యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-27T09:23:47+05:30 IST

గుంటూరు మంగళదాసునగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు.

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

జిల్లా అధికారుల సమీక్షలో మంత్రి నాని

ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచన


గుంటూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గుంటూరు మంగళదాసునగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. గుంటూరులో పాజిటివ్‌ కేసుతో  సీఎం జగన్‌ సీరియస్‌గా తీసుకుని మంత్రిని గుంటూరుకి పంపించగా ఆయన గురువారం జిల్లా మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణారావుతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలు.. ఇంకా ఏమి చేస్తే బావుంటుందన్న దానిపై అధికారుల అభిప్రాయాలను సేకరించారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంగళదాసునగర్‌లో కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి నివాస చుట్టూత 3 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 9,800 ఇళ్లు ఉన్నట్లు అధికారులు సర్వే ద్వారా గుర్తించారు.


ఆ ప్రాంతం అంతటా వ్యాధి నివారక చర్యలు చేపట్టేందుకు 75 పారిశుధ్య బృందాలను నియమించినట్లు కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మంత్రులకు నివేదించారు. వ్యాధి సోకిన వ్యక్తి ఇంట్లో ఐదుగురు బంధువులు ఉండగా వారిని విజయవాడలోని కోవిడ్‌ సెంటర్‌కు తరలించామన్నారు. ఆయనతో ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించిన 16 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించామని,ఆయనతో సన్నిహితంగా మెలిగే  మరో 13 మందిని గుర్తించి వాళ్లని హోం ఐసోలేషన్‌కు పంపించి వైద్య బృందాలతో పహారా కాస్తోన్నట్లు నివేదించారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన 2,400 మందిని గుర్తించి వారందరినీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో ఉంచామన్నారు. బ్లాక్‌మార్కెటింగ్‌ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. ఏప్రిల్‌ రేషన్‌ ఈ నెల 29 నాటికి అన్ని షాపుల్లో పంపిణీని ప్రారంభించాలని,  ఏప్రిల్‌ 4న ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి ఆర్థికసాయం అందజేయాలని అధికారులకు మంత్రులు సూచనలు చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. సరుకుల రవాణా చేసే వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. సమావేశానికి గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు, అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. 

Updated Date - 2020-03-27T09:23:47+05:30 IST