కాంటాక్టు.. కలవరం

ABN , First Publish Date - 2020-04-10T06:19:05+05:30 IST

జిల్లాలో నిన్నటిదాకా 27గా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు గురువారం నాటికి ఒకేసారి 38కి చేరాయి.

కాంటాక్టు.. కలవరం

జిల్లాలో 38కి చేరిన కరోనా రోగులు

క్వారంటైన్‌లకు వందలసంఖ్యలో అనుమానితులు

జిల్లావ్యాప్తంగా ఐసోలేషన్‌ వార్డుల్లో 

2వేల పడకలను సిద్ధం చేసిన వైద్య ఆరోగ్యశాఖ


ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 9: జిల్లాలో నిన్నటిదాకా 27గా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు గురువారం నాటికి ఒకేసారి 38కి చేరాయి. బుధవారం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటంతో ఇక తగ్గుముఖం పడతాయిలే అనుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఒకేసారి 11 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ఖంగుతిన్నారు. ఇంతకీ గురువారం నమోదైన 11 పాజిటివ్‌ కేసుల్లో 10కేసులు ఒంగోలు ఇస్లాంపేటకు చెందినవి కావటం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే ఇస్లాంపేటలో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా గురువారం ఈ ప్రాంతం నుంచే మరో 10 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ ఒక్క ప్రాంతంలోనే 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటం ఆందోళనకరమే. గురువారం నమోదైన ఇంకో కేసు ఒంగోలులోని గోపాలనగరానికి చెందిన వారు. 


కాగా ఇస్లాంపేటలో గురువారం వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఒక ద్వితీయ శ్రేణి నాయకుడికి నాలుగురోజుల క్రితం కరోనా నిర్ధారణ అయ్యింది. గురువారం అందిన ఫలితాల్లో అతని తండ్రికి, కొడుక్కి, భార్యకు, కుటుంబ సభ్యుడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ కుటుంబంలోని అందరూ వైరస్‌ బారిన పడినట్లైంది.


పాజిటివ్‌ రోగుల కుటుంబసభ్యులందరినీ రిమ్స్‌కు తరలింపు

గురువారం అందిన స్వాబ్‌ ఫలితాల్లో ఇస్లాంపేట ప్రాంతానికి చెందిన వారే ఉండటంతో ఆ ప్రాంతంలో ఇప్పటివరకు పాజిటివ్‌గా తేలిన వారి బంధువులను అందరినీ రిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ హాస్టల్‌కు శుక్రవారం తరలించనున్నారు. వీరు మొత్తం 55మంది ఉంటారని అధికారులు గుర్తించారు. వీరిని రిమ్స్‌ వెనుక వైపు ఉన్న సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల వసతిగృహంలో ఒక్కొక్కరిని ఒక్కో గదిలో వేర్వేరుగా ఉంచనున్నారు. పరీక్షలు నిర్వహించనున్నారు. వీరిలో ఇప్పటికే వైరస్‌ సోకిన వారు ఉంటే వారి నుంచి ఇంకొకరికి సోకుండా ఉండేందుకు పాజిటివ్‌ కేసులు కుటుంబసభ్యులను రిమ్స్‌లోని వసతిగృహాలకు తరలించనున్నారు.


మతపెద్దలతో అత్యవసర సమావేశమైన కలెక్టర్‌

ఒకే ప్రాంతంలో కేసులు అధికంగా నమోదు అవుతుండటం, వైరస్‌ వ్యాప్తిని నిరోధించటంలో ఆ ప్రాంతం వారి నుంచి తగిన సహాకారం అందక పోవటంతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ గురువారం మతపెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరోనావ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తగిన సహకారం అందించాలని కోరారు. ఆ ప్రాంతంలోని వారు ప్రత్యేక పరీక్షలు చేయించుకునేందుకు, ప్రభుత్వం చేపడుతున్న అన్ని చర్యలకు తగిన సహకారం అందించాలని కలెక్టర్‌ వారికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి చర్యలను వేగవంతం చేస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో వారికి ఒకరి నుంచి ఇంకొకరికి సోకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నారు.


ఎవరి భోజన వసతి ఏర్పాట్లు వారే చేసుకునే అవకాశం

రిమ్స్‌లోని సీనియర్‌ రెసిడెంట్‌ వసతిగృహానికి తరలించే పాజిటివ్‌ రోగుల కుటుంబసభ్యులు వంట ప్రభుత్వం కాకుండా వారే చేసుకునే విధంగా అధికారులు అవకాశం కల్పించారు. ఇతరులు వండి పెట్టే భోజనంతో వారి విశ్వాసాలకు ఇబ్బంది కలుగకుండా వారే వంట కార్యక్రమాల్ని నిర్వహించుకునే ఏర్పాట్లు చేశారు. వీరికి ఏర్పాట్లు చేసేందుకు ఇన్‌చార్జిగా డిఫ్యూటి కలెక్టర్‌ వసంతబాబును నియమించారు.


బంధువులు, అనుమానితులు రైజ్‌కు..

పాజిటివ్‌ రోగుల కుటుంబసభ్యులను రిమ్స్‌లోని సీనియర్‌ రెసిడెంట్‌ వసతి గృహానికి తరలిస్తున్న అధికారులు ఇతర బంధువులను, వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తించారు. 150మందికి పైగా ఉన్న వీరిని స్థానిక రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు తరలించి క్వారంటైన్‌లో ఉంచనున్నారు. వీరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. వీరిలో ఎక్కువమంది నుంచి ఇప్పటికే స్వాబ్‌ తీసి పరీక్షల కోసం పంపించగా మిగిలిన వారి నుంచి కూడా స్వాబ్‌ తీసి పరీక్షలు నిర్వహించనున్నారు.


5వేల మందికి మాస్కులు, శానిటైజర్లు

ఇస్లాంపేట ప్రాంతంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని మార్గాలను అధికారులు అన్వేసిస్తున్నారు. ఆ ఏరియాలో ఉంటున్న 5 వేలమందికి ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్లను యుద్ధప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. వైరస్‌ సోకుండా తీసుకోవాల్సిన చర్యలపై తగిన అవగాహన కల్పించనున్నారు. 


2వేల పడకల ఐసోలేషన్‌లు సిద్ధం

జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రయివేట్‌, ప్రభుత్వ వైద్యశాలల్లో ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేస్తున్నారు. 2వేల పడకలను ఐసోలేషన్‌లో సిద్ధం చేస్తున్నారు. ఒంగోలులోనే 200పడకలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే ప్రయివేట్‌ వైద్యశాల కిమ్స్‌లో పాజిటివ్‌ రోగులకు చికిత్స అందిస్తుండగా రెండు మూడురోజుల్లో సంఘమిత్రకు కూడా పాజిటివ్‌ రోగులను తరలించేందుకు చర్యలు చేపట్టారు.


ఏఎన్‌ఎం, ఆశలకు స్వాబ్‌ పరీక్షలు

ఒకవైపు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు వారికి సేవలు అందిస్తున్న వైద్యసిబ్బంది పాజిటివ్‌ రోగులు ఉన్న ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు కూడా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తుండటంతో వారి స్వాబ్‌లను కూడా పరీక్షల కోసం పంపిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 100మందికి పైగా ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు చెందిన స్వాబ్‌లను పరీక్షల కోసం పంపించారు. 


Updated Date - 2020-04-10T06:19:05+05:30 IST