కార్యదర్శులపై వ్యక్తిగత దూషణలు తగదు

ABN , First Publish Date - 2021-05-17T15:48:33+05:30 IST

కరోనా రెండో దశ ఉధృతి గ్రామాల్లో..

కార్యదర్శులపై వ్యక్తిగత దూషణలు తగదు

పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ


విజయవాడ: కరోనా రెండో దశ ఉధృతి గ్రామాల్లో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులపై జిల్లా అధికారులు వ్యక్తిగత దూషణకు దిగడం ఏమాత్రం సముచితంకాదని అంధ్రప్రదేశ్‌ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ అన్నారు. క్షేత్రస్థాయిలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలేగానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం తగదన్నారు. విజయవాడ రూరల్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు కొత్తా శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. 


ఇటీవల కొన్ని గ్రామాలను సందర్శించిన జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులే లక్ష్యంగా వ్యక్తిగత దూషణలకు దిగడంపై సమావేశంలో సీరియ్‌సగా చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ను కలసి వినతిపత్రం సమర్పించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కార్యదర్శులపై వ్యక్తిగత దూషణలు, కుటుంబసభ్యుల గురించి అనుచితంగా మాట్లాడే అధికారులు ఏ స్థాయిలో ఉన్న వారైనప్పటికీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరాలని నిర్ణయించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ మాట్లాడుతూ, గ్రామాలలో పారిశుధ్య నిర్వహణతోపాటు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేరవేయడంలో కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి కార్యదర్శుల భద్రత, సంక్షేమానికి సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.


రాష్ట్రంలో కొవిడ్‌బారినపడి మృతి చెందిన కార్యదర్శుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసహాయం చేయాలని సమావేశం తీర్మానించిందన్నారు. ప్రతి పంచాయతీకి పీపీఈ కిట్లు, శానిటైజన్స్‌, గ్లౌవ్స్‌, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. కరోనాకు గురైన పంచాయతీ కార్యదర్శులకు విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌ కోవిడ్‌ సెంటర్‌లో 20 బెడ్‌లను కేటాయించినందుకు సంఘం తరపున కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి ఘంటా రామ్మోహనరావు, నాయకులు షైనాజ్‌బేగం, రవికుమార్‌, బసవలింగేశ్వరరావు, మస్తాన్‌రావు, అనీల్‌, శివరంగారావు, వెంకటరత్నం, శివరామ్‌ప్రసాద్‌, రాయన రమేష్‌, కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T15:48:33+05:30 IST