ముక్క మోజులో లాక్‌డౌన్‌ బేఖాతర్‌

ABN , First Publish Date - 2020-04-06T10:51:15+05:30 IST

జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు.

ముక్క మోజులో లాక్‌డౌన్‌ బేఖాతర్‌

చికెన్‌ షాపుల ముందు గుంపులుగా జనం


    లాక్‌డౌన్‌లో రోజూ సెలవే అయినా ఆదివారం కావడంతో జనమంతా ఒక్కసారిగా మాంసాహారం కోసం ఎగబడ్డారు. ఓ వైపు కరోనా పాజిటివ్‌  చికెన్‌, మటన్‌ షాపుల ముందు నిబంధనలు మరిచి గుంపులుగా నిలబడ్డారు. చిత్తూరు మొదలుకుని తిరుపతి, పలమనేరు, మదనపల్లె, కుప్పం, శ్రీకాళహస్తి ఒకటేమిటి అన్ని ఊళ్లలో జనం వేలంవెర్రిగా పద్ధతి లేకుండా గుంపులుగా చేరి కొనుగోళ్లు జరపడం అధికార యంత్రాంగాన్ని, పోలీసులను  నివ్వెరపరిచింది. చాలా చోట్ల మాస్కులు కూడా ధరించకుండా జనం బయటకు రావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

- చిత్తూరు



ఏమిటిది బాధ్యత లేకుండా!

యథేచ్ఛగా లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన

నాన్‌వెజ్‌ కొనుగోళ్లకు గుంపులుగా ఎగబడిన జనం


చిత్తూరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం మాంసం కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. ఉదయం 11 గంటల వరకు కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదు.


కేసులు అధికంగా నమోదైన శ్రీకాళహస్తిలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఆదివారం ఒక్కరోజే 7 పాజిటివ్‌ కేసులు వచ్చాయంటే జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తీరును అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలోనూ ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. భౌతిక దూరం పాటించకుండా.. మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. ఫలితంగా జిల్లాలో మరిన్ని కేసులు పెరిగేందుకు అవకాశం ఉంది.


శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆరు పాజిటివ్‌ కేసులు ఉండగా.. ఒక్క శ్రీకాళహస్తి పట్టణంలోనే మూడు కేసులున్నాయి. ఆయా ప్రాంతాలన్నీ రెడ్‌జోన్‌లుగా ప్రకటించినా.. ప్రజలు అస్సలు ఖాతరు చేయడం లేదు. ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలో మాంసం దుకాణాల వద్ద ప్రజలు నిబంధనలు పాటించకుండా పెద్దఎత్తున ఎగబడ్డారు. అలాగే కుప్పంలోని మటన్‌, ఫిష్‌ మార్కెట్‌ వద్ద ఆదివారం ఉదయం 11 గంటల వరకు జనం పెద్దఎత్తున గుంపులు కట్టారు.


తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో ఆదివారం మాంసం విక్రయాలను నిషేధించారు. కానీ.. కార్పొరేషన్‌ పరిధి దాటాక అమ్మకాలు విస్తృతంగా జరిగాయి. జిల్లా కేంద్రం చిత్తూరులో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించారు. మాంసం దుకాణాల వద్ద రద్దీ పెద్దగా కనిపించలేదు. 


మదనపల్లెలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేశారు. మాంసం దుకాణాలను కూడా 20 శాతం తెరవగా.. అక్కడా ప్రజలు కన్పించలేదు. పలమనేరులో మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించారు. పోలీసులు కల్పించుకుని లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. కేవీబీపురం చేపల మార్కెట్‌లో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించారు. నగరి నియోజకవర్గంతో పాటు కార్వేటినగరం వంటి  ప్రాంతాల్లో ఎక్కడా మాంసం దుకాణాలు తెరుచుకోలేదు. వాయల్పాడు మండలంలో మాంసం దుకాణాల వద్ద ప్రజల హడావిడి కనిపించలేదు. 


 ఐరాల మండలంలోని 35 ఎర్లంపల్లె పంచాయతీ దివిటివారిపల్లె గ్రామంలో కరోనా విపత్తు నగదు పంపిణీలో రూ.వందను సీఎం సహాయనిఽధి కోసం స్థానిక వలంటీర్‌ వసూలు చేశారు. ప్రశ్నించిన యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. చికిత్స కోసం అతనికి చిత్తూరు ఆసుపత్రికి తరలించగా.. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.


Updated Date - 2020-04-06T10:51:15+05:30 IST