST